ట్రంప్ వైరాగ్యం.. నేనెంత కాలం ఉంటానో, ఏమో!
x

ట్రంప్ వైరాగ్యం.. నేనెంత కాలం ఉంటానో, ఏమో!

నాలాంటి గొప్ప ప్రెసిడెంట్లనే పిచ్చోళ్లు టార్గెట్ చేస్తుంటారెందుకో..


ప్రపంచాన్ని తనదైన శైలిలో బెదిరించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైరాగ్యంలో పడ్డారు. పన్నులు పెంచుతానని, తన మాట విననివాళ్ల పీచమణుస్తామని హెచ్చరికలు చేసే ట్రంప్ ఇలా ఎందుకు వేదాంత ధోరణిలో మాట్లాడతారనేదేగా మీ సంశయం.. నిజమే, ఆయన అలానే మాట్లాడారు. తన ఇంట్లోకి ఓ దుండగులు చొరబడి తుపాకీతో హల్ చల్ చేయబోయినప్పుడు ట్రంప్ భద్రతా సిబ్బంది ఆ కుర్రాణ్ణి కాల్చిపారేశారు. ఆ ఘటనపై ఆయన స్పందిస్తూ చాలా వైరాగ్యంతో 'ఇంకెంత కాలం ఉంటామో ఏమో' అని 80 ఏళ్ల ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.
ఆయనకు ఫ్లోరిడాలో అద్భుత రాజసౌధం ఉంది. దానిపేరు మార్-ఏ-లాగో. అందులోకి తుపాకీతో చొరబడ్డ ఓ యువకుడిని భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. శనివారం ఈ సంఘటన జరిగింది. ఈ ఉదంతంపై ట్రంప్ తొలిసారిగా స్పందించారు. తనను అనేక మంది టార్గెట్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదని కూడా వ్యాఖ్యానించారు.
"నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలియదు," అని ట్రంప్ అన్నారు. "చాలా మంది నన్ను లక్ష్యంగా చేసుకున్నారు (gunning for me), అవునా?" అని ఆయన విలేఖరులకు ఎదురు ప్రశ్న వేశారు.
2024 ఎన్నికల ప్రచార సమయంలో రెండు వేర్వేరు హత్యాయత్నాల నుండి బయటపడిన ట్రంప్, ప్రస్తుత పరిస్థితులపై హాస్యాన్ని జోడిస్తూనే తీవ్రమైన పోలికలు చేశారు. ప్రభావవంతమైన (Consequential) నాయకుడిగా ఉండటం వల్లే ఇలాంటి బెదిరింపులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
"మీరు ఈ పిచ్చి షూటర్ల గురించి చదువుతుంటారు, కానీ వారు కేవలం ప్రభావవంతమైన అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారు," అని ట్రంప్ అన్నారు.
"ప్రభావం చూపని అధ్యక్షుల జోలికి వారు వెళ్లరు." అంటూ ఈ సందర్భంగా ఆయన హత్యకు గురైన మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్. కెన్నెడీల పేర్లను ప్రస్తావించారు. "వారు ప్రభావవంతమైన నాయకులు. అందుకే నేను కొంచెం తక్కువ ప్రభావవంతంగా ఉండాలనుకుంటున్నా.. మనం దీన్ని కొంచెం తగ్గించగలమా?" అని చమత్కరించారు. ఒక దశలో, "కొంతకాలం పాటు సాధారణ అధ్యక్షుడిలా ఉందాం" అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తిని నార్త్ కరోలినాకు చెందిన 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్ మార్టిన్గా అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో మార్టిన్ తన వాహనంతో పామ్ బీచ్ ఎస్టేట్ ఉత్తర గేట్ గుండా దూసుకొచ్చాడని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.
అతని వద్ద ఒక షాట్‌గన్, పెట్రోల్ క్యాన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ రిక్ బ్రాడ్‌షా మాట్లాడుతూ.. "అతన్ని వస్తువులను కింద పడేయమని ఆదేశించాం. అతను గ్యాస్ క్యాన్‌ను కింద పెట్టి, షాట్‌గన్‌ను కాల్పులు జరిపేలా ఎత్తాడు" అని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన ఏజెంట్లు ముప్పును అరికట్టడానికి కాల్పులు జరిపారు.
మార్టిన్ కొన్ని రోజుల క్రితమే తప్పిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మీ తెలిపారు. అతను నార్త్ కరోలినా నుండి ఫ్లోరిడాకు ప్రయాణించి, మార్గమధ్యంలో షాట్‌గన్‌ను సంపాదించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్ అక్కడ లేరు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే పలుమార్లు హత్యాయత్నం జరిగాయి. 2024లో ఎన్నికల ప్రచారం సందర్భంగా తొలిసారిగా ట్రంప్‌పై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ట్రంప్‌ను టార్గెట్ చేయడంతో తూటా ఆయన చెవికి తగులుతూ వెళ్లింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయమైంది. ప్రాణాపాయం తృటిలో తప్పిపోయింది.
Read More
Next Story