
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
‘‘మా దేశాల సంబంధాలలో చీలిక వచ్చింది’’
ఎట్టకేలకు నిజం అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై సుంకాలు విధించాలనే తన నిర్ణయం న్యూఢిల్లీతో వాషింగ్టన్ సంబంధాలలో చీలికకు కారణమవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అంగీకరించారు.
అయితే ట్రంప్ మాత్రం తన అబద్దాలను ప్రచారం చేయడం మాత్రం మానుకోవడం లేదు. రష్యా నుంచి అత్యధిక స్థాయిలో భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. భారత్ పై సుంకాలు విధించడం అంత తేలికైన విషయం కాదని ట్రంప్ అన్నారు.
‘‘భారత్ ముడిచమురులో రష్యాకు అతిపెద్ద కస్టమర్. భారత్, రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తున్నందున నేను దానిపై 50 శాతం సుంకం విధించాను. అది చేయడం అంత తేలికైనా విషయం కాదు.
అది చాలా పెద్ద విషయం. అది భారత్ తో విభేదాలకు కారణమవుతోంది.’’ అని ట్రంప్ ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కలిగే ఫలితం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
‘‘నేను ఇప్పటికే దాన్ని పూర్తి చేశాను. నేను చాలా చేశాను. ఇది మన సమస్య కంటే, యూరప్ కు ఎక్కువ సమస్య అని గుర్తుంచుకోండి’’ అని ట్రంప్ అన్నారు.
భారత్ ప్రతిస్పందన..
అమెరికాతో వాణిజ్య అసమతుల్యతపై భారత్ పై మొదట 25 శాతం పరస్పర సుంకం విధించాలని, ఆ పై రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ పై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించానని ఆయన ఇన్నాళ్లు చెప్పుకున్నారు.
ఈచర్యతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు వచ్చాయి. ఉక్రెయిన్ లో యుద్దానికి నిధులు సమకూర్చుకోవడానికి మాస్కో చమురు కొనుగోలు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తోందని తన ఆరోపణలు ట్రంప్ ఇంకా కొనసాగిస్తున్నారు.
రష్యా చమురు కొనుగోలును భారత్ సమర్థించుకుంది. మార్కెట్ పరిస్థితులు, దేశ ఇంధన భద్రత అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామంది. అదే సమయంలో చైనా, రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని, తాము రెండో స్థానంలో మాత్రమే ఉన్నామని గణాంకాలు బయటపెట్టింది. అలాగే రష్యా- అమెరికా, రష్యా- యూరప్ మధ్య ఉన్న వ్యాపార సంబంధాలను కూడా ప్రపంచానికి అందించింది.
ప్రధాని మోదీతో మాట్లాడాను..
ఈ వారంలో ఇంతకుముందు కూడా భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వం భారత్ తో వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని, ప్రస్తుతం దెబ్బతిన్న భారత్- అమెరికా సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నాన్ని సూచిస్తూ ప్రధానితో మాట్లాడతానని అన్నారు.
వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ వచ్చేవారం వాషింగ్టన్ సందర్శించినప్పుడూ భారత్ తో వాణిజ్య చర్చలలో గణనీయమైన పురోగతి ఉంటుందని తాను ఆశిస్తున్నానని అమెరికా భారత రాయబారీగా నియమితుడైనా సెర్గియో గోర్ అన్నారు.
ట్రంప్ మోదీపై దాడి చేయలేదు..
అమెరికాతో భారత్ సన్నిహిత సంబంధాలను కొనసాగించడం తన ప్రధాన ప్రాధాన్యత అని గోర్ అన్నారు. ఇతర నాయకులపై తన బాధలను వ్యక్తం చేస్తూ తన మాటలను తగ్గించని ట్రంప్, ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా దాడి చేయలేదని గోర్ చెప్పారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయానికొస్తే, పుతిన్ పట్ల తనకు సహనం నశించిపోతోందని ట్రంప్ అన్నారు. చాలాకాలంగా తాను తన రష్యన్ ప్రత్యర్థితో మంచి సంబంధాన్ని కొనసాగించానని అన్నారు.
Next Story