
‘శాంతియుతంగా పరిష్కరించుకుందాం.. ’
చర్చల ద్వారా సమస్యల పరిష్కరించుకుందామంటూ.. ఉద్రిక్తత వేళ ఐక్యతను ప్రదర్శించిన పాలక, ప్రతిపక్ష నాయకులకు కృతజ్ఞతలు చెప్పిన పాక్ ప్రధాని షరీఫ్..
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PM Sharif) ఎట్టకేలకు దిగివచ్చారు. భారత్ వీరోచిత దాడి, కాల్పుల విరమణ తర్వాత ఆయన పాక్ జాతీయులనుద్దేశించి ప్రసంగించారు. శాంతియుత చర్చల ద్వారా భారత్‌తో చాలా ఏళ్లుగా ఉన్న నీటి వనరుల పంపకం, కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోగలమన్న అభిప్రాయానికి వచ్చారు. అదే సమయంలో భారత్‌తో సైనిక ఉద్రిక్తత వేళ.. ఐక్యతను ప్రదర్శించిన పాలక, ప్రతిపక్ష నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు.
చైనాకు ప్రత్యేక ధన్యవాదాలు..
భూభాగం, వాయుమార్గం, సముద్ర మార్గం పై అన్ని రకాల సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని భారత్-పాక్ (India-Pakistan) అంగీకరించాయి. అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) జోక్యంతో ఇరు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ మిత్రదేశాల పాత్రను షరీఫ్ ప్రశంసించారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, తుర్కియే, సౌదీ అరేబియా, ఖతర్, యుఎఈ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ వంటి నేతలకూ కృతజ్ఞతలు తెలిపారు. చైనాను నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణిస్తూ..‘‘సంక్షోభ సమయంలో తమకు పూర్తి అండగా నిలిచిన చైనాకు ప్రత్యేక అభినందనలు’’ అంటూ కొనియాడారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. ఘటనపై పారదర్శక విచారణకు సహకరిస్తామన్నా కూడా భారత్ నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు.
భారత్ చర్యలకు "తగిన జవాబు ఇచ్చినందుకు" మే 11 (ఆదివారం)ను యౌం-ఏ-తషక్కూర్ (ధన్యవాద దినం)గా పాటించనున్నట్లు షరీఫ్ ప్రకటించారు. "ఈ విజయానికి కారణమైన అల్లాహ్‌కు మేము కృతజ్ఞులం. ఇది పాకిస్తాన్ ఆర్మీ ధైర్యానికి నివాళుల అర్పించాల్సిన దినం. ఆపరేషన్ బన్యాన్ మర్సూస్ కింద భారత చర్యలకు తగిన స్థాయిలో ప్రత్యుత్తరం ఇచ్చాం," అని షరీష్ పేర్కొన్నారు.