
నెతన్యాహూ, మజ్తాబా ఖమేనీ చిత్రాలు
'నెతన్యాహూ.. నిన్ను వెంటాడి చంపడం ఖాయమన్న' ఇరాన్
పిల్లల ప్రాణాలు తీసిన నువ్వు బతికి ఉండకూడదన్న ఇరాన్ సైన్యం
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ సైనిక విభాగం 'ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్' (IRGC) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నెతన్యాహును లక్ష్యంగా వారు చేసిన హెచ్చరికలు సంచలనం సృష్టించాయి.
ఇరాన్ అగ్రనేతలపైన, ఇరాన్ భూభాగంపైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల సమయంలో నెతన్యాహు భద్రతపై అనేక ఊహాగానాలు, ధృవీకరించని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే AFP వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు, ఇరాన్ సైన్యం నెతన్యాహును తమ ప్రధాన లక్ష్యంగా ప్రకటించినట్లు నివేదించాయి.
గతంలో సైనిక స్థావరాలను లక్ష్యంగా ఇరాన్, ఇప్పుడు నేరుగా దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తమ మాతృభూమిపై దాడులకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని, నెతన్యాహును "అంతం చేయడం" తమ తదుపరి అడుగు అని IRGC హెచ్చరించింది. నెతన్యాహును ఎక్కడ ఉన్నా సరే ‘వెంబడించి చంపుతామని’ ఇరాన్ గార్డ్స్ ప్రతిజ్ఞ చేశారు.
ఒక దేశ ప్రధానిని చంపుతామని బహిరంగంగా ప్రకటించడం దౌత్యపరమైన నిబంధనలను ఉల్లంఘించడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇజ్రాయెల్ భద్రత మరింత కట్టుదిట్టం
ఈ హెచ్చరికలపై ఇజ్రాయెల్ తన భద్రతను మరింత కఠినతరం చేసింది. ఇరాన్ చేస్తున్న ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని, తమ దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యకైనా వెనుకాడబోమని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు వ్యక్తిగత దాడుల హెచ్చరికల స్థాయికి చేరుకుంది. ఇది కేవలం ప్రాంతీయ పోరాటంగానే మిగిలిపోతుందా లేదా ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బెంజామిన్ నెతన్యాహు బతికే ఉన్నారా?
పశ్చిమాసియాలో యుద్ధం రగులుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నెతన్యాహు క్షేమ సమాచారంపై అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహాలు ఒకవైపు, ఆయనను వెంబడించి తీరుతామని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు మరోవైపు ఉత్కంఠను రేపుతున్నాయి.
వైరల్ అవుతున్న 'ఆరు వేళ్ల' వీడియో..
నెతన్యాహు మరణించారనే పుకార్లకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోనే కారణమైంది. ఇరాన్‌తో యుద్ధం గురించి ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఆ వీడియోను నెటిజన్లు నిశితంగా పరిశీలించగా, అందులో నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించింది.
దీనిని గమనించిన నెటిజన్లు అది నిజమైన వీడియో కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించిన ఫేక్ వీడియో అని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
అమెరికా కన్జర్వేటివ్ వ్యాఖ్యాత కాండేస్ ఓవెన్స్ స్పందిస్తూ.. "బీబీ (నెతన్యాహు ముద్దుపేరు) ఎక్కడ? ఆయన కార్యాలయం ఎందుకు ఫేక్ ఏఐ వీడియోను విడుదల చేసి, ఆపై తొలగించింది?" అని ప్రశ్నించడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది.
ఇజ్రాయెల్ కార్యాలయం వివరణ
ఈ ఊహాగానాలు మితిమీరడంతో నెతన్యాహు కార్యాలయం అధికారికంగా స్పందించింది. ఆ వార్తలన్నీ తప్పుడు ప్రచారాలని (Fake News) కొట్టిపారేసింది. ప్రధాని బెంజామిన్ నెతన్యాహు క్షేమంగానే ఉన్నారని, ఆయన తన విధుల్లో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేస్తూ ఈ మిస్టరీకి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
‘వెంటాడి చంపుతాం’.. ఇరాన్..
నెతన్యాహు క్షేమంపై ఇజ్రాయెల్ వివరణ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఇరాన్ సైనిక విభాగం ఐఆర్జీసీ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. "పిల్లల ప్రాణాలు తీసే వ్యక్తి (నెతన్యాహు) ఇంకా బతికే ఉంటే.. మా శక్తి మేరకు ఆయన్ని వెంటాడి తీరుతాం." అని ఇరాన్ దళాలు ప్రతిజ్ఞ చేశాయి. నెతన్యాహు ప్రస్తుత స్థితిపై ఇంకా అస్పష్టత ఉందని, ఆయన ఇరాన్ దాడుల్లో మరణించి ఉండవచ్చని లేదా ప్రాణభయంతో కుటుంబంతో సహా దేశం విడిచి వెళ్లిపోయి ఉండవచ్చని ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది.
Next Story

