
భారత ప్రధాని మోదీతో బెంజామిన్ నెతన్యాహూ ( ఫైల్)
ఈ ఇజ్రాయెల్ 'బీబీ' ఎవరు? ఇరాన్ పై అంత కక్ష ఎందుకు?
అంత ఎత్తుకు ఎలా ఎదిగాడు? మితవాద రాజకీయ ధృవ తార జీవితకథ ఎట్టిదనిన..
"ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను వదిలే ప్రసక్తే లేదు. వేటాడి వెంటాడి చంపుతాం".. ఇది ఇరాన్ శపథం.
"ఇరాన్ అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టేంత వరకు విశ్రమించేది లేదు" ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హుకుం...
ఒకప్పుడు ఈ రెండు దేశాలు ఒకటే. ఇరాన్ రాచరికాన్ని కూలదోసేంత వరకు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడెందుకు కాళ్లకు కత్తులు కట్టుకున్నాయి? ఒకర్నొకరు హత మార్చుకునేంత వరకు ఎందుకు వెళ్లాయి? ఇరాన్ ను ధ్వంసం చేసి తీరుతామంటున్న ఈ నెతన్యాహూ ఎవరు? ఎందుకింత కక్షతో రగిలిపోతున్నాడు? అనేది చూద్దాం.
1947 ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత 10 నెలలకి 1948 మే 14న ఇజ్రాయెల్ అధికారికంగా అవతరించింది. వాళ్లకి మనకీ బ్రిటీష్ పాలన నుంచే విముక్తి లభించింది. డేవిడ్ బెన్-గురియన్ టెల్ అవీవ్‌లో ఇజ్రాయెల్ స్థాపనను ప్రకటించారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ రాజకీయ యవనికపై అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి బెంజామిన్ నెతన్యాహూ. ఆ దేశ చరిత్రను మలుపు తిప్పిన వాళ్లలో ఒకడు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను 'బెంజామిన్' అని పిలిచినా, ఆయన మాతృభాష హీబ్రూలో 'బిన్యామిన్' అని, అభిమానులు ప్రేమగా 'బీబీ' (Bibi) అని పిలుస్తుంటారు.
పేరు వెనుక కథ ఇది..
తెలుగులో 'బెంజామిన్' అని రాయడం అలవాటు. అయితే, బైబిల్ మూలాలు లేదా హీబ్రూ ఉచ్చారణ ప్రకారం ఇది 'బెన్యామిన్' (Binyamin). హీబ్రూ భాషలో 'J' శబ్దం ఉండదు, దాని స్థానంలో 'Y' (య) శబ్దం వస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు చిన్నప్పుడు ఆయన్ని ముద్దుగా 'బీబీ' అని పిలిచేవారు. అది ఎంతలా పాపులర్ అయిందంటే, ఆయన తన ఆత్మకథకు కూడా "బీబీ: మై స్టోరీ" అని పేరు పెట్టుకున్నారు.
పూర్వీకుల చరిత్ర ఇది...
బెంజామిన్ నెతన్యాహూ పూర్వీకుల చరిత్రా ఆసక్తికరమే. యూదుల వలసలు (Aliyah), వారి పేర్ల మార్పులు ఇజ్రాయెల్ చరిత్రతో ముడిపడి ఉన్నాయి. నెతన్యాహూ తండ్రి వైపు పూర్వీకులు ఐరోపా నుంచి వచ్చిన 'అష్కెనాజీ యూదులు' (Ashkenazi Jews). ఇజ్రాయెల్ రాజకీయాల్లో అష్కెనాజీ యూదుల ప్రభావం చాలా ఎక్కువ.
ప్రస్తుత బెలారస్ (Belarus) దేశం నుంచి నెతన్యాహూ తాతా వచ్చారు. అప్పట్లో అది రష్యన్ సామ్రాజ్యంలో ఉండేది. ఆయన తాత నాథన్ మిలికోవ్స్కీ (Nathan Mileikowsky) గొప్ప పండితుడు. జియోనిస్ట్ నాయకుడు. (యూదుల అస్తిత్వ పోరాటాన్ని Zionism అంటారు) ఆయన బెలారస్‌లోని 'క్రెవో' అనే గ్రామంలో జన్మించారు. 1920లో నాథన్ మిలికోవ్స్కీ తన కుటుంబాన్ని తీసుకొని అప్పటి బ్రిటిష్ పాలనలో ఉన్న పాలస్తీనాకు (ప్రస్తుత ఇజ్రాయెల్) వలస వచ్చారు. ఆ తర్వాత తమ ఇంటి పేరు మార్చుకున్నారు.
