
ఇరాన్- అమెరికా యుద్ధం
ఈ యుద్ధం ఆగదు, తాత్కాలిక విరమణ ఉండదు: ఇరాన్
అమెరికాతో యుద్ధం ఆషామాషీగా ముగియదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తేల్చిచెప్పారు
అమెరికాతో యుద్ధం ఆషామాషీగా ముగియదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తేల్చిచెప్పారు. అమెరికా-ఇజ్రాయిల్‌తో జరుగుతున్న యుద్ధానికి 'నిఖరమైన ముగింపు'కు మాత్రమే అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి ఈ విషయాన్ని చెప్పారు. తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, భవిష్యత్ దాడులపై బలమైన హామీలు, యుద్ధ నష్టాలకు పరిహారాలు ఇచ్చినప్పుడే యుద్ధం ముగుస్తుందన్నారు.
"ఈ పరిస్థితి మళ్లీ రాకూడదు. యుద్ధం ముగిసిన తర్వాత పరిహారం చెల్లించాలి" అని అరాఘ్చీ అన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియన్ కూడా ఇదే అభిప్రాయాన్ని Xలో పోస్ట్ చేశారు. యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ, టెహ్రాన్ పొరుగు దేశాల మధ్యస్థానికి ఓకే అంటూనే ఈ కండిషన్లు పెట్టింది.
"అమెరికా అధికారులు యుద్ధం వేగంగా ముగుస్తుందని, చమురు ధరలు పడిపోతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇరాన్ తన రక్షణ కోసం ఎందాకైనా పోరాడుతుంది" అని ఇరాన్ చెప్పింది. ఇరాన్ శాంతికి కట్టుబడి ఉందని అంటూనే తన గౌరవం, సార్వభౌమత్వం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పునరుద్ఘాటించింది.
యుద్ధం ఎలా మొదలైంది?
ఫిబ్రవరి 28, 2026న అమెరికా (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ), ఇజ్రాయిల్ (రోరింగ్ లయన్) కలిసి ఇరాన్‌పై ఆకస్మిక వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమెనీ సహా అనేక మంది చనిపోయారు. ఇది దశాబ్దాల నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల ఫలితం. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ పై యుద్ధానికి- అణు బాంబు తయారీ, ప్రాక్సీల (హమాస్, హెజ్బాల్లా) మద్దతు, ఇటీవలి ఆందోళనల్లో నిరసనకారులపై హత్యలు-వంటి కారణాలను చూపింది.
వీటిని ఇరాన్ ఇవన్నీ తిరస్కరించింది. అణు ఆయుధాల కార్యక్రమం లేదని చెప్పింది. ఇరాన్ ప్రత్యాఘాతంగా మిసైల్-డ్రోన్ దాడులు (ఆపరేషన్ ట్రూ ప్రామిస్ IV), హార్ముజ్ స్ట్రైట్ పాక్షిక మూసివేత (అమెరికా-ఇజ్రాయిల్ ఓడలకు మాత్రమే), గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. మొదటి మూడు వారాల్లో వందలాది సైనికులు, పౌరులు మరణించారు. ఆయిల్ ధరలు బ్యారెల్ $103కి పెరిగాయి.
మధ్యవర్తిత్వం ఓకే, అయితే...
అరాఘ్చీ “యుద్ధం ముగింపుకు ఏ విధమైన ప్రతిపాదనలు లేవు” అని చెప్పారు. కానీ పొరుగు దేశాల (ఖతార్, సౌదీ, ఇతరులు) మధ్యవర్తిత్వానికి స్వాగతం తెలిపారు. హార్ముజ్ జలసంధి తమపై దాడి చేసేవారికి మాత్రమే మూసి ఉందని, ఇతర దేశాల ఓడలు సాఫీగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఇరాన్ “దీర్ఘకాల యుద్ధానికి సిద్ధం” అంటోంది.
కొత్త హైపర్‌సోనిక్ మిసైల్‌లు వాడుతూ రక్షణ కొనసాగిస్తుంది. అమెరికా-ఇజ్రాయిల్ దాడులు ప్రాంతీయ దేశాలపై కూడా జరుగుతున్నాయని ఆరోపించి, జాయింట్ ఇన్వెస్టిగేటివ్ కమిటీకి సిద్ధమని అన్నారు.
అమెరికా అంచనా...
అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్‌లు “యుద్ధం కొన్ని వారాల్లో (4-6 వారాలు) ముగుస్తుంది” అని అంచనా వేశారు. చమురు ధరలు త్వరలో తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ “ఇది అక్రమ యుద్ధం, విజయం అమెరికాను వరించదు” అని పేర్కొంది. యుద్ధం ముగింపు కోసం ప్రాంతీయ దేశాల మధ్యవర్తిత్వం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ స్థిరమైన హామీలు, పరిహారాలు లేకుండా వెనక్కి తగ్గేది లేదు అంటోంది. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంది.
Next Story

