
క్యూబా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధికి జ్ఞాపిక అందజేస్తున్న ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్
'క్యూబా జోలికొస్తే ఏమవుతుందో అమెరికాకి తెలుసు'
ట్రంప్ ప్రపంచానికి రాజేమీ కాదు- హువాన్ కార్లోస్ మార్సన్
'క్యూబా జోలికొస్తే ఏమి జరుగుతుందో అమెరికాకి బాగా తెలుసు. వెనెజువెలా మీద దాడి చేసినట్టు మా దేశం మీద చేస్తామంటే సహించబోం. మాది త్యాగాలతో, పోరాటాలతో రాటు దేలిన దేశం. మమ్మల్ని ఎవరూ బెదిరించలేరు' అన్నారు క్యూబా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) నాయకుడు హువాన్ కార్లోస్ మార్సన్ (Juan Carlos Marson). వాషింగ్టన్‌తో "ఒప్పందం చేసుకోవాలి" అని మిమ్మల్ని నిర్దేశించడానికి డొనాల్డ్ ట్రంప్ ఏమైనా ఈ ప్రపంచానికి రాజా అని ప్రశ్నించారు ఆయన.
దశాబ్దాలుగా క్యూబా ఆధారపడుతున్న వెనిజులా చమురు, నిధులను నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన తరుణంలో మార్సన్ ఇండియా పర్యటనకు వచ్చారు. సీపీఐ శతవార్షికోత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు. 19న సీపీఐ జాతీయ సమితి సమావేశంలోనూ సౌహార్ధ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా 'ది ఫెడరల్ ప్రతినిధి'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ రాజకీయాల మొదలు వెనెజువెలాపై అమెరికా దాడి, తదనంతర పరిణామాలను ఆయన వివరించారు.
ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇలా..
క్యూబా నేతకు స్వాగతం పలుకుతున్న సీపీఐ నాయకులు
మదురో మా మిత్రుడే...
నికోలస్ మదురో వెనెజువెలా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా దుర్మార్గంగా దాడి చేసి అపహరించుకుపోయింది. అలా చేయడమే పెద్ద టెర్రరిస్ట్ చర్య. 2024 ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న నేత మదురో. అటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయడాన్ని ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఖండించాయి. మదురోపై ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. వాటిని క్యూబా పరిగణలోకి తీసుకోవడం లేదు. మదురోను అమెరికా విడుదల చేయాలి. అందుకు అంతర్జాతీయ వేదికలపై చేయగలిగింది చేస్తాం..
ప్రస్తుతం వెనెజువెలాలో పరిస్థితి ఏమిటీ?
ట్రంప్ ఆదేశాల మేరకు నూతన పాలకవర్గం ఏర్పాటైంది. దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనలేదు. ఈ నూతన అడ్మినిస్ట్రేషన్ ను వెనిజువెలా ప్రజలు అంగీకరిస్తానని మేము భావించడం లేదు. క్యూబా కూడా దాన్ని అనుమతించం. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించాలి. అమెరికా చెప్పిందే సాగాలంటే కుదరదు. వెనెజువెలా ప్రజలు తిరగబడుతున్నారు. వాళ్లకేమి కావాలో వాళ్లు నిర్ణయించుకుంటారు. అమెరికా చెప్పినట్టు కాకుండా వెనెజువెలా ప్రజలు నిర్ణయించుకునే దానికి మా మద్దతు ఉంటుంది.
ప్రతిపక్ష నాయకురాలు మచాడో గురించి..
2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన వ్యక్తి మారియా కొరినా మచాడో. మదురో ప్రభుత్వంపై పోరాడుతోంది. ఆమె తనను అధ్యక్షురాలిని చేయమని అమెరికాను వేడుకుంది. స్వదేశంలో శాంతిని నెలకొల్పలేని వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతికి ఇచ్చారు. ఇప్పుడామె దాన్ని అమెరికాకి తాకట్టు పెట్టినట్టుంది (కాస్తంత చిరాకుగా మొహం పెట్టి..)
క్యూబాకి, వెనెజువెలాకి సంబంధం ఏమిటీ?
మా మైత్రి ఇప్పటిది కాదు. చావేజ్ ఉన్నప్పటి నుంచి కొనసాగుతోంది. రెండు స్వతంత్ర దేశాల మధ్య ఎటువంటి సంబంధాలు ఉంటాయో మా మధ్యా అలాంటివే ఉన్నాయి. వెనెజువెలా నుంచి మేము ఆయిల్ తీసుకుంటాం. అందుకు బదులుగా మేము సాంకేతిక, సెక్యూరిటీ సహకారం అందిస్తున్నాం. మా సంబంధాలలో ఇది కీలకం కూడా. అది అమెరికాకి గిట్టదు. ఈ ప్రాంతంలో అమెరికా ఇన్‌ఫ్లూయెన్స్ కి చెక్ పెట్టేది మేమే. మదురో ని పట్టుకుపోయిన తర్వాత మా మీద ఆంక్షల్ని మరింత రెట్టింపు చేస్తోంది అమెరికా.
