
అమెరికా ఇరాన్ యుద్ధం 23వ రోజుకు చేరింది. ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు..
'దారి'ఇస్తావా, ధ్వంసం చేయమంటావా?": ట్రంప్
ట్రంప్ అల్టిమేటమ్ ను భే ఖాతరు చేసిన ఇరాన్, నీ ఇష్టమొచ్చింది చేస్కోమన్న ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం 23వ రోజుకు చేరింది. ఈ యుద్ధ మేఘాలు ఇప్పుడు పెను వినాశనానికి దారితీసేలా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరోపక్క ఇరాన్ సుప్రీం కమాండర్ మొజ్తాబా మరణించినట్టు వార్తలు వస్తున్నాయి.
"లొంగుతావా.. దాడి చేయమంటావా?" అంటూ ట్రంప్ అల్టిమేటమ్ ఇచ్చారు. ఈ అల్టిమేటమ్ ను ఇరాన్ తోసిపుచ్చింది.
ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాల్సిందేనని ఆదేశించారు. లేదంటే ఇరాన్ (Iran) విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు.
‘‘ఇప్పటి నుంచి సరిగ్గా 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తెరవాలి. ఈ క్రమంలో ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదు. దాన్ని పూర్తిగా తెరవకుంటే.. ఇరాన్‌లోని పలు విద్యుత్ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుంది. వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తాం. ముందుగా.. అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రంతో ఈ దాడులు ఆరంభించాల్సి వస్తుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. దీంతో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు.
అయితే అమెరికా హెచ్చరికలను ఇరాన్ కొట్టిపారేసింది. అంతిమ విజయం వరకు పోరాడతామని, లొంగుబాటు ప్రసక్తే లేదని ట్రంప్ ను తిరిగి హెచ్చరించింది. ఇరాన్ తన పంథా మార్చుకోకపోవడంతో "48 గంటల్లో కీలక నిర్ణయం" ఉంటుందనే సంకేతాలు అమెరికా ఇచ్చింది.
ఆగని ఇరాన్ క్షిపణి దాడులు
శాంతి చర్చలు ఒకవైపు వినిపిస్తున్నా, ఇరాన్ మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. అమెరికా తన ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని ఇరాన్ తిప్పికొట్టింది.
డీగో గార్సియా లక్ష్యంగా: అమెరికా-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరమైన డీగో గార్సియాపై ఇరాన్ రెండు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. అందులో ఒకటి మధ్యలోనే కూలిపోగా, మరొకదాన్ని క్షిపణి రక్షణ వ్యవస్థలు అడ్డుకుని, ధ్వంసం చేశాయి. అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ అంశంపై కథనం ప్రచురించింది.
బ్రిటన్ కూడా ఈ క్షిపణి దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ క్షిపణులు ప్రయోగించడం కొత్తేమీ కాకపోయినా ఏకంగా 4 వేల కిలోమీటర్ల దూరం వెళ్లే సామర్థ్యం ఉండటం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు తెలిసిన మేరకు ఇరాన్ క్షిపణుల గరిష్ఠ సామర్థ్యం 2 వేల కిలోమీటర్లే కావడం గమనార్హం. ఈ క్షిపణి దాడులతో పశ్చిమాసియాలోని యుద్ధం హిందూ మహాసముద్రానికీ విస్తరించినట్టేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న డీగో గార్సియా స్థావరం అత్యంత కీలకమైనది. అక్కడ అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక బీ-2 బాంబర్లు సహా అత్యాధునిక మిలిటరీ, రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ వద్ద ఉన్న క్షిపణుల్లో ఖోరామ్‌షెహర్-4 క్షిపణి అత్యధికంగా 2 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదనే డేటా మాత్రమే ఉంది. అవి మొత్తం పశ్చిమాసియాతోపాటు తూర్పు యూరోప్ లోని కొన్ని దేశాల వరకు చేరుకోగలవని అంచనా. కానీ డీగో గార్సియాపైకి ప్రయోగంతో.. ఇరాన్ క్షిపణుల అసలు సామర్థ్యం ఎంత అనే చర్చ జరుగుతోంది. భారతదేశానికి దక్షిణంగా హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న డీగో గార్సియా దీవి (చాగోస్ ఐలాండ్స్‌లో భాగం) ఇరాన్ నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ క్షిపణి అక్కడి వరకు చేరుకుందంటే.. అది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (ఐఆర్‌బీఎం) అని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఈ క్షిపణి అటు బ్రిటన్‌లోని లండన్ వరకు చేరుకోగలదని, చాలా వరకు యూరప్ దేశాలపై దాడి చేయగలదని అంటున్నారు.
ప్రాంతీయ దాడులు: సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. నిన్న రాత్రి ఒక్క సౌదీయే 22 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది.
ఇంధన వనరులపై దెబ్బ: కువైట్, ఖతార్‌లోని ఇంధన కేంద్రాలపై డ్రోన్ దాడులు జరగడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్‌ను కలవరపెడుతోంది.
చమురు దౌత్యం: అమెరికా మాస్టర్ ప్లాన్
యుద్ధం వల్ల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడానికి అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంక్షల సడలింపు: సముద్రంలో ట్యాంకర్లపై సిద్ధంగా ఉన్న ఇరాన్ ముడి చమురు అమ్మకాలపై తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసింది.
ఏప్రిల్ 19 గడువు: ఏప్రిల్ 19 వరకు ఈ అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల సుమారు 140 మిలియన్ బారెళ్ల చమురు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Next Story

