
పరస్పరం సవాళ్లు విసురుకున్న ఇరాన్, ఇజ్రాయెల్ లీడర్లు
'చస్తావో, బతుకుతావో నీ ఇష్టం ఖమేనీ, నీ బతుక్కేమీ భరోసా లేదు'
ఇరాన్ సుప్రీం ఖమేనీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సవాల్!
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం 14వ రోజుకు చేరుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తొలి ప్రకటనలో అమెరికాకు అల్టిమేటం జారీ చేయగా, దాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అదే స్థాయిలో తిప్పికొట్టారు. "ఇరాన్ నాయకులకు జీవిత బీమా ఏమీ లేదు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మొజ్తబా ఖమేనీ తొలి సందేశం..
ఇరాన్ సుప్రీం లీడర్, తన తండ్రి అలీ ఖమేనీ హత్య తర్వాత పగ్గాలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, మార్చి 12న స్టేట్ టెలివిజన్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు.
Mojitaba Khaminie
ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ఖాళీ చేస్తారా, కూల్చేయమంటారా? అంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. 'రక్తానికి రక్తం, దెబ్బకు దెబ్బ తప్పదు!', మా నెత్తురు కళ్లచూసిన వారిని వదలబోమని కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని, కొత్త యుద్ధ ఫ్రంట్‌లు తెరుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు.
"అది పాత ఇరాన్ కాదు.. ఇది పాత ఇజ్రాయెల్ అంతకంటే కాదు!" అని మొజ్తబా ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే నెతన్యాహు మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏమన్నారంటే...
"ఇప్పటికే పూర్తి నిశ్చయంతో ఒక విషయం చెప్పవచ్చు. అది ఇకపై పాత ఇరాన్ కాదు. ఇది ఇకపై పాత పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) కాదు. అలాగే ఇది మునుపటి ఇజ్రాయెల్ కూడా కాదు.
మేము దాడుల కోసం ఎదురుచూడడం లేదు. మేమే చొరవ తీసుకుంటున్నాం. మేమే దాడులు చేస్తున్నాం. ముందెన్నడూ చూడని విధంగా అత్యంత ధృఢంగా మేం విరుచుకుపడుతున్నాం. ఇరాన్ ప్రజలకు నేను ఇంకో మాట కూడా చెబుతున్నా.
ఇరాన్ ప్రజలు ఈ భయంకరమైన, నిరంకుశ పాలనను కూలదోయడానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించాం. అయితే, కేవలం పరిస్థితులను సృష్టించినంత మాత్రాన అది జరుగుతుందని నేను గ్యారెంటీ ఇవ్వలేను. కొద్దిసేపటి కిందట నేను చెప్పినట్లుగా.. అది పూర్తిగా మీ (ఇరాన్ ప్రజల) పైనే ఆధారపడి ఉంటుంది.
ఉగ్రవాద సంస్థల నాయకులెవరికీ నేను 'లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు' (ప్రాణ రక్షణ) జారీ చేయను. ఉగ్రవాదానికి అండగా నిలిచే వారి విషయంలోనూ నాది ఇదే మాట. మేము ఏం ప్లాన్ చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనే విషయాలపై నేనిక్కడేమీ మాట్లాడదల్చుకోలేదు" అని కుండబద్ధలు కొట్టారు.
నిజానికి నెతన్యాహు వాడిన "లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు జారీ చేయను" అనే పదం దౌత్యపరంగా చాలా తీవ్రమైనది. అంటే, "మిమ్మల్ని ఎప్పుడైనా చంపేయవచ్చు, మీ ప్రాణాలకు గ్యారెంటీ లేదు" అని ఆయన మొజ్తబా ఖమేనీకి పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు.
నెతన్యాహు మాటలను బట్టి చూస్తుంటే, అలీ ఖమేనీ తరహాలోనే మొజ్తబా ఖమేనీ కూడా ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్నారని స్పష్టమవుతోంది.
యుద్ధం ఎటు వైపు?
హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల భారత్ సహా అనేక దేశాల్లో ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అమెరికా బేస్‌లపై దాడులు జరిగితే, అగ్రరాజ్యం నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది.
ఇరాన్ వెనక్కి తగ్గమని చెబుతుంటే, ఇజ్రాయెల్ మాత్రం సమూల నాశనానికే సిద్ధమని అంటోంది. రాబోయే 48 గంటలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
Next Story

