
ఫ్యూయల్ ఎమర్జెన్సీని ప్రకటించిన ఫిలిప్పీన్స్..
ఇంధనం, పెట్రోలియం ఉత్పత్తులను సేకరణకు ప్రత్యేక అధికారాలిచ్చిన దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తమ దేశంలో ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతోన్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోన్న విషయం తెలిసిందే. ఇంధన సరఫరాకు అత్యంత కీలక నౌకా మార్గం హోర్ముజ్ జలసంధిలో పరిమిత రాకపోకల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి, ధరలు పెరుగుతున్నాయి.
ఫిలిప్పీన్స్ తన చమురు అవసరాలలో 98 శాతం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుం టోంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. ఫిలిప్పీన్స్‌లో ప్రస్తుతం సుమారు 45 రోజులకు సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయని ఫిలిప్పీన్స్ ఇంధన కార్యదర్శి షారన్ గరిన్ తెలిపారు. అదనంగా 10 లక్షల బ్యారెళ్ల చమురును సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇంధనం, పెట్రోలియం ఉత్పత్తులను సేకరించడానికి ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. అవసరమైతే ముందస్తు చెల్లింపులు చేయడానికి కూడా అనుమతి ఇచ్చారు. తాను ఇచ్చిన ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లో ఉంటుందని మార్కోస్ తెలిపారు. ఇంధనం, ఆహారం, మందులు వంటి నిత్యావసర వస్తువుల సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