వారి అసలు ఇంటి పేరు 'మిలికోవ్స్కీ' (Mileikowsky). ఇజ్రాయెల్‌కు వచ్చిన తర్వాత, అక్కడి సంస్కృతికి తగ్గట్టుగా, హీబ్రూ భాషా ప్రాధాన్యతను చాటి చెప్పేలా ఆయన తాత తన పేరును 'నెతన్యాహూ' (Netanyahu) గా మార్చుకున్నారు. 'నెతన్యాహూ' అంటే హీబ్రూలో "దేవుడు ఇచ్చిన వరం" (God has given) అని అర్థం.
నెతన్యాహూ తాత నాథన్ మిలికోవ్స్కీ పాలస్తీనాకు రాకముందే ఐరోపాలో తిరుగుతూ "యూదులు తమ దేశానికి తరలాలి" అని పిలుపిచ్చేవారు. అంటే వారి పోరాటం ఐరోపా గడ్డపైనే సిద్ధాంతపరంగా మొదలై, పాలస్తీనాలో ఆచరణలోకి వచ్చింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహూ తండ్రి బెంజియోన్ నెతన్యాహూ (Benzion Netanyahu). ఆయన పోలాండ్-జన్మించారని చెబుతారు. ప్రముఖ యూదు చరిత్రకారుడు, ప్రొఫెసర్. జియోనిస్ట్ నాయకుడు. 102 ఏళ్ల వయసులో మరణించాడు. బెంజామిన్ నెతన్యాహూ రాజకీయ భావజాలంపై, ముఖ్యంగా యూదుల భద్రతపై గట్టి ప్రభావం చూపారు.
తల్లి వైపు మూలాలు..
నెతన్యాహూ తల్లి సిలా సెగల్ (Zila Segal). ఆమె ఇజ్రాయెల్‌లోనే (పెటా టిక్వాలో) జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కూడా ఐరోపా నుంచే ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు.
ఈ దంపతులకు ముగ్గురు మగపిల్లలు. జోనాథన్ (యోని) నెతన్యాహూ పెద్దవాడు. రెండో వాడు నెతన్యాహూ (బీబీ), మూడో వాడు ఇద్దో నెతన్యాహూ. చిన్న సోదరుడు, ఈయన వైద్యుడు మరియు రచయిత. నెతన్యాహూకు అప్పచెల్లెళ్లు లేరు.
నెతన్యాహూ ప్రస్థానం ఇలా...
1949 అక్టోబర్ 21న టెల్ అవీవ్‌లో పుట్టాడు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత జన్మించిన మొదటి ప్రధాని ఈయనే. 1963లో నెతన్యాహు తన తండ్రితో కలిసి అమెరికాలోని ఫిలడెల్ఫియాకు వెళ్లారు . 1967లో ఇజ్రాయెల్ సైన్యంలో చేరాడు. సయెరెట్ మత్కల్ అనే టాప్ మోస్ట్ సైనిక రహస్య విభాగంలో పని చేశారు. 1972లో టెల్ అవీవ్ విమానాశ్రయంలో హైజాక్ అయిన జెట్ విమానాన్ని రక్షించిన బృందంలో ఒకడు. ఆ తర్వాత ఆయన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (MBA, 1976) చదువుకున్నారు. 1973లో ఇజ్రాయెల్‌లో జరిగిన యోమ్ కిప్పూర్ యుద్ధానికి సన్నద్ధం అయ్యారు. 1976లో విజయవంతమైన ఎంటెబ్బే దాడికి నాయకత్వం వహించాడు. ఈ దాడిలో ఆయన సోదరుడు జోనాథన్ మరణించారు. ఈ ఘటన బీబీని తీవ్రంగా కలిచివేసింది. బెంజమిన్ జోనాథన్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఉగ్రవాదంపై ఎలా పోరాటం చేయాలో నేర్పే సంస్థ ఇది.
