భారత్‌తో చర్చలకు సిద్ధమయిన పాక్?
x

భారత్‌తో చర్చలకు సిద్ధమయిన పాక్?

ఇండస్ వాటర్స్ ఒప్పందంపై భారత్‌కు ఉన్న అభ్యంతరాలపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం..


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండస్ వాటర్స్(Indus Waters Treaty) ఒప్పందాన్ని భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చింది. నీటి విడుదలలో భారత్‌కు ఉన్న అభ్యంతరాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ మేరకు పాక్ నీటివనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా భారత్ జల్ శక్తి కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీకి లేఖ పంపినట్లు తెలిసింది. అదే లేఖలో ఆయన భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షం, చట్టవిరుద్ధంగా పేర్కొంటూ.. భారత్ నిర్ణయం పాక్ ప్రజలు, ఆర్థికవ్యవస్థపై దాడిగా ముర్తజా అభివర్ణించినట్లు తెలుస్తోంది.

యూటర్న్ తీసుకున్న పాక్..

జనవరి 2023, సెప్టెంబరు 2024లో పాకిస్తాన్‌(Pakistan)కు భారత్(India) రెండు సార్లు నోటీసులు పంపింది. ఇండస్ ఒప్పందాన్ని సమీక్షించి మార్పులు చేయాల్సి ఉందని చెప్పినా..పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మొత్తం మీద పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ వైఖరిలో మార్పు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

జమ్మూ కశ్మీర్‌లోని చెనాబ్ నదిపై ఉన్న రెండు హైడ్రో ప్రాజెక్టులకు ఇటీవల ఫ్లషింగ్, డీసిల్టింగ్ పనులు చేపట్టారు. దీంతో పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పాకిస్తాన్ రైతులు విత్తనాల సీజన్‌కు ముందు నీటి కొరతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉన్నా.. భారత్ ఒత్తిడి చర్యలు, మౌలిక ఒప్పందాల సస్పెన్షన్ కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే..

భవిష్యత్తులో భారత్ చర్చలు జరిపితే మాత్రం అవి ద్వైపాక్షికంగా మాత్రమే ఉంటాయని, మూడో వ్యక్తి లేదా మరోదేశం జోక్యం ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఒప్పందంలో వివాద పరిష్కార విధానం (డిస్ప్యూట్ రెసల్యూషన్ మెకానిజం) విషయంలో భారత్, పాకిస్తాన్, వరల్డ్ బ్యాంక్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ఆ విషయంలో వెనక్కు తగ్గేది లేదు..

పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ మెరుపుదాడుల చేసిన అనంతరం భారత్ స్పష్టంగా పేర్కొంది. భారత్-పాక్ మధ్య చర్చలంటూ జరిగితే క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని తుదముట్టించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పొందడమే లక్ష్యంగా జరుగుతాయని స్పష్టం చేసింది.

ఇండస్ వాటర్స్ ఒప్పందం గురించి మాట్లాడేందుకు ఈ వారంలో హోం మంత్రి అమిత్ షా, నీటివనరుల మంత్రి పాటిల్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కీలక భేటీ జరగనుంది.

Read More
Next Story