
ఇరాన్-అమెరికా యుద్ధం 34వ రోజుకు చేరింది..
'మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లను ముంచనున్న ట్రంప్!'
యుద్ధం ముగింపుతో ముడిపడిన గెలుపోటములు, ట్రంప్ తాపత్రయం అదేనా!
ఇరాన్ యుద్ధంలో గెలుపు చూపి వచ్చే నవంబర్ లో జరగబోయే మధ్యంతర ఎన్నికలలో తన పార్టీ రిపబ్లికన్లకి విజయం సాధించిపెట్టాలనుకున్న డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నం పెద్దగా నెరవేరేలా కనిపించడం లేదు. భారతీయ కాలమానం ప్రకారం ఏప్రిల్ 2 ఉదయం 6.30 గంటలకు ట్రంప్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. ఇరాన్ తో యుద్ధం మొదలైన 33 రోజుల తర్వాత ఆయన తొలిసారి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇది. రాజకీయంగా చాలా క్లిష్టమైన సమయంలో వచ్చింది.
మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు? ఏమిటి?
ఈ ఏడాది నవంబర్ 3 న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు లేదా House of Representativesకు జరిగే ఎన్నికలివి. 435 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం రిపబ్లికన్లకు రెండు సీట్ల మెజారిటీ మాత్రమే ఉంది. (218) ఈసారి ఎన్నికల్లో ఓ చిన్న మార్పు జరిగినా డెమోక్రాట్స్ గెలవచ్చు.
ఇక సెనేట్ లో రిపబ్లికన్లకు చెప్పుకోదగిన మెజారిటీ ఉంది. ప్రస్తుతం 53 మంది ఉన్నారు. డెమోక్రాట్లు ఒక్కసారిగా మెజారిటీ సాధించకపోవచ్చు గాని అసాధ్యమైతే కాదు.
మిడ్‌టర్మ్‌లు సాధారణంగా ప్రస్తుత పాలకవర్గానికి లేదా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉంటుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం రిపబ్లికన్లది గనుక అధ్యక్షుడు చేసే ప్రతి పనీ ఈ ఎన్నికల్లో ప్రధానాంశమే అవుతుంది. ఇప్పుడు యుద్ధం, ఆర్థిక సమస్యలు ట్రంప్ కి, రిపబ్లికన్లకి నష్టాన్ని కలిగించే అంశాలుగా మారాయి.
ప్రస్తుతం అభిప్రాయం ఎలా ఉందంటే..
అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విధానాలను ఆమోదించే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఆయన్ను మెచ్చుకునే వారి శాతం 36-42% మాత్రమే. మరికొన్ని సర్వేలలో అయితే ఈ శాతం 36-40% మధ్యే ఉంది. వ్యతిరేకించే వారి శాతం 57-64%. ఇది ట్రంప్ రెండో టర్మ్‌లో వచ్చిన అపకీర్తిగా చెబుతున్నారు.
ఇరాన్ తో యుద్ధానికి మద్దతు ఇచ్చేవారి శాతం 35-40% మాత్రమే. వ్యతిరేకించే వారి శాతం 55-61%గా ఉంది. యుద్ధం మొదలై ఒక నెల దాటినా ఇంకా కొలిక్కి రాలేదన్న అభిప్రాయమే ఎక్కువగా ఉంది. ట్రంప్ పక్కన నిలిచే వారి శాతం బాగా తగ్గుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కి ఓటు వేస్తారన్న ప్రశ్నకు ఎక్కువ మంది డెమోక్రాట్ల వైపే మొగ్గుచూపుతున్నారు. రిపబ్లికన్ల కన్నా డెమోక్రాట్స్ కి అదనంగా 4 నుంచి 8 శాతం మంది మొగ్గు చూపారు. ఇది డెమోక్రాట్లకి Houseలో మంచి అవకాశం ఇస్తోంది.
