
బ్రూస్
రెండు దేశాలతో మా సంబంధం అదే: అమెరికా
భారత్, పాక్ లతో సంబంధాలు కొనసాగిస్తామన్నా వైట్ హౌజ్
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా గడ్డ మీద నుంచి భారత్ కు అణు బెదిరింపులు చేసిన రెండు రోజుల తరువాత అమెరికా స్పందించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రెండు దేశాలతో సంబంధాలు కొనసాగిస్తోందని, వాటి విధానంలో ఎలాంటి మార్పు లేదని వైట్ హౌజ్ పేర్కొంది.
మరోసారి అదే మాట..
భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ తరువాత జరిగిన సైనిక ఘర్షణలో అమెరికానే మధ్యవర్తిత్వం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ కూడా మరోసారి విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఆ రోజు వైట్ హౌజ్ లో జరిగిన సమావేశంలో ఆయన ఆ అంశంపై మాట్లాడారు. అయితే అమెరికా వాదనలను భారత్ ఖండిస్తూ వస్తోంది. భారత్ - పాక్ మధ్య మూడో పక్షం మధ్యవర్తిత్వం వహించలేదని న్యూఢిల్లీ ప్రకటించింది.
‘‘పాకిస్తాన్- భారత్ మధ్య వివాదం జరిగినప్పుడూ మాకు సమాచారం అందింది. అది చాలా భయంకరమైన రూపుదాల్చే అవకాశంగా కనిపించింది. ఆ సమయంలో నేను ఇక్కడ విదేశాంగ శాఖలో ఉన్నాను.
జరుగుతున్న దాని స్వభావాన్ని పరిష్కరించడంలో ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు విదేశాంగ కార్యదర్శితో మాట్లాడారు. వారు తమ ఆందోళన వ్యక్తం చేసి తక్షణ పరిష్కారానికి నడుంబిగించారు’’ అని బ్రూస్ అన్నారు.
‘‘రోజుల తరువాత ఫోన్ కాల్ లో దాడులు ఆపడానికి, పార్టీలను ఒకచోట చేర్చడానికి మేము చేసిన పనిని వివరించాము. దేశంలో అగ్ర నాయకులు విపత్తును ఆపడంలో పాలు పంచుకున్నారు.’’ అని ఆమె చెప్పారు.
భారత్, పాక్ తో సంబంధాలు మారవు..
మునీర్ ఇటీవల ట్రంప్ తో జరిగిన సమావేశం వల్ల అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీతో ఉన్న సంబంధం దెబ్బతిని పాకిస్తాన్ కు ఆయుధ అమ్మకాలు పెరుగుతాయా అని అడిగిన ప్రశ్నకు, బ్రూస్ సమాధానమిస్తూ.. భారత్, పాకిస్తాన్ లతో అమెరికా సంబంధం మారలేదని వివరణ ఇచ్చారు.
‘‘రెండు దేశాలతో మా సంబంధం ఇంతకుముందులాగే ఉంది. అది మంచిదే అని నేను చెబుతాను. అందరికి తెలిసిన, అందరితో మాట్లాడే అధ్యక్షుడు ఉండటం వల్ల కలిగే ప్రయోజనం అదే, ఈ సందర్భంలో మనం విభేదాలను ఎలా కలిసి పరిష్కరించవచ్చో తెలిసింది. ఇక్కడి దౌత్యవేత్తలు రెండు దేశాలకు కట్టుబడి ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది’’ అని ఆమె అన్నారు.
అమెరికా- పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చర్చలు..
మంగళవారం ఇస్లామాబాద్ లో జరిగిన అమెరికా- పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక సంభాషణ గురించి కూడా బ్రూస్ వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటడానికి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయని బ్రూస్ అన్నారు.
‘‘అమెరికా- పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక సంభాషణ జరిగింది. ఇస్లామాబాద్ లో జరిగిన ఈ సంభాషణలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా, పాకిస్తాన్ తమ భాగస్వామ్య నిబద్దతను పునరుద్ఘాటించాయి’’ అని బ్రూస్ జోడించారు.
Next Story