
ఇరాన్-అమెరికా యుద్ధం 15వ రోజుకు చేరింది..
'దెబ్బకు దిగొచ్చేలా చేశాం, అమెరికా అడుక్కునేలా చేశాం'
"రష్యా ఆయిల్ కొనమని అమెరికా ఇప్పుడు ఇండియాను 'అడుక్కుంటోంది'!"
రష్యా ఆయిల్ కొనమని భారత్ సహా ఇతర దేశాలను అమెరికా ‘అడుక్కుంటోంది’, మా వల్లే అమెరికా దిగొచ్చిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం 15వ రోజుకు చేరింది. దాడులు ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం తెలెత్తింది. రష్యా చమురు విషయంలో వాషింగ్టన్ వైఖరిని ఆరాగ్చీ తప్పుబట్టారు.
లెబనాన్ పై దాడులకు చలించిపోయిన ఓ యువతిని ఓదార్చుతున్న యువకుడు (ఫోటో కర్టసీ అల్ జజీరా)
రష్యా చమురు విషయంలో అమెరికా అనుసరిస్తున్న తీరును ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా విమర్శించారు. గతంలో రష్యా నుండి దిగుమతులను నిలిపివేయాలని దేశాలపై ఒత్తిడి తెచ్చిన వాషింగ్టన్, ఇప్పుడు భారత్ సహా ప్రపంచ దేశాలను రష్యా ముడి చమురు కొనాలని కోరుతోందని ఆయన ఆరోపించారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అరాగ్చీ స్పందిస్తూ.. రష్యా నుండి చమురు కొనవద్దని భారత్‌పై నెలల తరబడి ఒత్తిడి తెచ్చిన అమెరికా, ఇరాన్‌తో యుద్ధం మొదలైన ఈ రెండు వారాల వ్యవధిలోనే తన మాట మార్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ రష్యా ముడి చమురును కొనాలని అమెరికా అడుగుతోందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అలాగే యూరోపియన్ దేశాలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రష్యాకు వ్యతిరేకంగా తమకు అమెరికా మద్దతు ఇస్తుందనే ఆశతో, ఇరాన్‌పై జరుగుతున్న ఈ "అక్రమ యుద్ధాన్ని" యూరోపియన్ దేశాలు సమర్థిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధానికి మద్దతు ఇస్తే, రష్యాతో పోరాటంలో వాషింగ్టన్ అండగా ఉంటుందని యూరప్ నమ్ముతోందని, కానీ అది తప్పు అని అరాగ్చీ కొట్టిపారేశారు.
గతంలో అమెరికా ఏమన్నది?
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించింది.
రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలని లేదా పూర్తిగా నిలిపివేయాలని భారత్ సహా తన మిత్రదేశాలపై అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
రష్యాతో భారీగా వ్యాపార లావాదేవీలు జరిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో అమెరికా ఉన్నతాధికారులు పరోక్షంగా హెచ్చరించారు.
అప్పుడు ఇండియా ఏమి చెప్పింది?
భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ వంటి దేశానికి తక్కువ ధరకు ఇంధనం లభించడం కీలకమని, తన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ చమురు కొంటామని భారత్ కుండబద్ధలు కొట్టింది. భారత్ కొనే చమురు కంటే, యూరప్ దేశాలు రష్యా నుంచి ఒక మధ్యాహ్నం పూట దిగుమతి చేసుకునే గ్యాస్, చమురు చాలా ఎక్కువని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా సమాధానమిచ్చారు.
ఇప్పుడెందుకీ విషయం తెరపైకి వచ్చింది?
ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నేపథ్యంలో, పరిస్థితులు తలకిందులయ్యాయి.
ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ఆరోపణల ప్రకారం.. గతంలో రష్యా ఆయిల్ వద్దన్న అమెరికా, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో చమురు కొరతను అధిగమించడానికి రష్యా ఆయిల్ కొనాలని భారత్ వంటి దేశాలను ‘అడుక్కుంటోంది’.
ఇరాన్ చమురు సరఫరాను నిలిపివేసిన తరుణంలో, ప్రపంచ మార్కెట్‌లో ధరలు నియంత్రణలో ఉండాలంటే రష్యా చమురు మార్కెట్‌లోకి రావడం అమెరికాకు ఇప్పుడు అవసరంగా మారింది.
తన అవసరాల కోసం గతంలో వద్దన్న రష్యా ఆయిల్‌ను ఇప్పుడు కొనమని అమెరికా ప్రోత్సహిస్తోందని ఇరాన్ విమర్శిస్తోంది, అందుకే ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం లైవ్ అప్‌డేట్స్: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం విస్తరించింది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా మధ్యప్రాచ్యంలోనే అత్యంత ప్రమాదకరమైన సంక్షోభంగా మారింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ పై వైమానిక దాడులు నిర్వహించడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో ప్రాంతీయంగా పెను ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Next Story

