
సింధూ జలాల కోసం భారత్‌ను బెదిరిస్తున్న పాక్
పాక్‌కు చెందిన ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు భారత్‌ను బెదిరిస్తున్నారు. సింధూ జలాలను వదలకపోతే పర్యావసానాలు వేరుగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఆ ముగ్గురెవరు?
గడిచిన మూడు రోజులుగా పాక్ ఆర్మీ జనరల్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఒకే రకమైన వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాలను భారత్ విడుదలచేయాలన్నదే (Indus waters Teraty) వారి ప్రధాన డిమాండ్.
పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్‌కు వెళ్లే సింధూ జలాలను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశానికి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే భారత్‌ను నాశనం చేస్తామని పాకిస్తాన్(Pakistan) ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదివారం (ఆగస్టు 10న) హెచ్చరించారు. ఫ్లోరిడాలోని టంపాలో ప్రవాస పాకిస్థానీయులనుద్దేశించి ప్రసంగింస్తూ.. "మనది అణ్వస్త్ర దేశం. మనం పతనమవుతున్నామని అనుకుంటే, మనతో పాటు సగం ప్రపంచాన్ని కూడా పతనం చేస్తాం" అని వ్యాఖ్యానించారు.
కాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా సోమవారం (ఆగస్టు 11న) భారత్‌ను హెచ్చరించారు. పాకిస్తాన్ జీవనాధారాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి న్యూఢిల్లీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సింధూ జలాలను వదలకపోతే సంఘర్షణ తప్పదన్నారు. సింధ్‌లో జరిగిన ఒక సభలో ఆయన ఈ మాటలన్నారు. సింధు జలాల నిలిపివేత వల్ల 250 మిలియన్ల పాక్ ప్రజానీకం ఆకలితో అలమటించే ప్రమాదం ఉందన్నారు. పాకిస్థాన్‌కు తీవ్రనష్టం కలిగిస్తోన్న భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పాకిస్తానీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సింధు జలాలను వదలకపోతే పాక్‌కు యుద్ధం తప్ప "మరో మార్గం" లేదని భుట్టో హెచ్చరించారు.
తాజాగా పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం (ఆగస్టు 12న) భారత్‌ను బెదిరించారు. "మా నీళ్లను వదలకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆ తర్వాత పశ్చాత్తాపపడినా ఫలితం ఉండదు’’ అని వ్యాఖ్యానించారు. అయితే షహబాజ్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు.
భారత్ కౌంటర్..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బెదిరింపులకు భారత్ స్పందిస్తూ..అణుబాంబుల బెదిరింపులకు బెదిరేది లేదని, దేశ భద్రతను అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కౌంటర్ ఇచ్చింది.