
ఎవరీ ఐదుగురు? వీరి నేపథ్యం ఏంటి?
కేవలం వృత్తిపరమైన అర్హతలే కాకుండా, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడిన విధేయులకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం (RTI) అమలును పరుగులెత్తించేందుకు ప్రభుత్వం సరికొత్త బృందాన్ని రంగంలోకి దించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక ప్రధాన కమిషనర్, నలుగురు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాద వృత్తిలో రాటుదేలిన వారు, సమాచార వేటలో ఆరితేరిన జర్నలిస్టులతో కూడిన ఈ టీమ్ నేపథ్యంపై ఒక లుక్..
వజ్జా శ్రీనివాసరావు
రాష్ట్ర కొత్త ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులైన వజ్జా శ్రీనివాసరావు న్యాయవాద వృత్తిలో తలపండిన వ్యక్తి. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన, 1995 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా చట్టపరమైన చిక్కుముడులను విప్పడంలో విశేష అనుభవం గడించారు. 2018లో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన శ్రీనివాసరావు, గతంలో టీడీపీ లీగల్ సెల్‌లో కీలకంగా వ్యవహరించి అనేక క్లిష్టమైన కేసులను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన హోదా కలిగిన ఈ పదవిలో ఉంటూ, పెండింగ్‌లో ఉన్న వేల అప్పీళ్లకు ఆయన తన న్యాయ నిపుణతతో పరిష్కారం చూపనున్నారు.
శరత్‌చంద్ర కల్యాణ చక్రవర్తి
పాత్రికేయ కోటాలో కమిషనర్‌గా ఎంపికైన వి. శరత్‌చంద్ర కల్యాణ చక్రవర్తిది సమాచార సేకరణలో రాటుదేలిన చెయ్యి. 21 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానంలో 'ఈనాడు' పత్రికలో ఇన్వెస్టిగేటివ్, పొలిటికల్ రిపోర్టింగ్‌లో తనదైన ముద్ర వేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన ఈయనకు గతంలో సీఎంఓలో పీఆర్ఓగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం ఎక్కడ, ఎలా నిక్షిప్తమై ఉంటుందో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో, ఆర్టీఐ దరఖాస్తుదారులకు ఈయన నియామకం ఒక అదనపు బలమని భావిస్తున్నారు.
గాజుల ఆదెన్న
అనంతపురం జిల్లాకు చెందిన గాజుల ఆదెన్న సమాచార కమిషనర్‌గా సామాజిక బాధ్యతను భుజానికెత్తుకోనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఈయన, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యంగా అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. క్షేత్రస్థాయిలో సామాన్యులకు సమాచార హక్కును ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చడంలో ఈయనకు ఉన్న సామాజిక స్పృహ, పోరాట నేపథ్యం ఎంతగానో తోడ్పడనున్నాయని భావిస్తున్నారు.
ఒంటేరు రవిబాబు
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒంటేరు రవిబాబుకు పరిపాలనా అంశాలపై లోతైన అవగాహన ఉంది. గతంలో పార్టీ మీడియా సమన్వయకర్తగా పనిచేసిన క్రమంలో వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును, ఫైళ్ల కదలికలను ఆయన నిశితంగా గమనించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న సమాచార లోపాన్ని సరిదిద్ది, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడంలో రవిబాబుకు ఉన్న ఈ అనుభవం కీలక పాత్ర పోషించనుంది.
సింహాచలం నాయుడు
విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది పరవాడ సింహాచలం నాయుడు ఉత్తరాంధ్ర నుంచి కమిషనర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖ కోర్టులో పేరున్న న్యాయవాదిగా అనేక భూ వివాదాలు, పౌర హక్కుల కేసులను వాదించిన అనుభవం ఈయన సొంతం. న్యాయ నేపథ్యం ఉన్న వ్యక్తిగా, ఆర్టీఐ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలోనూ, నిబంధనలను పక్కాగా అమలు చేయడంలోనూ ఆయన నిష్పాక్షికంగా వ్యవహరించగలరని భావిస్తున్నారు.
సింహాచలం నాయుడు ఉత్తరాంధ్రలో టీడీపీ లీగల్ వింగ్‌లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో పార్టీ నాయకులపై వచ్చే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంలో ఆయన ముందుండేవారు. పార్టీ కార్యక్రమాలకు అనుమతులు తీసుకురావడం నుండి, అరెస్ట్ అయిన కార్యకర్తలకు బెయిల్ ఇప్పించే వరకు ఆయన నిరంతరం శ్రమించారు. ఉత్తరాంధ్రలో పార్టీకి బలమైన లీగల్ సపోర్ట్ అందించినందుకు గాను ఆయనకు ఈ అవకాశం దక్కిందనే చర్చ కూడా టీడీపీ శ్రేణుల్లో ఉంది.

