బీహార్ సీఎం రేసులో ట్విస్ట్: సమ్రాట్ చౌదరికి సవాల్‌గా సంజీవ్ చౌరాసియా
x

బీహార్ సీఎం రేసులో ట్విస్ట్: సమ్రాట్ చౌదరికి సవాల్‌గా సంజీవ్ చౌరాసియా

నితీష్ రాజ్యసభకు వెళ్లే వేళ, బీహార్ సీఎం ఎంపికలో కీలకంగా మారిన ఈబీసీ ఫాక్టర్.. సమ్రాట్ చౌదరికి బదులుగా చౌరాసియా పేరు ముందుకు రావడానికి కారణాలేమిటి?


Click the Play button to hear this message in audio format

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై అధికార ఎన్డీఏలో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యూహంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి.

ఈబీసీపై దృష్టి సారించిన బీజేపీ..

బీహార్‌లో అత్యంత వెనుకబడిన తరగతులు (EBC) సుమారు 36 శాతం కీలక ఓటు బ్యాంక్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ వర్గాన్ని నితీష్ కుమార్ సమర్థంగా ఆకర్షించారు. ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్తున్న వేళ, ఆ ఓటు బ్యాంక్‌ను కోల్పోకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈబీసీ వర్గానికి చెందిన నాయకుడిని సీఎం చేయాలనే ఆలోచనకు ప్రాధాన్యం పెరిగింది.

సమ్రాట్ చౌదరికి ఎదురుదెబ్బ..

ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌదరి సీఎం రేసులో ఉన్నా..ఆయన ఎంపికపై పార్టీ అంతర్గతంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చౌదరి ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ఉండడం, కోయిరీ/కుష్వాహా వర్గ ఓట్లను పూర్తిగా ఆకర్షించలేకపోవడం, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న అసంతృప్తి, మిత్రపక్షాల్లోనూ పూర్తి మద్దతు లేకపోవడం కారణాలతో కేంద్ర నాయకత్వం ఆయన ఎంపికపై వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

సంజీవ్ చౌరాసియా ఎదుగుదల..

ఈ పరిస్థితుల్లో సంజీవ్ చౌరాసియా పేరు కూడా ప్రతిపాదనకు వచ్చింది. దిఘా నుంచి వరుసగా గెలుస్తున్న ఆయన, ఈబీసీ వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈబీసీ వర్గానికి చెందిన ప్రతినిధిగా, క్షేత్రస్థాయిలో బలమైన అనుభవం,

ఇతర వెనుకబడిన వర్గాలతో సమన్వయం చేసుకోని వెళ్లడం, వివాదరహిత ఇమేజ్ ఈయనకు ఉన్న ప్లస్ పాయింట్లు. ఈ కారణాలతో ఆయన పేరును బీజేపీ పరిశీలిస్తోంది.

‘ఆత్మనిర్భర్’ లక్ష్యంతో ముందుకు..

నితీష్ అనంతరం బీహార్‌లో జేడీయూ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈబీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం అత్యంత కీలకంగా భావిస్తోంది. ఈబీసీ వర్గానికి సీఎం పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గంలో బలమైన పట్టు సాధించడం, ఆర్జేడీ ప్రభావాన్ని తగ్గించడం, భవిష్యత్ ఎన్నికల్లో స్వతంత్రంగా ఎదగడం సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తుంది.

నితీష్ వైదొలిగిన తర్వాత బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయి. కుల ఆధారిత రాజకీయాల్లో ఈబీసీ వర్గం కీలకంగా మారుతోంది. ఇప్పటి వరకు ఓబీసీ నేతగా ఉన్న సమ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నప్పటికీ, మారుతున్న రాజకీయ లెక్కల్లో ఈబీసీ కార్డ్ బీజేపీకి లాభదాయకంగా కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే, బీహార్ సీఎం ఎంపిక కేవలం వ్యక్తిగత ప్రతిష్ట కాదు. ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు, కుల సమీకరణాలు, దీర్ఘకాల వ్యూహాల సమ్మేళనం. ఈ నేపథ్యంలో సమ్రాట్ చౌదరిని అధిగమించి సంజీవ్ చౌరాసియా ముందుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read More
Next Story