చైనా లోని తియాంజిన్ వేదికగా ఈ మధ్య జరిగిన ఎస్సీఓ సమ్మిట్ లో పాక్ తో చైనా అంటిముట్టనట్లుగా వ్యవహరించడం చూస్తే ఇవి అనుమానాలు కావని తెలుస్తోంది. తాజాగా సీపీఈసీలో భాగంగా నిర్మించబోయే ఎల్-1 రైల్వే ప్రాజెక్ట్ కు చైనా ఎలాంటి నిధులు విడుదల చేయలేదు.
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చైనా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలలో సీపీఈసీ ప్రాజెక్ట్ ను కనీసం ప్రస్తావన కూడా కమ్యూనిస్టు దేశం తీసుకురాలేదు. ఇందుకు బదులుగా 8.5 బిలియన్ డాలర్ల ఎంఓయూ కుదుర్చుకున్నారు.
ఇందులో వ్యవసాయం, ఎలక్ట్రానిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ, ఆరోగ్యం, స్టీల్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మౌలిక వసతులు రంగంలో భారీ మొత్తంలో నిధులు వస్తాయనే పాక్ అంచనాలకు చైనా గండికొట్టింది.
బీజింగ్, ఇస్లామాబాద్ ను పక్కన పెట్టడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. ఈ మధ్య ఆ దేశ జనరల్ అసిమ్ మునీర్ రెండుసార్లు అమెరికా వెళ్లారు. పాత మిత్రుడితో కొత్త సంబంధాలు బలంగా నెరపడం కూడా కమ్యూనిస్టు దేశానికి మింగుడు పడటం లేదు.
ఇదే సమయంలో భారత్, చైనా, రష్యా లు కలిసి స్నేహం చేయడం కూడా ఒక కారణం. భారత్ తో స్నేహం చేయాలంటే కచ్చితంగా పాక్ ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి చైనాది. అందుకే జియో పొలిటికల్ గేమ్ లో అది న్యూఢిల్లీ వైపు మొగ్గు చూపింది.
గ్వాదర్ టూ చైనా..
అరేబియా సముద్రం తీరంలో ఉన్న గ్వాదర్ పోర్టు నుంచి చైనాలోని జిన్జియాంగ్ రాష్ట్రానికి నేరుగా అనుసంధానం చేయడానికి రోడ్డు, రైలు మార్గాలతో పాటు పైపులైన్, విద్యుత్ ప్రాజెక్ట్ లను నిర్మించడానికి చైనా ముందుకు వచ్చింది.
బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద మూడు వేల కిలోమీటర్ల వెంట మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడానికి బీజింగ్ నడుం బిగించింది. ఈ మార్గం ద్వారా దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతో వ్యాపార వాణిజ్యం విస్తరించి పాక్, చైనాలకు లాభం చేకూరుతుందని ప్రణాళిక వేశారు.
తద్వారా రెండు దేశాల జీడీపీకి సీపీఈసీ గణనీయమైన మద్దతు ఇస్తుందని భావించారు. ఇందుకోసం 60 బిలియన్ డాలర్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
రక్షణ కల్పిస్తాం..
బీజింగ్ లో ఆరురోజుల పాటు పర్యటించిన షరీఫ్.. పాక్ లో పనిచేసే చైనా పౌరులకు కచ్చితంగా రక్షణ కల్పిస్తామని హమీ ఇచ్చారు. చైనా పెట్టుబడిదారులకు పాక్ లో భద్రతా సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని ఆయన ప్రత్యక్షంగా అంగీకరించినట్లు అయింది.
చైనా నుంచి పెట్టుబడులో జాప్యం, పరిపాలనపరమైన చిక్కులపై కూడా షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చైనా అంగీకారం లేకుండా సీపీఈసీ రెండో దశ పనులపై పాక్ ప్రధాని ఏకపక్షంగా ప్రకటించడం రెండు దేశాల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని తెలియజేస్తోంది.
సీపీఈసీ చైనా వైదొలుగుతుందా?
