శ్రీలంకలో ఎల్‌టీటీఈ ప్రభాకరన్ పేరిట లైబ్రరీ?
x

శ్రీలంకలో ఎల్‌టీటీఈ ప్రభాకరన్ పేరిట లైబ్రరీ?

ప్రభాకరన్ కుటుంబానికి చెందిన ఖాళీ స్థలంలో లైబ్రరీ నిర్మించాలని ఆయన సోదరి భావిస్తున్నారు. స్మారక చిహ్నం కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చర్చకు దారి తీసింది.


Click the Play button to hear this message in audio format

శ్రీలంక(Sri Lanka) ఉత్తర ప్రాంతం జాఫ్నా(Jaffna) జిల్లాలోని వెల్వెట్టితురై (VVT)లో ఎల్‌టీటీఈ మాజీ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్(Prabhakaran) కుటుంబానికి చెందిన భూమిలో ఓ పబ్లిక్ లైబ్రరీ(Library) నిర్మించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్థలానికి యజమానిగా ఉన్న ప్రభాకరన్ పెద్ద సోదరి జెగదీశ్వరి మథియపరన్ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించిన భవనం ప్లాన్‌ను వెల్వెట్టితురై అర్బన్ కౌన్సిల్‌కు సమర్పించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.




ప్రభాకరన్ బాల్యంలో నివసించిన రెండు పడకగదుల సాధారణ ఇంటిని 2010లో శ్రీలంక సైన్యం కూల్చివేసింది. 2009లో ఎల్‌టీటీఈ పరాజయం అనంతరం, తిరుగుబాటు నాయకుడి జ్ఞాపకాలను పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో ఆ ఇంటిని నేలమట్టం చేసినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఇల్లు కూల్చిన తర్వాత ఆ స్థలం దాదాపు 15 సంవత్సరాలుగా ఖాళీగానే ఉండిపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఇప్పుడు అదే స్థలంలో సుమారు 1184.66 చదరపు అడుగుల విస్తీర్ణంలో పబ్లిక్ లైబ్రరీ నిర్మించాలనుకుంటున్నారు.

వెల్వెట్టితురై అర్బన్ కౌన్సిల్ చైర్మన్ ఎం.కే. శివాజీలింగం టెలిఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..లైబ్రరీ నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి కాబట్టి ప్లాన్ తమకు అందజేశారని తెలిపారు. శివాజీలింగం ఒకప్పుడు తమిళ మిలిటెంట్ వర్గాలకు చెందినవాడిగా, తరువాత రాజకీయ నాయకుడిగా మారిన వ్యక్తి. ఆయన వెల్వెట్టితురైలోనే జన్మించి ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారు. ఒక దశలో ప్రభాకరన్‌ను వ్యతిరేకించినప్పటికీ, తరువాత ఆయనకు మద్దతుదారుడిగా మారినట్లు రాజకీయ వర్గాలు చెబుతుంటాయి.

లైబ్రరీ నిర్మాణంతో పాటు, ప్రభాకరన్ తల్లిదండ్రుల విగ్రహాలు లేదా ప్రభాకరన్ బాల్యమంతా ఇక్కడే గడిచిందన్న చెప్పడానికి గుర్తుగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా పట్టణ మండలి పరిశీలిస్తున్నట్లు శివాజీలింగం తెలిపారు. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం ప్రభాకరన్ సోదరిపైనే ఆధారపడుతుందని స్పష్టం చేశారు. “ఆమె అంగీకరిస్తే విగ్రహాలు లేదా బోర్డులు ఏర్పాటు చేస్తాం, లేకపోతే లైబ్రరీ మాత్రమే నిర్మిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

లైబ్రరీ నిర్మాణ వ్యయం ఎంత అవుతుందో, పనులు ప్రారంభమైతే పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో ఇంకా స్పష్టత లేదు. అయితే విదేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో స్థిరపడిన శ్రీలంక తమిళ ప్రవాసుల కొంత వర్గం ఈ ప్రాజెక్టుకు ఆర్థికంగా మద్దతు ఇవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ప్రభాకరన్ కుటుంబ నేపథ్యం..

ప్రభాకరన్ కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 1954 నవంబరులో జన్మించి నలుగురు సోదరుల్లో ప్రభాకరన్ చివరివాడు. ఆయన అన్నయ్య ప్రస్తుతం డెన్మార్క్‌లో నివసిస్తున్నట్లు, మరో సోదరి కెనడియన్ పౌరసత్వం పొందినట్లు సమాచారం. 2009లో యుద్ధం ముగిసే సమయంలో ప్రభాకరన్ తల్లిదండ్రులు ఎల్‌టీటీఈ ఆధీన ప్రాంతంలో ఉండగా, తరువాత వారిని శరణార్థి శిబిరానికి తరలించారు. అనంతరం వారికి సైనిక కస్టడీలోకి తీసుకున్నారు. తండ్రి వేలుపిళ్లై 2010 జనవరిలో మరణించగా, తల్లి పార్వతి పిళ్లై 2011లో కన్నుమూశారు.

ప్రభాకరన్ జ్ఞాపకాలను నిక్షిప్తం చేయాలన్న భావనతో విదేశాల్లోని తమిళ వర్గాలు ఆసక్తిగా ఉన్నా.. శ్రీలంక యువతలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధతరం ప్రభాకరన్‌ను గుర్తుచేసుకుంటే, యువతలో కొందరు ఆ చరిత్రకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఈ లైబ్రరీ ప్రతిపాదనపై శ్రీలంక రాజకీయ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. కొంతమంది ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపిస్తుండగా, అధికార వర్గాలు మాత్రం ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్ష సంబంధం లేదని చెబుతున్నాయి. అయినప్పటికీ, నిర్మాణానికి పెద్ద అడ్డంకులు ఉండకపోవచ్చని తమిళ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదే సమయంలో, శ్రీలంక అధికార పార్టీ జనతా విముక్తి పెరమున (JVP) వైఖరి కూడా చర్చనీయాంశమైంది. యుద్ధకాలంలో ఎల్‌టీటీఈను తీవ్రంగా వ్యతిరేకించిన JVP, ప్రస్తుతం ఉత్తర ప్రాంతంలో రాజకీయంగా స్థిరపడేందుకు మాజీ ఎల్‌టీటీఈ కార్యకర్తల సహకారాన్ని మౌనంగా స్వీకరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బహిరంగంగా టైగర్లకు మద్దతు ఇవ్వకపోయినా, కొన్ని కార్యకలాపాలను నిరోధించకుండా చూడటం ద్వారా సున్నితమైన సమతౌల్యాన్ని పాటిస్తోందనే అభిప్రాయం ఉంది.

అధికారులు ఎల్‌టీటీఈ జెండాలు, ఫోటోలు వంటి చిహ్నాలకు అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ, లైబ్రరీ వంటి సామాజిక ప్రాజెక్టులకు పూర్తి వ్యతిరేకత చూపడం లేదు. స్థానిక వర్గాల అంచనా ప్రకారం, వెల్వెట్టితురైలో లైబ్రరీ నిర్మాణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, స్మారక చిహ్నాల విషయంలో మాత్రం తుది నిర్ణయం ప్రభాకరన్ కుటుంబం వైఖరిపైనే ఆధారపడనుంది.

Read More
Next Story