140 మందిని బలిగొన్న ఆ యుద్ధనౌక మన విశాఖ నుంచి బయల్దేరిందే!
x
విశాఖ నుంచి బయల్దేరిన ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా ప్రయోగించిన క్షీపణి ధాటికి ఇలా..

140 మందిని బలిగొన్న ఆ యుద్ధనౌక మన విశాఖ నుంచి బయల్దేరిందే!

విశాఖలో విన్యాసాలకు వచ్చిన ఇరాన్ నౌక తిరిగి వెళ్తూ శ్రీలంక సమీపంలో అమెరికా దెబ్బకు మునిగిపోయింది

అక్కడెక్కడో ఖండాల ఆవల జరుగుతున్న యుద్ధం వల్ల మనకేమీ కాదులే అన్న ధీమాతో ఉన్నారు చాలామంది భారతీయులు. అయితే ఇప్పుడు మన బంగాళాఖాతంలో అనూహ్యంగా జరిగిన ఓ సంఘటన ఆ ధీమాను సడలించేలా చేస్తోంది. మనకూ యుద్ధ సెగ తగలడంతో ఒకింత కలవరపాటుకు గురి చేస్తోంది.
ఐఎస్ఆర్కు వచ్చి.. తిరిగి వెళ్తూ చిక్కి..
విశాఖపట్నంలో ఫిబ్రవరి 15 నుంచి 25వ తేదీ వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎస్ఆర్), మిలాన్ విన్యాసాల్లో పాల్గొనడానికి వివిధ దేశాలకు చెందిన 70కి పైగా యుద్ధనౌకలు వచ్చాయి. ఇక్కడ విన్యాసాల్లో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ వందనాన్ని సమర్పించాయి. అలా ఈ విన్యాసాల్లో పాల్గొనడానికి వచ్చిన యుద్ధనౌకల్లో ఇరాన్కు చెందిన యుద్ధనౌక ఐఆర్ఎస్ దేనా కూడా ఉంది.

మిలాన్ విన్యాసాలను ముగించుకుని కొద్దిరోజుల క్రితమే దేనా తమ దేశానికి తిరుగు పయనమైంది. ఇలా ఆ యుద్ధనౌక బంగాళాఖాతంలోని శ్రీలంక తీరం వైపు వెళ్తుండగా బుధవారం అకస్మాత్తుగా దాడికి గురైంది. కొద్దిసేపటికే అది మునిగిపోయింది. సమాచారం అందుకున్న శ్రీలంక నావికాదళం అక్కడకు చేరుకునే సరికే నౌక జాడ కనిపించలేదు. కేవలం లైఫ్ జాకెట్లు, చమురు ప్యాచ్లు మాత్రమే ఉన్నాయి. సముద్రంపై తేలియాడుతున్న 32 మందిని రక్షించింది. వీరిని ఆస్పత్రిలో చేర్పించి అత్యవసర చికిత్సను అందిస్తున్నట్టు శ్రీలంక నేవీ తెలిపింది. బుధవారం రాత్రి వరకు 87 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. యుద్ధనౌకలో 180 మంది వరకు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.
దాడి చేసి ముంచేసింది మేమేః అమెరికా..
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక ఐఆర్ఎస్ఐఎస్ దేనాపై దాడి చేసి ముంచేసింది తామేనని అమెరికా ప్రకటించింది. అంతేకాదు.. అందుకు సంబంధించిన వీడియోను కూడా అమెరికా రక్షణశాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం అమెరికాకు చెందిన జలాంతర్గామి ఒకటి ఇరాన్ యుద్ధనౌక పై క్షిపణులతో ఎటాక్ చేసి ముంచేసినట్టు తెలుస్తోంది. దాడి ధాటికి యుద్ధనౌక ఒక్కసారిగా పైకి ఎగిరిపడుతూ మంటల్లో చిక్కుకుని మునిగి పోయినట్టు అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన వీడియోను చూస్తే అర్థమవుతోంది.

తాజా ఘటనపై రేగుతోన్న అలజడి..

తొలిసారిగా భారత సముద్ర జలాల్లో ఇరాన్కు చెందిన యుద్ధనౌకపై అమెరికా దాడి చేసి ముంచేయడం, అందులోని 150 మంది వరకు సిబ్బంది మరణించడం తదితర పరిణామాల నేపథ్యంలో భారత్లో ఒక్కసారిగా అలజడి రేగుతోంది.
ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికాలు యుద్ధానికి దిగడం, అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులకు పాల్పడడం వంటి పరిణామాలనే చూస్తున్న వారికి తాజాగా మన పొరుగునే బంగాళాఖాతంలో ఇరాన్ యుద్ధనౌకను తుత్తునియలు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాడికి గురై మునిగిపోయిన నౌక యుద్ధంలో పాల్గొనడానికి రాలేదు. విశాఖపట్నంలో ఐఎస్ఆర్, మిలాన్ విన్యాసాల్లో పాల్గొన్నామన్న ఆనందంతో తిరిగి వెళ్తూ ఇలా జల సమాధి అయింది. బంగాళాఖాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

అత్యాధునిక యుద్ధనౌక దేనా..

మోవ్డ్ క్లాస్ ఫ్రిగేట్ యుద్ధ నౌక ఈ ఐఆర్ఎస్ఐఎస్ దేనా. ఇరాన్ ఆధునిక సాంకేతిక, స్వదేశీ పరిజ్ఞానంతో, స్టెయిన్లెస్ స్టీల్తో దీనిని తయారు చేసింది. ఈ నౌకను 2021లో ప్రారంభించారు. ఇది 1,500 టన్నుల బరువును తీసుకెళ్లగలుగుతుంది. 95 మీటర్ల పొడవుంటుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ డెక్తో యాంటీ షిప్, యాంటీ ఎయిర్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సహా బహుళ మిషన్ సామర్థ్యాల కోసం అమర్చబడింది. ఇందులో క్షిపణుల ప్రయోగానికి వీలుగా నిలువు లాంచింగ్ సిస్టం ఉంది. నాలుగు దేశీయ బోన్యన్-4 ఇంజన్లతో నడుస్తుంది. మొత్తం 20 వేల హార్స్ పవర్ సామర్థ్యంతో గంటకు 30 నాట్ల వేగంతో పయనిస్తుంది. 300 కి.మీల పరిధితో అధునాతన 3డీ సెర్చ్ రాడార్, 100 లక్ష్యాలను ట్రాక్ చేయడానికి సాల్మన్ ఫైర్ కంట్రోల్ రాడార్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధానికి రెండు సోనార్ వ్యవస్థలున్నాయి. ఇంధనం నింపకుండా ఏకధాటిగా మూడు వేల నాటికల్ మైళ్లకు పైగా ప్రయాణించగలుగుతుంది. 2022-23లో ప్రపంచాన్ని చుట్టి వచ్చే ప్రయాణం చేసి ప్రత్యేకత గుర్తింపు పొందింది. ఈ యుద్ధనౌకలో 140-200 మంది సిబ్బంది ఉంటారు.
Read More
Next Story