
‘ఇరాన్ లీడర్ల సమాచారం ఇవ్వండి..భారీ బహుమతి ఇస్తాం’
రూ.80 కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా..
ఇరాన్ నాయకుల సమాచారం ఇచ్చే భారీ బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లీడర్ల గురించి సమాచారం అందిస్తే 10 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 80 కోట్లకు పైగా) ఇస్తానని పేర్కొంది. బహుమతి ఇవ్వడంతో పాటు అవసరమైతే పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
సోషల్ మీడియోలో పోస్టర్..
‘‘Rewards for Justice’’ పేరిట అమెరికా విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇరాన్‌కు చెందిన పలువురు ప్రముఖ నాయకుల పేర్లు, ఫొటోలను అందులో పొందుపర్చారు.
Got information on these Iranian terrorist leaders?
— Rewards for Justice (@RFJ_USA) March 13, 2026
Send us a tip. It could make you eligible for a reward and relocation. pic.twitter.com/y7avkqdGWw
పోస్టర్‌లో కొత్త లీడర్ కూడా..
అమెరికా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఇరాన్ కొత్త లీడర్‌గా భావిస్తున్న మొజ్‌టబా ఖమేనీ (Mojtaba Khamenei) కూడా ఉన్నారు. ఆయనతో పాటు సుప్రీం లీడర్ కార్యాలయానికి చెందిన ఉప చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలి ఆగ్సర్ హెజబా (Ali Asghar Hejazi), సైనిక సలహాదారు యహె రహీం సఫెవీ (Yahya Rahim Safavi), ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖైతావ్ (Esmail Khatib)తో పాటు ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి.
అమెరికా ఆరోపణలేంటి?
పోస్టర్‌లో ఉన్న నాయకులు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన ముఖ్య విభాగాలను నియంత్రిస్తున్నారని అమెరికా భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళిక తయారు చేయడం, పథక రచనలో వీరి పాత్ర ఉందని అమెరికా అనుమానిస్తోంది.
మోజ్తాబా ఖమేనీ పరిస్థితిపై అనిశ్చితి..
ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో మోజ్తాబా ఖమేనీ పరిస్థితిపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆయన గాయపడినట్లు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ దాడుల్లో ఆయన కుటుంబ సభ్యుల్లో కొంతమంది మరణించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
మోజ్తాబా ఖమేనీ సజీవంగా ఉన్నాడని, అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్నాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భావిస్తున్నారు.
‘మోజ్తాబా ఇన్‌కేపబుల్ లీడర్’..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయన చేసిన మొదటి ప్రకటనను కూడా ఒక టెలివిజన్ వ్యాఖ్యాత చదివి వినిపించినట్లు సమాచారం.
మోజ్తాబా ఖమేనీ నియామకాన్ని ట్రంప్ తప్పుబడుతున్నారు. ఇరాన్ కొత్త లీడర్ “బలహీన నాయకుడు” అంటూ ఆ నియామకం సరైనది కాదని పేర్కొన్నారు.
పెరుగుతోన్న ఉద్రిక్తత..
ఇరాన్ నాయకులపై అమెరికా బహుమతి ప్రకటించడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామం అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది.

