పాలస్తీనా ఉగ్రవాదులను తుదముట్టిస్తా: ట్రంప్
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

పాలస్తీనా ఉగ్రవాదులను తుదముట్టిస్తా: ట్రంప్

హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం పాటించాలని హెచ్చరిక


ఇజ్రాయెల్ తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని హమాస్ గౌరవించాలని లేకపోతే గాజా నుంచి ఉగ్రవాద సంస్థను నిర్మూలించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడానికి వారికి కొంతసమయం ఇస్తామని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్భనీస్ తో జరిగిన ఒప్పందం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.

పాలస్తీనా సాయుధ బృందం ఒప్పందాన్ని గౌరవిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘‘మేము హమాస్ తో ఒక ఒప్పందం చేసుకున్నాము. వారు సరిగా ఉంటారని ఆశిస్తున్నాము.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఒప్పందాన్ని గౌరవించకపోతే హమాస్ ను పూర్తిగా నిర్మూలిస్తామని హెచ్చరించారు. వారికి ఈ విషయం స్పష్టంగా తెలుసని అన్నారు.

కాల్పుల విరమణకు కట్టుబడే ఉన్నాం..
ట్రంప్ చేసిన ప్రకటనపై హమాస్ స్పందించింది. హామాస్ నాయకుడు ఖలీల్ అల్ హయ్యా ‘అల్ ఖహేరా’న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. హమాస్ కాల్పుల విరమణను కొనసాగించడానికి కట్టుబడి ఉందని ప్రకటించారు.
కొంతమంది బందీల మృతదేహాలు తిరిగి తీసుకురావడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడం ద్వారా బందీల మృతదేహాలను తిరిగి తీసుకురావడంలో జాప్యం జరుగుతోందని, ఐడీఎఫ్ దళాలను నిందించాడు. అయితే ఇజ్రాయెల్ దీనిని ఖండించింది. బందీల మృతదేహాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసేందుకే తమపై కాల్పులు జరుపుతున్నారని పేర్కొంది.
అమెరికా దళాలు రావు..
గాజాపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో హమాస్ తనకు ప్రత్యర్థులుగా భావించిన వారందరిని ఉరి తీసే ప్రయత్నం చేస్తోందని వారిని బహిరంగంగా ఉరితీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.
హమాస్ ఎదుర్కోవడానికి మాత్రం అమెరికా దళాలను పంపబోమని ప్రకటించారు. గాజాలో పాలన స్థిరీకరించడానికి అనేక అంతర్జాతీయ దళాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. గాజాలోకి వెళ్లండని ఇజ్రాయెల్ కు చెబితే రెండు నిమిషాలలో పని ప్రారంభిస్తుందని ట్రంప్ అన్నారు.
కానీ ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలు ఇవ్వబోమని కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయడానికి హమాస్ కు అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ హమాస్ పాతపనే మళ్లీ చేస్తుంటే కచ్చితంగా ఉగ్రవాద సంస్థను నిర్మూలిస్తామని హూంకరించారు.
బలహీనపడిన హమాస్..
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులతో హమాస్ కు ఇన్నాళ్లు అండగా ఉన్న ఇరాన్ తీవ్రంగా బలహీనపడిందని, ఆ మేరకు హమాస్ కూడా బలం కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ‘‘వారికి ఇప్పుడూ ఎవరి మద్దతు లేదు. వారి సరిగా మసలుకోవాలి. లేకపోతే వారిని నిర్మూలిస్తాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
గాజాలో ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులకు పాల్పడుతున్నందున కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందిగ్థం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇజ్రాయెల్ కు బయలుదేరారు.


Read More
Next Story