
ఒహాయో గవర్నర్ పీఠంపై వివేక్ రామస్వామి కన్ను..
ట్రంప్ మద్దతు.. ప్రచారంలో వివాదాలు!
సీమా గుహా
అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నాయకుల ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వివేక్ రామస్వామి.. ఇప్పుడు ఒహాయో గవర్నర్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు లభించడం మరింత బలాన్నిస్తోంది. అయితే, ప్రత్యర్థిపై ఆయన ప్రచార బృందం విడుదల చేసిన వివాదాస్పద ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ అండ ఉన్నప్పటికీ.. ఈ వివాదం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
రామస్వామి రాజకీయ శైలిలో నాయకత్వంపై తనకున్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది. తాను రెండో స్థానంలో ఉండటం కంటే నాయకుడిగా వ్యవహరించినప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలనని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చాయి. ట్రంప్‌కు రెండో స్థానంలో ఉండటం తనకు సరిపోదన్న అభిప్రాయాన్ని కూడా ఆయన పలుమార్లు వ్యక్తం చేశారు. ప్రస్తుత గవర్నర్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేయకపోయినా.. ఆయన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసానికి ఇవి అద్దం పడుతున్నాయి.
ప్రత్యర్థిపై ప్రకటనతో వివాదం
డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్‌ను లక్ష్యంగా చేసుకుని రామస్వామి ప్రచార బృందం అక్టోబర్ చివరి వారంలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆక్టన్ తల్లి డోనా ఆర్థర్ కనిపిస్తూ.. తన కుమార్తె అబద్ధాలు చెబుతున్నారని, ప్రభుత్వ పదవికి ఆమె అర్హురాలు కాదని విమర్శించారు.
అయితే, ఆక్టన్ కుటుంబంలో గతంలో తీవ్ర వివాదాలు చోటుచేసుకున్నాయి. ఆమెకు 12 ఏళ్ల వయసున్నప్పుడు సవతి తండ్రిపై అత్యాచార ఆరోపణలు రావడంతో తల్లి సంరక్షణ నుంచి ఆమెను తొలగించారు. అయినప్పటికీ ఆమె తల్లి ఆ వ్యక్తితోనే కొనసాగారు. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు ఐదు దశాబ్దాలుగా తల్లీకూతుళ్ల మధ్య సంబంధాలు లేవు.
ఈ ప్రకటనను ప్రసారం చేసేందుకు తొలుత 4 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని రామస్వామి ప్రచార బృందం భావించింది. అయితే, ప్రకటనపై రిపబ్లికన్ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో ఒహాయోలో జరిగిన ర్యాలీలో ట్రంప్ రామస్వామికి అండగా నిలిచారు. ఆక్టన్ తల్లి తన కుమార్తె గురించి తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, మీడియా మాత్రం రామస్వామిని లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు.
రామస్వామి కూడా ప్రకటనను సమర్థించుకున్నారు. అయితే, వివాదం ముదరడంతో దాని ప్రసారాన్ని నిలిపివేశారు. ప్రచార బృందం సైతం నిర్ణీత ప్రచార గడువు ముగిసినందునే ప్రకటనను నిలిపివేసినట్లు వెల్లడించింది.
వ్యాపారవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా..
ఒహాయోలోని సిన్సినాటిలో భారత సంతతి తల్లిదండ్రులకు వివేక్ రామస్వామి జన్మించారు. ఆయన కుటుంబం 1970లో అమెరికాకు వలస వెళ్లింది. తల్లి వృద్ధుల వైద్య నిపుణురాలిగా, తండ్రి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజినీర్, పేటెంట్ న్యాయవాదిగా పనిచేశారు.
చదువులో చిన్నప్పటి నుంచే ప్రతిభ చూపిన రామస్వామి.. 2007లో హార్వర్డ్ యూనివర్సిటీలో జీవశాస్త్రంలో పట్టా పొందారు. ఆ తర్వాత హెడ్జ్ ఫండ్‌లో పనిచేశారు. 2013లో యేల్ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర డిగ్రీ పూర్తి చేశారు.
29 ఏళ్ల వయసులో రోయివాంట్ సైన్సెస్ పేరుతో ఔషధ పరిశోధనా సంస్థను స్థాపించారు. పెద్ద ఔషధ కంపెనీలు పక్కన పెట్టిన మందుల అభివృద్ధిపై ఈ సంస్థ దృష్టి సారించింది. వ్యాపార రంగంలో సాధించిన విజయాలతో ఆయన భారీ సంపదను కూడబెట్టారు. 2023లో ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన సంపద సుమారు 630 మిలియన్ డాలర్లు.
చిన్నతనం నుంచి పలుమార్లు భారత్‌ను సందర్శించిన రామస్వామికి హిందూ సంస్కృతితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆలయాలకు వెళ్లడం తన బాల్యం నుంచే అలవాటుగా మారిందని ఆయన గతంలో పేర్కొన్నారు.
రాజకీయంగా ఆయన సంప్రదాయ రిపబ్లికన్ భావజాలాన్ని సమర్థిస్తారు. వాతావరణ మార్పులను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ విధానాలు రూపొందించడాన్ని వ్యతిరేకిస్తారు. అబార్షన్, రిజర్వేషన్లు, జన్మహక్కు ఆధారంగా పౌరసత్వం వంటి అంశాల్లోనూ సంప్రదాయవాద వైఖరిని అనుసరిస్తారు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ చేసిన ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయోవా కాకస్‌లో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత జనవరి 15, 2024న పోటీ నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎలాన్ మస్క్‌తో పాటు రామస్వామికి కూడా ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE) బాధ్యతలు అప్పగించారు. అయితే, ఒహాయో రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఒహాయో ఓటర్లకు హామీలేంటి?