రిపబ్లికన్లలోనూ ట్రంప్ విధానాల పట్ల వ్యతిరేకత ఉంది. ట్రంప్ కి 70, 80% శాతం మంది మద్దతు మాత్రమే ఉంది. 20శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఇక స్వతంత్రులు, యువతీ యువకులు ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే...
ఆయిల్, గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. ఇరాన్ తో యుద్ధం వల్ల ఇంధన ధరలు గ్యాలన్ 4 డాలర్లు దాటిపోయాయి. దీంతో ప్రజల ఖర్చులు పెరిగిపోయాయి. అమెరికాలో కార్లు లేకుండా పని జరగదు. ఇది యుద్ధ వ్యతిరేకతను పెంచుతోంది.
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియకుండా ఉంది. ఇప్పటికే చాలాసార్లు మరో 2,3 వారాలంటూ ట్రంప్ చెప్పినందున ఆయన్ను జనం నమ్మడం లేదు.
ట్రంప్ ఇవాళ్టి ప్రసంగం తర్వాత కూడాఇరాన్- ఇజ్రాయెల్ పై మిస్సైల్ దాడులు చేసింది. యుద్ధాన్ని విరమించేది తామేనని చెబుతోంది. భూతల యుద్ధానికి సిద్ధమంటోంది.
ఈ యుద్ధం అమెరికా కంటే ఇజ్రాయెల్ కే ఎక్కువ లాభం అని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు.
ట్రంప్ ప్రసంగం ఈ నేపథ్యంలోదే?
ఇది నష్టనివారణ ప్రసంగమని, నిర్దిష్ట ప్రతిపాదనలు లేని ఊకదంపుడు మాటలుగా ట్రంప్ ప్రసంగాన్ని పలువురు అభివర్ణించారు. ఇదో రాజకీయ బేరసారాల ప్రసంగం మాత్రమేనని పలువురు విశ్లేషకులు చెప్పారు.
వైట్ హౌస్ వర్గాలు ఏమన్నాయంటే - యుద్ధాన్ని "విజయం"గా చూపించి, "తొందర్లో ముగిస్తాం" అనే ఆశ కల్పించి ప్రజలలో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించేందుకు చేసిన విఫల ప్రయత్నంగా భావిస్తున్నారు. 7 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, రిపబ్లికన్లు ఇప్పుడే "మిషన్ పూర్తి అయింది" లాంటి గొప్పలు చెప్పుకునేలా ట్రంప్ చేసిన ఓ ప్రయత్నమే ఈ స్పీచ్.
కానీ విశ్లేషకులు మాత్రం.. యుద్ధం త్వరగా ముగిస్తే మాత్రమే రిపబ్లికన్లకి మేలు తప్ప ఆలస్యం అయ్యే కొద్ది డెమోక్రాట్లకే లాభం అంటున్నారు.
ఈ ప్రసంగం ట్రంప్ గ్రాఫ్‌ను కొంత లేపడానికి చేసిన ప్రయత్నమే గాని క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ ధరలు పెరగడం అమెరికన్ల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. మరోపక్క యుద్ధం కొనసాగితే రిపబ్లికన్లు నష్టపోకతప్పదు. డెమోక్రాట్స్ మాత్రం దీన్ని కొనితెచ్చుకున్న యుద్ధంగా, దేశ ఆర్థికాభివృద్ధికి విఘాతంగా ఎత్తి చూపి లబ్ధి పొందాలని చూస్తున్నారు.
ఎన్నికలకు ఇంకా 7 నెలల సమయం ఉంది కనుక దేశంలో అనేక మార్పులు వస్తాయని రిపబ్లికన్లు ఆశాభావంతో ఉన్నా ఓటమి భయం మాత్రం వెంటాడుతోంది. యుద్ధం త్వరగా ముగిసి, ఆయిల్ ధరలు తగ్గితే రిపబ్లికన్లు ఒడ్డున పడొచ్చు లేదంటే డెమోక్రాట్లు ఘన విజయం వైపు అడుగులు వేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.
Next Story