మూడు పెళ్లిళ్లు.. ముగ్గురు పిల్లలు..
మితవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ నెతన్యాహూ. పూర్తిగా మితవాది (Right-wing). నెతన్యాహూ వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఆయన 3 పెళ్లిళ్లు చేసుకున్నారు.
తొలి భార్య మిరియం వెయిజ్‌మాన్ తో 'నోవా' అనే కుమార్తె ఉంది. రెండో భార్య ఫ్లూర్ కేట్స్, పిల్లలు లేరు. ప్రస్తుతం ఉన్న ఆమె మూడో భార్య సారా. 1991లో వీరి పెళ్లి అయింది. సారా సైకాలజిస్ట్. ఆమె ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని, విలాసవంతమైన జీవితం గడుపుతుందన్న విమర్శలు ఉన్నాయి. సారా-నెతన్యాహూలకు ఇద్దరు కుమారులు- యైర్ , అవ్నర్. పెద్ద కుమారుడు యైర్ సోషల్ మీడియాలో చేసే వివాదాస్పద పోస్టులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి.
విద్య, ఎదుగుదల...
నెతన్యాహూ అమెరికాలోని ప్రతిష్టాత్మక MIT (Massachusetts Institute of Technology) లో చదువుకున్నారు. ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీలు పొందారు. చదువు పూర్తయ్యాక కొంతకాలం బిజినెస్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆయన ఇంగ్లీష్ ఉచ్చారణ అమెరికన్ స్టైల్‌లో ఉండటానికి కారణం ఆయన ఎక్కువ కాలం అక్కడ నివసించడమే. 2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు నడిపించి, దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చారు.
నెతన్యాహూ మితవాదిగా ఎలా మారారంటే...
నెతన్యాహూ తండ్రి బెంజియాన్ నెతన్యాహూ ప్రొఫెసర్‌గా పనిచేయడం వల్ల, బెంజామిన్ తన చిన్నతనంలో చాలా కాలం అమెరికాలో గడిపారు. అమెరికా రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది. నెతన్యాహూ వాదం ప్రధానంగా "దేశ ప్రయోజనాలు - ఆర్థిక బలం" చుట్టూ తిరుగుతుంది. ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలు ఉన్న నేపథ్యంలో, "బలహీనంగా ఉంటే మనుగడ సాగించలేం" అనే ఆయన వాదం ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ కవచంలా అనిపిస్తుంది. 'ఐరన్ డోమ్' వంటి రక్షణ వ్యవస్థల వెనుక ఈ దృఢ సంకల్పమే ఉంది.
తొలినాళ్లలో సోషలిస్టు ధోరణిలో ఉన్న ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థను మార్కెట్ శక్తులకు వదిలేయడం ద్వారా ఆయన దేశాన్ని 'స్టార్టప్ నేషన్'గా మార్చారు. తక్కువ పన్నులు, ప్రైవేటీకరణ వల్ల ఇజ్రాయెల్ నేడు ప్రపంచ టెక్నాలజీ హబ్‌గా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు ఇజ్రాయెల్ ఒక సురక్షితమైన కోట అనే భావనను ఆయన బలంగా నిలబెట్టారు.
ఆయన వాదంలోని అతివాద ధోరణి ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు ముప్పుగా మారుతోందన్నది ప్రధాన విమర్శ. తనను వ్యతిరేకించే వారిని "దేశ ద్రోహులు"గా లేదా "లెఫ్టిస్టులు"గా అభివర్ణించడం ఆయన అలవాటు. ఇది దేశ అంతర్గత ఐక్యతను దెబ్బతీస్తోంది.
పాలస్తీనా విషయంలో ఆయన అనుసరిస్తున్న "కఠిన వైఖరి" వల్ల వేలాది మంది అమాయక పౌరులు (గాజా యుద్ధం వంటి సందర్భాల్లో) ప్రాణాలు కోల్పోతున్నారు. శాంతి చర్చల కంటే సైనిక పరిష్కారాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హింస నిరంతరం కొనసాగుతోంది.
