భారత్, పాకిస్తాన్ సమస్యలపై మధ్యవర్తిత్వం చేస్తా: అమెరికా అధ్యక్షుడు
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్, పాకిస్తాన్ సమస్యలపై మధ్యవర్తిత్వం చేస్తా: అమెరికా అధ్యక్షుడు

కాశ్మీర్ వేయి సంవత్సరాల సమస్య అంటూ తన జ్ఞానాన్ని బయటపెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు


కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై ఇరు దేశాలు బలమైన, తిరుగులేని శక్తివంతమైన నాయకత్వం కృషి చేసిందని ఆయన ప్రశంసలు కురిపించారు. నాలుగు రోజులుగా రెండు దేశాల మధ్య జరగుతున్న పోరాటాలు నిన్న సాయంత్రం జరిగిన సీజ్ ఫైర్ తో ముగిశాయి.

శక్తివంతమైన నాయకత్వం..
‘‘ చాలా మంది మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత దురాక్రమణను ఆపాల్సిన సమయం ఆసన్నమైందని పూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యం ఉన్న నాయకులు ఇరు దేశాల్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు.
‘‘యుద్ధం జరిగితే లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయి ఉండవచ్చు. మీరు చర్చల ద్వారా నాయకత్వాన్ని బాగా మెరుగుపరుచుకోండి’’ అని ఆయన అన్నారు.
‘‘ చారిత్రాత్మకమైన, వీరోచితమైన నిర్ణయం తీసుకోవడానికి యూఎస్ఏ మీకు సహాయం చేయగలిగినందుకు నేను గర్వపడుతున్నాను. చర్చించకపోయినా ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను. వెయ్యి సంవత్సరాల తరువాత కాశ్మీర్ విషయంలో ఒక పరిష్కారం కనుగొనబడుతుందో లేదో చూడటానికి నేను మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను. భారత్- పాకిస్తాన్ నాయకత్వాన్ని దేవుడు దీవించుగాక’’ అని పోస్ట్ లో పేర్కొన్నారు.
కాల్పుల విరమణ..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు గత వారం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్, పీఓజేకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.
ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో పాక్ అనూహ్యంగా కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే కాల్పుల విరమణ ప్రకటన జరగడానికి రావడానికి ముందే భారత వైమానిక దళం పాక్ లోని ఎయిర్ బేస్ లు, సైనిక బేస్ లు, రాడార్ వ్యవస్థలను పేల్చివేసింది. దీనితో పూర్తి స్థాయి యుద్దం జరగబోతుందని అనుకున్న తరుణంలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించింది.
శనివారం సాయంత్రం 5 గంటల నుంచి భూమి, వాయు, సముద్రం పై కాల్పులు, సైనిక చర్యలు నిలిపివేయడానికి భారత్, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు.
మొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే విదేశాంగ శాఖ నుంచి వివరాలు అధికారికంగా వచ్చాయి.
Read More
Next Story