సీపీఈసీ ప్రధాన లైన్(ఎల్-1) రైల్వే ప్రాజెక్ట్ కు ఆర్థిక సాయం చేయడానికి చైనా నిరాకరించిన తరువాత పాక్ ఇప్పుడు ఆసియా అభివృద్ది బ్యాంకు వైపు చూస్తోంది. కరాచీ- రోహ్రి సెక్షన్ ను అభివృద్ది చేయడానికి రెండు బిలియన్ డాలర్ల రుణం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కరాచీ నుంచి పెషావర్ దాదాపు 1800 కిలోమీటర్ల దూరం ఈ లైన్ విస్తరించి ఉంది. ఎల్-1 అప్ గ్రేడ్ లో ఇది అతిపెద్దది, కీలకమైనది. అయితే దశాబ్ధ కాలం తరువాత జరిగిన చర్చలలో పాక్ ఆర్థిక పరిస్థితి, భద్రతా ప్రమాణాలు అడుగంటుతున్న నేపథ్యంలో ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి చైనా నిరాకరిస్తోంది.
ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి నిధులు స్వీకరించడం, ఎల్-1 ప్రాజెక్ట్ నుంచి చైనా వైదొలగడం సీపీఈసీ ముగింపు కాకపోవచ్చు. కానీ రెండు దేశాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని ఇది సూచిస్తుంది.
2015-2019 మధ్య హైవేలు, విద్యుత్ ప్లాంట్లు, ఓడ రేవులు నిర్మాణం జరిగింది. చివరి ప్రధాన ప్రాజెక్ట్ అయిన గ్వాదర్ ఈస్ట్ బే ఎక్స్ ప్రెస్ హైవే 2022 లో చైనా పూర్తి చేసింది.
అయితే ఆ తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాకు పాక్ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తరుచు పెండింగ్ పెడుతుండటంతో ఉద్రిక్తతలు ఉద్భవించాయి.
చైనా వెనకడుగుకు కారణం?
ఎల్-1 ప్రాజెక్ట్ నుంచి చైనా ఆకస్మాత్తుగా తప్పుకోలేదు. పాక్ ఆర్థిక పరిస్థితిని చాలాకాలంగా నిశితంగా గమనిస్తున్న చైనా, తరుచుగా డిఫాల్ట్ జోన్ లోకి పాక్ జారుకోవడం, కుప్పల తెప్పలుగా అప్పులు చేస్తుండటంతో దానికి ఆందోళన కలిగించింది.
చైనా ఆర్థిక పరిస్థితి కూడా ఇందుకు మరో కారణం. స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు, అంతర్జాతీయ ప్రాజెక్ట్ లపై ఆ దేశానికి అనాసక్తి కలిగించింది. తనకు నష్టం కలిగిస్తున్న ప్రాజెక్ట్ లకు బిలియన్ల కొద్ది డాలర్లను ఖర్చు చేయడానికి అది పునరాలోచన చేస్తోంది.
పాక్ కూడా పదే పదే ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ పై ఆధారపడటం కూడా చైనా వైఖరికి ప్రధాన కారణం. పాక్, చైనాల మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ దాని ఆర్థిక పరిమితుల, పరిస్థితుల దృష్ట్యా వేరే గత్యంతరం లేకపోయింది. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లపై కేవలం ఒకే ఒక దేశంపై ఆధారపడటం పాక్ దుర్భలత్వాన్ని హైలైట్ చేసింది.
ఎల్-1 లైన్ ఏడీబీ నిధులు?
పాక్ లోని అతిపెద్ద రాష్ట్రమైన బెలుచిస్తాన్ లో దొరికే రాగి, బంగారు గనులతో ఎల్-1 ను అనుసంధానించాల్సి ఉంది. కెనడియన్ మైనింగ్ దిగ్గజం బారిక్ గోల్డ్ ఇక్కడ రెకో డిక్ గని తవ్వుతోంది. ఇక్కడ అతిపెద్ద ట్యాప్ చేయని ఖనిజ నిక్షేపాలలో ఒకటి. భవిష్యత్ లో పాకిస్తాన్ ఆదాయాలను ఇది అమాంతం పెంచుతుందని అక్కడి పాలకులు భావిస్తున్నారు.
