
మొజ్తాబా, ట్రంప్, నెతన్యాహూ
ఇరాన్ పై దాడికి ట్రంప్ వెనుకంజ! మరో 2 వారాల గడువు
లేఖ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, పాక్ మధ్యవర్తిత్వం, ఇరాకాటంలో ఇజ్రాయెల్
ఇరాన్ విధ్వంసం రెండు వారాలు ఆగింది. ఇరాన్ ను రాత్రికి రాత్రి నాశనం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఫలించినట్టు అరబ్ దేశాలు ప్రశంసిస్తున్నాయి. రెండు వారాల కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ వైట్ హౌస్ నుంచి కొద్దిసేపటి కిందట ఓ లేఖ విడుదల చేశారు.
🚨 President Donald J. Trump makes a statement on Iran: pic.twitter.com/9mqTayL0Q3
— The White House (@WhiteHouse) April 7, 2026
యుద్ధం 40వ రోజుకు చేరుకున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. హర్మోజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. "ఒక నాగరికతే అంతం కాబోతోంది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి.
ఈ దశలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం నెరిపారు. చర్చల కోసం సమయం కావాలని, దాడులను వాయిదా వేయాలని ట్రంప్‌ను కోరారు.
ఈమేరకు డోనాల్డ్ ట్రంప్ కార్యాలయం విడుదల చేసిన లేఖ ప్రకారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రభుత్వం రెండు వారాల పాటు యుద్ధాన్ని నిలిపివేసేందుకు (Ceasefire) అంగీకరించాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జరిపిన రాయబారం ఫలితంగా ఎల్లుండి శుక్రవారం నుంచి ఇస్లామాబాద్‌లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ఇంకా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు:
హర్మోజ్ జలసంధి విముక్తి: ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హర్మోజ్ జలసంధిని వెంటనే తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఓడల రాకపోకలకు ఆటంకం కలగకుండా తన సాయుధ దళాలు సహకరిస్తాయని హామీ ఇచ్చింది.
లెబనాన్ కూడా చేరిక: ఈ కాల్పుల విరమణ కేవలం ఇరాన్-అమెరికాలకే కాకుండా, ఇజ్రాయెల్ దళాలు ఉన్న లెబనాన్ ప్రాంతానికి కూడా వర్తిస్తుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
ట్రంప్ వెనకడుగు: ఇరాన్ సంస్కృతిని, మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామన్న ట్రంప్.. ఇరాన్ పంపిన "10 సూత్రాల ప్రతిపాదన"పై చర్చించేందుకు సిద్ధమయ్యారు.
నెతన్యాహుకు ఎదురుదెబ్బ?
ఈ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహును ఇరకాటంలో పడేసింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రకటించినప్పుడు, "అయతుల్లా పాలనను అంతం చేయడమే లక్ష్యం" అని నెతన్యాహు చెప్పారు. కానీ ప్రస్తుత ఒప్పందం ప్రకారం ఇరాన్ ప్రభుత్వం, సైన్యం ఇంకా బలంగానే ఉన్నాయి.
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, జెరూసలేం చుట్టుపక్కల బాంబు పేలుళ్లు, సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) పేర్కొంది.
హిజ్బుల్లా ముప్పు తొలగే వరకు లెబనాన్ వదిలి వెళ్ళమని ఇజ్రాయెల్ చెబుతోంది. ఒకవేళ ట్రంప్ అంగీకరించిన కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తిస్తే, అది ఇజ్రాయెల్ వ్యూహానికి అడ్డంకిగా మారుతుంది.
ఇజ్రాయెల్‌లో ఎన్నికల ఏడాది కావడంతో, నెతన్యాహు క్యాబినెట్‌లోని తీవ్రవాద మితవాద సభ్యులు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది.
విజయం ఎవరిది?
ట్రంప్ ప్రస్తావించిన ఇరాన్ 10 సూత్రాల ప్రతిపాదన ఆధారంగా యుద్ధం ముగిస్తే, అది అంతర్జాతీయంగా టెహ్రాన్ సాధించిన దౌత్య విజయంగా పరిగణించాలి. మరోవైపు, ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా అణచివేయగలమని భావించిన నెతన్యాహు అంచనాలు తప్పాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ఆపుతుందా లేక తన లక్ష్యం కోసం ఒంటరి పోరాటం కొనసాగిస్తుందా అనేది ఇస్లామాబాద్ చర్చల తర్వాతే స్పష్టమవుతుంది.
Next Story

