
అప్పు కోసం వెళ్లినపుడు స్వాభిమానం దెబ్బతింది’
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
రుణాల కోసం స్నేహపూర్వక దేశాలను ఆశ్రయించాల్సిన సందర్భాల్లో తన స్వాభిమానం దెబ్బతిన్నదని, తలదించుకోవాల్సి వచ్చిందని పాకిస్తాన్(Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, ఎగుమతిదారుల గౌరవార్థం శుక్రవారం ఇస్లామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటి విషయాలను ఆయన పంచుకున్నారు. దేశం దివాళా తీసే పరిస్థితి ఉండేదన్నారు.
IMF ఆర్థిక సాయంతో..
“మేము అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు” అని షరీఫ్ అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్‌ను 2023లో పారిస్‌లో కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమావేశం తర్వాత IMF ఆర్థిక సాయం ప్యాకేజీని ఆమోదించిందని, దాని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం వచ్చిందన్నారు. సంక్షోభ సమయంలో చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ వంటి స్నేహపూర్వక దేశాలు పాకిస్తాన్‌కు పూర్తి మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌తో కలిసి తాను పలు దేశాల నేతలను కలసి బిలియన్ల డాలర్ల రుణాలు అడగాల్సి వచ్చిందని చెప్పారు.
రుణం కోసం వెళ్తే..
రుణాలు తీసుకోవడం అంటే బాధ్యతలు, నిబంధనలు కూడా ఉంటాయి” అని ప్రధాని గుర్తు చేశారు. “రుణాల కోసం వెళ్తే, స్వాభిమానాన్ని కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైన డిమాండ్లు కూడా ఎదురవుతాయి. అవసరం లేకపోయినా వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది” అని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు.
పరిశ్రమలకు ఊరట ..
పరిశ్రమలకు ఊరట కలిగించే చర్యలను కూడా ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు. విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ. 4.04 తగ్గిస్తున్నట్లు, సీలింగ్ ఛార్జీలను రూ. 9కు తగ్గిస్తామని చెప్పారు. దీని వల్ల ఎగుమతులు పెరిగి, వ్యాపార రంగానికి మద్దతు లభిస్తుందని అన్నారు. అలాగే ఎగుమతి రీఫైనాన్స్ స్కీమ్ వడ్డీ రేటును 7.5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా వ్యాపారాలకు తక్షణ ఉపశమనం లభిస్తుందన్నారు. ఎగుమతుల ఆధారిత వృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

