
యుద్ధం 22వ రోజుకు చేరింది. ఇంకా ముదిరే సూచనలే కనిపిస్తున్నాయి
అవి 'నాటో' కాదు.. నాటు దేశాలు, పిరికిపందలు: ట్రంప్
మాపై ఆధారపడి బతుకుతూ మా మాటే కాదంటారా అని నాటో దేశాలపై నోరు పారేసుకున్న ట్రంప్, అమెరికాకు షాక్ ఇచ్చిన స్విట్జర్లాండ్, శ్రీలంక
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం 22వ రోజుకు చేరుకుంది. అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో తనకు వెన్నుదన్నుగా నిలవని మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో నోరుపారేసుకున్నారు. మా ఉప్పు తింటూ మమ్మల్నే కాదంటారా అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నాటో (NATO) కూటమిలోని దేశాలను "పిరికిపందలు" గా అభివర్ణించారు. అమెరికా అండ లేకపోతే నాటో ఒక "కాగితపు పులి" (Paper Tiger) అంటూ ఎద్దేవా చేశారు.
ట్రంప్ ఇంతటి ఆగ్రహానికి కారణమేమీ?
హోర్ముజ్ జలసంధి మార్గాన్ని తెరిపించడానికి నాటో దేశాలు తమ నౌకాదళాలను పంపాలని ట్రంప్ కోరారు. కానీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు దీనికి నిరాకరించాయి.
"చమురు ధరలు పెరుగుతున్నాయని ఏడుస్తారు కానీ, అతి తక్కువ ప్రమాదం ఉన్న ఈ పని చేయడానికి మాత్రం ముందుకు రారు" అని ట్రంప్ విమర్శించారు.
నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోందని ట్రంప్ మొదటి నుంచీ భావిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు సాయం లేదన్నది ట్రంప్ కడుపు మంట. "మేము మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంటాం, కానీ మాకు అవసరమైనప్పుడు (ఇరాన్ యుద్ధం వంటి సమయంలో) మీరు మాత్రం ఏమీ చేయరు" అని ఆయన మండిపడ్డారు. అమెరికా అండ లేకపోతే నాటో కూటమి కేవలం ఒక "కాగితపు పులి" అని ఆయన అభివర్ణించారు.
నాటో దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించే ముందు ట్రంప్ ఏ మిత్రదేశాన్ని సంప్రదించలేదు. తమను సంప్రదించకుండా మొదలుపెట్టిన యుద్ధంలోకి తాము ఎలా వస్తామని అవి ప్రశ్నిస్తున్నాయి. దీనినే ట్రంప్ "పిరికితనం"గా చిత్రీకరిస్తున్నారు.
ట్రంప్ వాదన ప్రకారం, అమెరికా ఇప్పటికే ఇరాన్ వైమానిక, నౌకాదళాలను పూర్తిగా దెబ్బతీసింది. "యుద్ధం దాదాపు గెలిచేశాం, ఇప్పుడు ముప్పు తక్కువగా ఉంది. ఈ సమయంలో కూడా సాయం చేయడానికి ముందుకు రాని వారు పిరికిపందలు కాక మరేమిటి?" అన్నది ట్రంప్ ప్రశ్న.
కాల్పుల విరమణ ప్రసక్తే లేదు!
యుద్ధం ముగించాలని ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. "మనం శత్రువును నామరూపాలు లేకుండా తుడిచిపెడుతున్నప్పుడు కాల్పుల విరమణ అనే మాటే రాదు" అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. ఇరాన్ పై యుద్ధంలో అమెరికా తన లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కోసం కాంగ్రెస్ నుండి అదనంగా $200 బిలియన్ల నిధులను పెంటగాన్ కోరింది. మిత్రదేశాల మొండిచేయి చూపాయి. స్విట్జర్లాండ్, శ్రీలంక కూడా షాక్ ఇచ్చాయి.
ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికాకు ఆయుధాల ఎగుమతులను స్విట్జర్లాండ్ నిలిపివేసింది.
అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు తమ దేశంలో ల్యాండ్ అవ్వడానికి శ్రీలంక అనుమతి నిరాకరించింది.
చమురు సంక్షోభం: ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు, సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై ఏప్రిల్ 19 వరకు ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది.
ఇరాన్ ప్రతిఘటన - ముగియని విధ్వంసం
మరోవైపు ఇరాన్ తన పర్షియన్ నూతన సంవత్సర వేడుకల (నౌరోజ్) సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. శత్రువులకు ఇరాన్ దిమ్మతిరిగే దెబ్బ కొట్టిందని, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి భారీ తప్పు చేస్తోందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.
ఇజ్రాయెల్ చేసిన తాజా దాడుల్లో ఇరాన్ మరో కీలక మంత్రిని కోల్పోయింది. తమ ద్వీపాలపై దాడులు కొనసాగితే యూఏఈలోని రాస్ అల్ ఖైమా పోర్టుపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
యుద్ధ క్షేత్రం: తాజా అప్‌డేట్స్
ప్రధాన నగరాలపై దాడులు: టెహ్రాన్, తబ్రిజ్, ఇస్ఫాహన్ నగరాల్లో బాంబుల మోత మోగుతోంది. జెరూసలేంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడగా, సౌదీ అరేబియా, బహ్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నాయి.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు బహ్రెయిన్, జపాన్, కెనడా వంటి దేశాలు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాయి.
పండుగ వేళ విషాదం: ముస్లింలు ఈద్-అల్-ఫితర్, నౌరోజ్ వేడుకలను జరుపుకుంటున్న వేళ.. దాడుల నీడలో సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.
యుద్ధం 22వ రోజుకు చేరినా, ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
Next Story

