భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలు 18 శాతానికి తగ్గనున్నాయి.
ఈ ఒప్పందం కింద, అమెరికా నుంచి వచ్చే అన్ని పారిశ్రామిక ఉత్పత్తులపై, అలాగే అనేక ఆహార , వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను పూర్తిగా తొలగించనుంది . ఇందులో ఎండిన ధాన్యాలు, పశువుల మేతకు ఉపయోగించే జొన్నలు, చెట్టు గింజలు, ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, మద్యపాన పదార్థాలు వంటి ఉత్పత్తులు ఉన్నాయి.
శనివారం భారత్ –అమెరికా కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. “ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే పరస్పర వాణిజ్యంపై తాత్కాలిక ఒప్పందం ఖరారు చేశాం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఒప్పందం, 2025 ఫిబ్రవరి 13న అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలకు కొనసాగింపుగా ఉందని తెలిపింది.
ఒప్పందంలోని ప్రధాన నిబంధనల ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా విధించే దిగుమతి సుంకాలు 18 శాతానికి తగ్గుతాయి. గత ఏడాది ఆగస్టులో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై అమెరికా 25 శాతం పరస్పర సుంకం, అదనంగా మరో 25 శాతం పన్ను విధించింది.
దీంతో మొత్తం 50 శాతం సుంకాలు పడటంతో భారత ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే అమెరికా భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్ కావడమే. సుంకాల తగ్గింపుతో వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, తోలు , పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకార్, హస్తకళా ఉత్పత్తులు, కొన్ని యంత్రాల రంగాల్లో భారత ఎగుమతులు పెరిగే అవకాశముంది.
సున్నా సుంకాలకు వెళ్లే ఉత్పత్తులు ఇవే
తాత్కాలిక ఒప్పందం విజయవంతంగా పూర్తయితే, ఔషధాల జనరిక్ మందులు, వజ్రాలు–రత్నాలు, విమాన భాగాలపై సుంకాలు పూర్తిగా తొలగిస్తారు. దీని వల్ల ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరింత బలం చేకూరుతుంది. అలాగే, భారత్‌లో తయారయ్యే కొన్ని విమానాలు, విమాన భాగాలపై కూడా అమెరికా సుంకాలను తొలగించనుంది.
జాతీయ భద్రత నిబంధనలకు అనుగుణంగా, ఆటోమొబైల్ భాగాలపై భారత్‌కు ప్రత్యేక సుంక రాయితీ కోటాను అమెరికా ఇవ్వనుంది.
ఇరు దేశాలు పరస్పరం ఆసక్తి ఉన్న రంగాల్లో దీర్ఘకాలికంగా మార్కెట్ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపాయి. అలాగే, ఒప్పంద ప్రయోజనాలు ప్రధానంగా భారత్ , అమెరికా దేశాలకే అందేలా ‘రూల్స్ ఆఫ్ ఒరిజిన్’ను అమలు చేయనున్నారు. వాణిజ్యాన్ని అడ్డుకుంటున్న సుంకేతర అడ్డంకులను కూడా తొలగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్ డాలర్లకు మించి ఉంది. అమెరికా వైద్య పరికరాల వాణిజ్యంలో ఉన్న పాత అడ్డంకులను తొలగించేందుకు భారత్ అంగీకరించింది. అలాగే, అమెరికా ఐటీ, కమ్యూనికేషన్ ఉత్పత్తుల దిగుమతులను ఆలస్యం చేసే కఠినమైన లైసెన్సింగ్ విధానాలను సడలించనుంది.
ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై ఉన్న సుంకేతర అడ్డంకులను కూడా తొలగించేందుకు భారత్ ఒప్పుకుంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో, అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమాన భాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ బొగ్గును భారత్ కొనుగోలు చేయనుందని ప్రకటనలో పేర్కొన్నారు.
సాంకేతిక, డేటా రంగాల్లో వాణిజ్యం పెంపు
డేటా సెంటర్లకు ఉపయోగించే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPU) సహా సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని ఇరు దేశాలు పెంచనున్నాయి. అలాగే సంయుక్త సాంకేతిక సహకారాన్ని విస్తరించనున్నాయి.
వాణిజ్య నిబంధనలను సులభతరం చేయడానికి, ఇరు దేశాల ప్రమాణాలు ,సర్టిఫికేషన్ విధానాలపై చర్చలు జరపాలని నిర్ణయించారు.
భవిష్యత్తులో సుంకాల్లో మార్పులు జరిగితే, ఇరు దేశాలు తమ వాణిజ్య కట్టుబాట్లను సవరించుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) కింద మరిన్ని చర్చలు జరిపి మార్కెట్ అవకాశాలను విస్తరించనున్నారు.
అమెరికా, భారత ఉత్పత్తులపై సుంకాలను మరింత తగ్గించాలన్న భారత్ అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
ఇరు దేశాలు ఆర్థిక భద్రత , డిజిటల్ వాణిజ్యంపై ఉన్న వివక్ష, అడ్డంకులను తొలగించేందుకు కలిసి పనిచేయనున్నాయి.
ఈ తాత్కాలిక ఒప్పందాన్ని త్వరగా అమలు చేసి, పరస్పర లాభదాయకమైన పూర్తి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని సంయుక్త ప్రకటనలో ఇరు దేశాలు ప్రకటించాయి.