మరి ఇప్పుడు క్యూబా ఏంచేస్తుందీ?
క్యూబా ఇవాళ పుట్టలేదు. మాది స్వతంత్ర దేశం. ఎప్పుడేమి చేయాలో మాకూ తెలుసు. వెనెజువెలా నుంచి ఆయిల్ రాకపోతే వేరే దేశాల నుంచి తీసుకుంటాం. మేము నిర్ణయాలు తీసుకుంటాం.
క్యూబా మీద ట్రంప్ ఏవేవో అసత్యాలు చెబుతున్నారు. ఆయిల్ కోసమే వెనెజువెలాను మేము కాపాడుతున్నామనడంలో అర్థమే లేదు. మా రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందంలో భాగంగా మదురోకి అండగా నిలిచాం. అమెరికా చేసిన దాడి నుంచి మదురోను కాపాడేందుకు క్యూబా సైనికులు 32 మంది నెలకొరిగారు. అందువల్ల ఎవ్వరూ మా ఇంటిగ్రిటీని ప్రశ్నించలేరు. మా స్ఫూర్తికి నిదర్శనం అది. క్యూబా పోరాట స్ఫూర్తి ఏమిటో అమెరికాకి తెలియంది కాదు.
ట్రంప్ దాడి చేస్తానంటున్నారు కదా..
ఆయనేమన్నా (ట్రంప్) ప్రపంచానికి రాజా? అసలు నువ్వెవరు మాపైన దాడి చేస్తానని బెదిరించడానికి..? ఏ యుగంలో ఉన్నాం మనం. ఇలాంటి బెదిరింపులు మాకు కొత్తేమీ కాదు.
ఫైడల్ కాస్ట్రో నుంచి నేటి దాకా మాపై అమెరికా ఎన్నిసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేసిందో ఇండియా సహా ప్రపంచానికి తెలుసు. మేమూ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి 80 మైళ్ల దూరంలోనే ఉన్నాం (ధైర్యముంటే అమెరికా ఏమైనా చేయవచ్చుననే ధిక్కార స్వరంలో..) క్యూబా ఎవరిపైనా దురాక్రమణ చేయదు. 66 ఏళ్లుగా అమెరికా- క్యూబాను చెరపడుతూనే ఉంది. మేమంత పిరికివాళ్లం కాదు. మాతృభూమిని కాపాడుకోవడానికి చివరి రక్తపు బొట్టు వరకు సిద్ధంగా ఉంటాం.
క్యూబా మీద ఆంక్షలు ఎక్కువైతే మీకే నష్టం కాదా..
ఇప్పుడు లేకుండా ఉంటే కదా.. ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడే మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఆర్ధికంగా కట్టడి చేశారు. ఆహార పదార్థాలను ఆపించాడు. ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నాడు. మా ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో మా పార్టీకి (క్యూబా కమ్యూనిస్టు పార్టీ), మా ప్రభుత్వానికి తెలుసు. అమెరికా ఓ క్రిమినల్ గా, నియంత్రణ లేని అగ్రరాజ్యంలా ప్రవర్తిస్తోంది. ఇది క్యూబాకే కాకుండా ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పుగా పరిణమించింది.
ఇంటర్వ్యూ చేస్తున్న ది ఫెడరల్ ప్రతినిధి
సోషలిజమంటే స్వతంత్య్రమే (ఇండిపెండెన్స్)..
1961 నుంచి "ఒక దేశం, ఒకే పార్టీ" సూత్రంపై ఆధారపడిన సోషలిస్ట్ రాజకీయ వ్యవస్థ కలిగిన క్యూబాలో పాలన మార్పు (Regime change) రావాలని అమెరికా చాలా కాలంగా కోరుకుంటోంది. దీనిపై కార్లోస్ మార్సన్ మాట్లాడుతూ సోషలిజం అంటే ఇండిపెండెన్స్. అది అర్థం కానివాళ్లు ఏవేవో మాట్లాడుతుంటారు. మా దేశంలో వంద దేశాలకు చెందిన 1500 మంది మెడిసిన్ చదువుతున్నారు. వాళ్లని అడగండి. మేము ప్రజలకు ఏమి చేస్తున్నామో.. మాది సోషలిస్టు దేశం. అందరికీ అన్నీ.. అమెరికాలో మాదిరి కొందరికే అన్నీ కాదు.. చమురు సరఫరా నిలిపివేతకు మేము తాను భయపడటం లేదు. క్యూబా ప్రజలు ఎలాంటి పరిస్థితునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, అమెరికా మాపైన ఆంక్షలు ఎత్తివేయాలి" అని కార్లోస్ మార్సన్ అన్నారు.
Next Story

