చైనా అధ్యక్షుడిని కలవబోతున్న అమెరికా అధ్యక్షుడు
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్

చైనా అధ్యక్షుడిని కలవబోతున్న అమెరికా అధ్యక్షుడు

వచ్చే నెలలో దక్షిణ కొరియా వేదికగా అగ్ర రాజ్యాధిపతుల సమావేశం?


చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా. ఇద్దరు దేశాధినేతలు వచ్చే నెల దక్షిణ కొరియాలో సమావేశం అయ్యే అవకాశం ఉందని అమెరికా సీనియర్ అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. దక్షిణ కొరియాలో వచ్చే నెలలో ఆసియా- పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. దీనికి జిన్ పింగ్, ట్రంప్ హజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

ట్రంప్ పరిపాలన విభాగానికి చెందిన ముగ్గురు అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు, ఆయన సలహదారులు అక్టోబర్ లో దక్షిణ కొరియాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు.
ఈ శిఖరాగ్ర సమావేశం దక్షిణ కొరియాలోని జియోంగ్జు నగరంలో అక్టోబర్ చివర నుంచి లేదా నవంబర్ ప్రారంభంలో జరగనుంది. గత నెలలో ట్రంప్ కు ఫోన్ చేసిన జిన్ పింగ్ చైనా పర్యటనకు ఆహ్వానించారు. ట్రంప్ దీనికి అంగీకరించినప్పటికీ ఈ తేదీలు ఇంకా ఖరారు అవ్వలేదు.
అజెండాలో ఏముంది..
ట్రంప్ ప్రయాణ ప్రణాళిక ఇంకా ఖరారు కానప్పటికీ ఆయన తన పర్యటనకు ఇంకా ఎక్కువ దేశాలను సందర్శించే అవకాశం ఉంది. అమెరికాకు మరిన్ని పెట్టుబడులు సేకరించే ప్రయత్నంలో భాగంగా ఈ పర్యటన జరుగుతుందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటన ఆర్థిక సహకారం, వాణిజ్యం, రక్షణ, పౌర అణు సహకారం గురించి చర్చలపై దృష్టి సారిస్తుందని అమెరికా మీడియాతో మాట్లాడిన వైట్ హౌజ్ అధికారి ఒకరు తెలిపారు.


Read More
Next Story