
ఇరాన్-అమెరికా యుద్ధం 27వ రోజుకు చేరింది. యుద్ధ మంటలు ఆగే సూచనలు కనిపించడం లేదు
ఇరాన్, ప్లీజ్ లొంగిపో, లేకుంటే యుద్ధమే: అమెరికా!
27వ రోజూ ఆగని గర్జన.. అమెరికా హెచ్చరికల్ని భేఖాతరు చేసిన ఇరాన్
ఇరాన్- అమెరికా మధ్య మొదలైన భీకర పోరు 27వ రోజుకు చేరుకుంది. అంతర్జాతీయ సమాజం శాంతి చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇరుపక్షాల మొండివైఖరి వల్ల ఎటువంటి 'బ్రేక్ థ్రూ' లభించడం లేదు. సరికదా, యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
అమెరికా అల్టిమేటం – ఇరాన్ ధిక్కారం
యుద్ధంలో పరాజయాన్ని అంగీకరించాలని అమెరికా తాజాగా టెహ్రాన్‌కు అల్టిమేటం జారీ చేసింది. "ఓటమిని ఒప్పుకోకపోతే మునుపెన్నడూ చూడని రీతిలో భారీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని వాషింగ్టన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. అయితే, ఈ హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చింది. శాంతి చర్చల ప్రసక్తే లేదని, చివరి వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అమెరికా డిమాండ్ ను ఎద్దేవా చేసింది. చావనైనా చస్తాం గాని లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
అమెరికా ఇలా ఎందుకు డిమాండ్ చేస్తోంది...
-ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్న యూరేనియం (60% గ్రేడ్) నిల్వలను పూర్తిగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)కి అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. భవిష్యత్తులో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకూడదనేది అమెరికా ప్రధాన లక్ష్యం.
-ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలకు ముప్పుగా మారాయి. అందుకే ఇరాన్ తన క్షిపణి నిల్వలను నాశనం చేయాలి. 1,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి ఉన్న క్షిపణుల తయారీని నిలిపివేయాలి.
-డ్రోన్ల తయారీ కేంద్రాలను మూసివేయాలి. మధ్యప్రాచ్యంలో అస్థిరతకు కారణమవుతున్నారని భావిస్తున్న హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మిలీషియాలకు ఇరాన్ అందిస్తున్న ఆర్థిక, సైనిక మద్దతును పూర్తిగా ఉపసంహరించుకోవాలని అమెరికా కోరుతోంది.
- ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ మూసివేయడం వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి ఆర్థిక సంక్షోభం తలెత్తుతోంది. ఈ జలసంధిని వెంటనే తెరిచి, అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించబోమని హామీ ఇవ్వాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది.
-యుద్ధం ప్రారంభంలోనే అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ మరణించడం, ఇరాన్ లో పౌర నిరసనలు మిన్నంటడం వంటివి ఇరాన్ సైనిక శక్తిని బలహీనపరిచాయని అమెరికా భావించింది. అలా జరగకపోవడంతో ఇరాన్ పాలనలో సమూల మార్పులు తీసుకురావాలని వాషింగ్టన్ యోచిస్తోంది.
-అమెరికా పెట్టిన 15 పాయింట్ల శాంతి ప్రతిపాదనను ఇరాన్ "అహేతుకమైనది" అని కొట్టిపారేసింది. యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ ఎదురు డిమాండ్ చేస్తోంది. శాంతి చర్చలు మొదలైనట్లు హడావిడి ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు తీవ్రమవుతున్నాయి.
కొనసాగుతున్న క్షిపణి దాడులు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్నాయి. ఇటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్‌లోని మధ్య, ఉత్తర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో విరుచుకుపడుతోంది.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ విధ్వంసం
మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లో 'బఫర్ జోన్' (Buffer Zone) విస్తరిస్తున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు, అక్కడ భారీగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌ను అక్షరాలా కుదిపేస్తోంది.
పశ్చిమాసియా దేశాల జోక్యం..
యుద్ధం ఇరాన్-అమెరికా మధ్యనే పరిమితం కాకుండా చుట్టుపక్కల దేశాలనూ ఆందోళనలోకి నెట్టింది. బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, మరియు యూఏఈ దేశాలు తమ గగనతలం మీదుగా వస్తున్న ఇరాన్ క్షిపణులను, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుంటున్నాయి.
హోర్ముజ్ జలసంధి ముప్పు: ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' దీర్ఘకాలం పాటు మూతపడితే సంభవించే ఆర్థిక పరిణామాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గ్యాస్, చమురు సరఫరా నిలిచిపోతే ప్రపంచం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Next Story

