హర్మోజ్ ముట్టడి, ఆయిల్ కోసం హాహాకారాలు!
x

హర్మోజ్ ముట్టడి, ఆయిల్ కోసం హాహాకారాలు!

ఇరాన్-అమెరికా యుద్ధం 46వ రోజుకు చేరింది.. ఆయిల్ సంక్షోభం ముదిరింది..


ఇరాన్-అమెరికా యుద్ధం 46వ రోజుకు చేరింది. ఇరాన్ పై మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన చమురు సరఫరాను దెబ్బతీసే దిశగా సాగుతోంది. హర్ముజ్ జలసంధి వద్ద మొదలైన అమెరికా నౌకాదళ దిగ్బంధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి నుంచే ఇరాన్ ఓడరేవులపై అమెరికా సైన్యం దిగ్బంధాన్ని (Blockade) ప్రారంభించింది. ఇరాన్ నౌకలనూ వదిలిపెట్టబోమని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ దిగ్బంధానికి అమెరికాకు ఇతర దేశాలు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
సముద్రపు దొంగతనం కాదా?
అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధంపై ఇరాన్ చాలా ఘాటుగానే స్పందించింది. అమెరికా చర్య చట్టవిరుద్ధమని, అంతర్జాతీయ జలాల్లో నౌకలను అడ్డుకోవడం "సముద్రపు దొంగతనం" (Piracy) కిందకే వస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా ఒత్తిడికి లొంగబోమని స్పష్టం చేసింది.
ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి ఒక ప్రకటన చేస్తూ, "పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో భద్రత అనేది అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండదు" అని హెచ్చరించారు. అంటే, తమ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగితే, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల (అమెరికా మిత్రదేశాల) ఓడరేవులు కూడా సురక్షితంగా ఉండవని పరోక్షంగా హెచ్చరించారు.
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ
హర్ముజ్ జలసంధి సమీపంలోకి వచ్చే శత్రువుల (అమెరికా) యుద్ధ నౌకలను తాము కాల్చివేస్తామని, ఇది మునుపటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) తెలిపింది. ఇరాన్ ఇప్పటికే ఈ జలసంధి ద్వారా వెళ్లే నౌకల నుంచి భారీగా "టోల్ ఫీజు" వసూలు చేస్తోంది. తమకు కాకుండా అమెరికాకు మద్దతు ఇచ్చే నౌకలను ఈ మార్గంలో అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఎందుకు ఈ హర్ముజ్ జలసంధి ఇంత ముఖ్యం?
ప్రపంచ దేశాలకు రవాణా అయ్యే చమురులో దాదాపు 20% నుండి 30% వరకు ఈ చిన్న జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అమెరికా ఈ మార్గాన్ని ఎంచుకుంది. దీనివల్ల చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే, భారత్ వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని అంచనా. మరోపక్క హర్మోజ్ జలసంధి ద్వారా ఆయిల్ తీసుకువెళ్లే దేశాల్లో హాహాకారాలు మొదలయ్యాయి.
దిగ్బంధనం ఎక్కువ కాలం కొనసాగితే, బ్యారెల్‌ ముడిచమురు 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం బ్యారెల్‌ ధర 99 డాలర్ల వద్ద ఉందని, అమెరికా తీసుకోబోయే ఈ తీవ్రమైన నిర్ణయం ప్రభావాన్ని ఇవి ఏమాత్రం ప్రతిబింబించడం లేదని ఆనిక్స్‌ ఎండీ జోర్జ్‌ మోంటెపెక్యూ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు చూస్తే.. ధరలు 140-150 డాలర్లకు చేరొచ్చని భావిస్తున్నారు.
ఆర్థిక, దౌత్యపరమైన పట్టు..
ఇరాన్ తన 10 అంశాల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇందులో భాగంగా తమపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించాలని, అమెరికా తన సైన్యాన్ని ఈ ప్రాంతం నుంచి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. తమను బెదిరించడం ద్వారా లొంగదీసుకోవాలని చూడటం అమెరికా మూర్ఖత్వమని ఇరాన్ నేతలు విమర్శించారు.
హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ ప్రభుత్వం "ఆర్థిక ఉగ్రవాదానికి" పాల్పడుతోందని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఆరోపించారు.
Read More
Next Story