ప్రస్తుతం గవర్నర్ ఎన్నికల ప్రచారంలో రామస్వామి ప్రధానంగా జీవన వ్యయాన్ని తగ్గించడం, పన్నులు తగ్గించడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. ఒహాయోను అమెరికాలోనే అత్యంత తక్కువ ఖర్చుతో జీవించగల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది ఆయన లక్ష్యం.
ఇందులో భాగంగా రాష్ట్ర ఆదాయపు పన్నును క్రమంగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. పన్నుల భారం తగ్గితే పెట్టుబడులు పెరుగుతాయని, ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఒహాయోలోనే ఉండేందుకు ఆసక్తి చూపుతారని ఆయన భావిస్తున్నారు.
డేటా సెంటర్ల ఏర్పాటుపైనా రామస్వామి కొన్ని ప్రతిపాదనలు చేశారు. పర్యావరణ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకునే వరకు కొత్త డేటా సెంటర్ల ప్రాజెక్టులను నిలిపివేయాలని సూచించారు. సారవంతమైన వ్యవసాయ భూములకు బదులుగా వినియోగంలో లేని పారిశ్రామిక ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా, డేటా సెంటర్ల వల్ల సమీప ప్రాంతాల ప్రజలకు విద్యుత్ ఖర్చుల భారం పెరగకుండా ఉపశమనం కల్పించాలని పేర్కొన్నారు.
అయితే, రామస్వామికి డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వైద్యురాలైన ఆక్టన్ కూడా సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న జీవన వ్యయాల పెరుగుదలనే ప్రధాన ప్రచార అంశంగా చేసుకున్నారు. 2006 తర్వాత ఒహాయోలో డెమోక్రటిక్ పార్టీకి గవర్నర్ పదవి దక్కలేదు. ఈసారి ఆ రాజకీయ పరిస్థితిని మార్చాలని పార్టీ ప్రయత్నిస్తోంది.
బరిలో ఇతర భారత సంతతి నాయకులు
ఒహాయోతో పాటు నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో పలువురు భారత సంతతి అమెరికన్లు కూడా కీలక పదవుల కోసం పోటీ చేస్తున్నారు.
కాలిఫోర్నియాలో రో ఖన్నా మరోసారి కాంగ్రెస్‌కు ఎన్నిక కావాలని ప్రయత్నిస్తున్నారు. 17వ కాంగ్రెస్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన 2017 నుంచి హౌస్ డెమోక్రాట్‌గా కొనసాగుతున్నారు. ఐదోసారి పదవీకాలం కోసం పోటీ చేస్తున్న ఆయనకు రిపబ్లికన్ అభ్యర్థి రితేష్ టాండన్ నుంచి సవాల్ ఎదురవుతోంది.
ఈ ఏడాది ప్రారంభంలో వెస్ట్ బ్యాంక్ పర్యటన సందర్భంగా రో ఖన్నా, ఆయన బృందానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అమెరికాలో తయారైన ఎం4 రైఫిళ్లు ధరించిన ఇజ్రాయెల్ స్థానికులు వారిని అడ్డుకున్నారు. అంతకుముందు యూదు స్థానికుల దాడికి గురైన పాలస్తీనా గ్రామాన్ని సందర్శించేందుకు కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకోవడంతో ఐడీఎఫ్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చివరకు జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం జోక్యంతో రో ఖన్నా బృందం పర్యటనను పూర్తి చేయగలిగింది.
1970లలో అమెరికాకు వలస వచ్చిన భారతీయ తల్లిదండ్రులకు ఫిలడెల్ఫియాలో రో ఖన్నా జన్మించారు. ఆయన తండ్రి రసాయన శాస్త్ర ఇంజినీర్ కాగా, తల్లి ఉపాధ్యాయురాలు. చికాగో యూనివర్సిటీలో అర్థశాస్త్రం చదివిన ఆయన.. యేల్ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు స్టాన్‌ఫోర్డ్‌లో బోధించారు. ఒబామా ప్రభుత్వ హయాంలో వాణిజ్య శాఖ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు.
వాషింగ్టన్ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్ మరోసారి కాంగ్రెస్ ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. భారత్‌కు సంబంధించిన పలు అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాలకు దారితీశాయి. ముఖ్యంగా 2019లో ఆర్టికల్ 370 రద్దుపై ఆమె చేసిన వ్యాఖ్యలతో భారత్‌లో విమర్శలు ఎదురయ్యాయి. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో సమావేశాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఆ బృందంలో ప్రమీలా జయపాల్ సభ్యురాలిగా ఉండటమే దీనికి కారణమైంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఆమె వ్యాఖ్యలపై పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి సరిత కొమటిరెడ్డి పోటీ చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మేయర్ పదవికి నిత్య రామన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
మొత్తంగా అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నాయకుల ప్రాతినిధ్యం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి పోటీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ మద్దతు, ఆయన ఎన్నికల హామీలు ఒకవైపు.. ప్రత్యర్థి నుంచి ఎదురవుతున్న పోటీ, ప్రచారంలో తలెత్తిన వివాదాలు మరోవైపు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య ఒహాయో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.