తనపై ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి న్యాయవ్యవస్థ అధికారాలను తగ్గించేలా చట్టాలు తేవడం, ప్రజాస్వామ్య వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడం పెద్ద తప్పిదంగా విమర్శకులు భావిస్తారు.
"శాంతి కోసం భూమిని వదులుకోం" అనే ఆయన మొండి వైఖరి వల్ల పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు, ఇది భవిష్యత్తులో మరిన్ని యుద్ధాలకు దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నెతన్యాహూ వాదం "డబుల్ ఎడ్జ్ స్వోర్డ్" (రెండంచుల కత్తి). దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడం ఆయనలోని 'ఓ పార్శ్వమైతే' ప్రజాస్వామ్య విలువలను, మానవ హక్కులను విస్మరించడం ఆయనలోని 'ప్రధాన లోపం'.
ఐరోపాలో వేధింపులు...
యూదులు శతాబ్దాలుగా ఐరోపాలోని వివిధ దేశాల్లో చెల్లాచెదురుగా నివసించేవారు. అక్కడ వారిపై వివక్ష, దాడులు (Pogroms) ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా రష్యా, తూర్పు ఐరోపాలో యూదులను తరిమివేయడం లేదా చంపడం వంటి ఘటనలు జరిగాయి. ఈ వేధింపులే "మాకంటూ ఒక స్వదేశం ఉండాలి" అనే ఆలోచనకు పునాది వేశాయి. యూదుల వలసలు పెరగడంతో స్థానిక అరబ్బులకు, వీరికి మధ్య భూమి కోసం గొడవలు మొదలయ్యాయి. అప్పట్లో పాలస్తీనాను పాలిస్తున్న బ్రిటీష్ వారిపై ఒత్తిడి తెచ్చి, 1917లో 'బాల్ఫోర్ డిక్లరేషన్' (యూదులకు హోమ్ ల్యాండ్ మద్దతు) సాధించారు. 1948లో ఇజ్రాయెల్ దేశం ప్రకటించే వరకు ఈ పోరాటం తీవ్రస్థాయిలో సాగింది.
ఒకప్పటి మిత్రులే ఇప్పుడు శత్రువులు..
ప్రస్తుతం ఒకరినొకరు శత్రువులుగా భావించే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు, ఒకప్పుడు దశాబ్దాల పాటు అత్యంత సన్నిహిత మిత్రదేశాలుగా ఉండేవన్నది చారిత్రక సత్యం.
1948 నుండి 1979 వరకు ఈ రెండు దేశాల మధ్య సహకారం కొనసాగింది. ఇరాన్ చక్రవర్తి (షా) మొహమ్మద్ రెజా పహ్లావి హయాంలో ఇరు దేశాల మధ్య బలమైన బంధం ఏర్పడింది. అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు చమురు ఇవ్వడానికి నిరాకరించిన సమయంలో, ఇరాన్ పెద్ద ఎత్తున చమురును సరఫరా చేసింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ 'మోసాద్'(Mossad), ఇరాన్ నిఘా సంస్థ 'సావాక్' (SAVAK) కలిసి పనిచేశాయి. ఇరాన్ అధికారులకు శిక్షణ ఇవ్వడంలో మోసాద్ కీలక పాత్ర పోషించింది.'ప్రాజెక్ట్ ఫ్లవర్' (Project Flower) పేరుతో ఇరు దేశాలు కలిసి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాయి. ఇరాన్ దీని కోసం చమురును పెట్టుబడిగా పెడితే, ఇజ్రాయెల్ తన టెక్నాలజీని అందించింది.
బంధం ఎప్పుడు తెగిపోయింది?
1979 ఇస్లామిక్ విప్లవం (Islamic Revolution) వచ్చి ఇరాన్ లో 'షా' పాలన అంతమై, అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బంధం తెగింది. ఖొమేనీ ఇజ్రాయెల్‌ను "చిన్న సైతాన్" (Little Satan)గా, అమెరికాను "పెద్ద సైతాన్"గా ప్రకటించారు. అక్కడితో దశాబ్దాల కాలం నాటి స్నేహం బద్దశత్రుత్వంగా మారిపోయింది.
Next Story