అయితే గని నుంచి ఓడరేవులకు ఖనిజాన్ని రవాణా చేయడానికి అవసరమైన లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. రెకో డిక్ నుంచి భారీ కార్గో వాహానాలను ఇది సరఫరా చేయలేకపోతోంది. ఇది జరగాలంటే దీనిని భారీగా విస్తరించాల్సిన అవసరం ఉంది.
ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడీబీ) రైల్వే ప్రాజెక్ట్ కు కొంత మొత్తం నిధులు ఇవ్వడానికి అంగీకరించింది. అంతే కాకుండా రెకో డిక్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఇప్పటికే 410 మిలియన్ డాలర్లను అందిస్తామని హమీ ఇచ్చింది. ఇది పాక్ కు గొప్ప ఉపశమనం కలిగించే వార్త అనడంలో సందేహం లేదు.
పాక్ తో చైనా సంబంధాలు ఎలా సమతుల్యం..
సెంట్రల్ సీపీఈసీ ప్రాజెక్ట్ కోసం ఏడీబీ తో సహ అమెరికా కూటమిలోని దేశాలను నిధుల కోసం పాక్ సంప్రదించాలని నిర్ణయం తీసుకుంది. చైనాతో పాటు ఇతర దేశాలతో ఏకకాలంలో సత్సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఇస్లామాబాద్ వర్గాలు రాయిటర్స్ తో చెప్పాయి.
‘‘ ఆ సంబంధం(చైనాతో) ప్రమాదంలో పడేసేలా మేము ఎప్పటికీ ఏం చేయము’’ అని పాకిస్తాన్ సీనియర్ అధికారి ఒకరు ఈ వార్తాపత్రికతో చెప్పారు. ఇటీవల అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. ‘‘మేము ఒక స్నేహితుడి కోసం మరో స్నేహితుడిని త్యాగం చేయము’’ అన్నారు.
ఇది పాక్ సున్నితమైన చర్యలను హైలైట్ చేసింది. పాశ్చాత్య దేశాలు, పెట్టుబడిదారులతో భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూనే చైనా నుంచి దూరం జరగడానికి మాత్రం పాక్ ఒప్పుకోవడం లేదు.
అయితే ఈ మధ్య అమెరికాతో పాక్ అంటకాగడం ఈ సంబంధాలను కొంత క్లిష్టం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెకో డిక్ తో సహ పాకిస్తాన్ ఖనిజ ఆస్తులపై ఆసక్తి వ్యక్తం చేయడంతో వాషింగ్టన్ తిరిగి పాక్ లో కాలుపెడుతుందా అనే సందేహం వస్తోంది.
సీపీఈసీకి ఒకప్పుడు కేవలం చైనా మాత్రమే నిధులు అందించేది. ఇప్పుడు దానిలోకి అనేక ఆర్థిక సంస్థల నుంచి నిధులు స్వీకరించి ముందుకు తీసుకుపోవడం ఆర్థిక యుక్తి మాత్రమే కాకుండా వ్యూహాత్మక అడుగు కూడా. చైనా- పాకిస్తాన్ సంబంధానికి తన నిబద్దతను ఆ దేశం పునరుద్ఘాటిస్తూనే నిధుల కోసం వైవిధ్యమైన బహుపాక్షిక సంస్థలను అది సంప్రదిస్తోంది.
రెండు బలమైన శక్తులైన యూఎస్- చైనాతో సంప్రదించడం దాని పరపతిని పెంచుతుంది. అలాగే యూఎస్- చైనా మధ్య సంబంధాలు దిగజారడం, భారత్- చైనా సంబంధాలు బలపడుతున్న తరుణంలో వీటిని నావిగేట్ చేయడం కూడా అంత సులభం కాదు.