
పశ్చిమాసియా సంక్షోభం: క్షిపణి దాడిలో ఇద్దరు భారతీయుల అవశేషాలు లభ్యం..
ఆయిల్ ట్యాంకర్ క్యాబిన్‌లో లభించిన కెప్టెన్ ఆశిష్ కుమార్ ఎముకలు.. జనవరిలో విధుల్లో చేరిన దలీప్ సింగ్..
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమన్ గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్ MV స్కైలైట్‌పై మార్చి 1న జరిగిన క్షిపణి దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. మృతులను బీహార్‌కు చెందిన కెప్టెన్ ఆశిష్ కుమార్, రాజస్థాన్‌కు చెందిన క్రూ మెంబర్ దలీప్ సింగ్‌గా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారి అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆశిష్ కుమార్ ఎముకలను కెప్టెన్ క్యాబిన్‌లో దొరికాయని, దలీప్ సింగ్ క్షిపణి దాడి సమయంలో ఓడ ముందు భాగంలో ఉన్నాడని అధికారులు తెలిపారు.
బీహార్‌లోని బెట్టియాకు చెందిన ముగ్గురు కొడుకులలో పెద్దవాడు కెప్టెన్ ఆశిష్ కుమార్. ఆశిష్ కుమార్‌కు భార్య అన్షు కుమారి, ఐదేళ్ల కుమారుడు దక్షుడి ఉన్నారు. కుమారుడి మృతితో ఆశిష్ తండ్రి, వృత్తిరీత్యా న్యాయవాది అయిన అశోక్ కుమార్, తల్లి సునీతా దేవి కన్నీరుమున్నీరయ్యారు.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా ఖిన్వతనాకు చెందిన దలీప్ ఇటీవలే ట్యాంకర్‌లో విధులకు హాజరయ్యారు. చివరిసారిగా కుటుంబసభ్యులతో ఫిబ్రవరి 28న మాట్లాడాడు.

