
'నేను తల్చుకుంటే మోదీ రాజకీయ భవిష్యత్ గల్లంతే'
ట్రంప్ వీడియో వైరల్: బెదిరింపా? లేక చమత్కారమా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూటే వేరు.. ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానంటారు, ప్రధాని మోదీ నా మిత్రుడంటారు, నోబెల్ బహుమతికి తన పేరును సిఫార్సు చేయమంటారు, చేయకపోతే అలుగుతారు.. ఇలా అనేకం ఆయన సొంతం. ఇప్పుడాయన ఓ అడుగు ముందుకేసి 'తాను తలుచుకుంటే ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయగలను' అన్నట్టున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై ఇంతవరకు అమెరికా వైపు నుంచి ఇంతవరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఇండియన్ మీడియా మాత్రం దాన్ని ఓ జోక్ గా కొట్టిపడేస్తోంది.
అసలింతకీ ఏమి జరిగిందంటే..
భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను తలుచుకుంటే నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయగలనని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఉన్న ఈ క్లిప్ భారతీయ నెటిజన్లలో తీవ్ర గందరగోళాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ట్రంప్ రెండవమారు అధికారంలోకి వచ్చాక భారత్-అమెరికా సంబంధాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్న తరుణంలో ఈ వైరల్ క్లిప్ దుమారం రేపుతోంది.
🚨 Breaking News
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) February 8, 2026
Donald Trump's statement is making headlines.
“I could end Narendra Modi’s political career, but I don’t want to.”
One Statement, Many Questions.
Is this just a Political statement, or is there a Deeper Meaning Behind It?
In Global Politics, Words Carry… pic.twitter.com/my42g7J6r2
ఈ వీడియో 2025 అక్టోబర్‌లో వైట్ హౌస్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడిన సందర్భానికి సంబంధించిందని అంటున్నారు. ఆ సమయంలో ఆయన మోదీని ప్రశంసిస్తూ, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీకి తనపై ఎంతో ప్రేమ ఉందని చెబుతూ, ఆ ‘ప్రేమ’ అనే పదాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ట్రంప్ చమత్కరించారు. ఆ సందర్భంలోనే ఆయన తాను ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
కొందరు కేవలం ఒక చిన్న పదాన్ని పట్టుకుని, అప్పటి సందర్భాన్ని తొలగించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టమయ్యింది. నాడు ట్రంప్ భారతదేశంపై, మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తూ, గతంలో భారత్ పదే పదే నాయకత్వ మార్పులను చూసేదని, కానీ మోదీ వచ్చాక రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. మోదీని కాలపరీక్షకు నిలబడిన నాయకుడు అని ట్రంప్ కొనియాడారు.
అంతర్జాతీయ మీడియా ఏమంటోంది?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే —
ఈ వీడియోపై ఇప్పటివరకు ప్రధాన అంతర్జాతీయ మీడియా సంస్థలు (BBC, CNN, Reuters, The New York Times వంటి సంస్థలు) ఎక్కడా ట్రంప్ మోదీని బెదిరించినట్లు రిపోర్ట్ చేయలేదు. అధికారిక వైట్ హౌస్ ట్రాన్స్క్రిప్ట్‌లలో కూడా ఇలాంటి హెచ్చరికల ప్రస్తావన లేదు.
అసలు క్లిప్‌లో ట్రంప్, మోదీని “గ్రేట్ మ్యాన్”, “స్ట్రాంగ్ లీడర్”గా కొనియాడినట్లు తెలుస్తోంది. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా అభివర్ణిస్తూ, గతంలో భారత్ తరచూ నాయకత్వ మార్పులను చూసిందని, మోదీ వచ్చిన తర్వాత రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. మోదీని కాలపరీక్షకు నిలబడిన నాయకుడిగా ట్రంప్ పేర్కొన్నారు.
భారత మీడియా స్పందన
భారత ప్రధాన మీడియా ఈ వీడియోను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. చాలా సంస్థలు దీనిని సందర్భం తొలగించిన క్లిప్, సోషల్ మీడియా మానిప్యులేషన్గా పేర్కొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు కొత్తవి కావని, ఆయన తరచూ ఇలాంటి అతిశయోక్తులు, సరదా వ్యాఖ్యలు చేస్తుంటారని విశ్లేషించాయి.
అయితే సోషల్ మీడియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్–అమెరికా సంబంధాల్లో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్న తరుణంలో ఈ క్లిప్ రావడం, అనేక అనుమానాలకు దారి తీసింది. కొందరు దీనిని భారత్‌పై అమెరికా రాజకీయ ఒత్తిడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
ట్రంప్ మాటలే అంత...
డొనాల్డ్ ట్రంప్ రాజకీయ శైలి చాలా వ్యక్తిగతం. ఆయన మాటల్లో అతిశయోక్తి, స్వీయప్రశంస, చమత్కారం కలగలిసినట్లే ఉంటాయి. ఇదే విషయాన్ని గతంలో జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్, కెనడా ప్రధాని ట్రూడో విషయంలోనూ ప్రపంచం చూసింది.
అంతర్జాతీయ సంబంధాల నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక అమెరికా అధ్యక్షుడు మరో దేశ ప్రజాస్వామ్య నాయకుడి రాజకీయ జీవితాన్ని “అంతం చేయగలడు” అన్నది వాస్తవికంగా సాధ్యం కాని మాట. కానీ ట్రంప్ స్టైల్‌లో అలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు.
ఈ వీడియో నిజంగా ఒక హెచ్చరికా?
లేక ట్రంప్ శైలిలోని సరదా వ్యాఖ్యను సోషల్ మీడియా వక్రీకరించిందా?
ఇప్పటివరకు లభ్యమైన ఆధారాలు, అంతర్జాతీయ మీడియా స్పందన చూస్తే — ఇది సందర్భం కోల్పోయిన వ్యాఖ్య, డిజిటల్ యుగంలో మానిప్యులేషన్‌కు మరో ఉదాహరణగా కనిపిస్తోంది.
ట్రంప్ మాటలు సంచలనం సృష్టించవచ్చు. కానీ ఆ మాటల వెనుక ఉన్న రాజకీయ వాస్తవం వేరు. మోదీ రాజకీయ భవిష్యత్తు భారత ప్రజల చేతుల్లో ఉంది తప్ప, అమెరికా అధ్యక్షుడి చమత్కార వ్యాఖ్యలలో కాదు.
ట్రంప్ స్టేజ్ మీద మాటలతో సంచలనం సృష్టిస్తారు. రాజకీయ వాస్తవం మాత్రం ప్రజాస్వామ్యపు నేల మీదే నిర్ణయమవుతుంది.
Next Story

