ట్రంప్ కు చుక్కలు చూపిస్తున్న చమురు!
x

ట్రంప్ కు చుక్కలు చూపిస్తున్న చమురు!

ట్రంప్ లెక్క తప్పింది, అమెరికా షిప్ పేలిపోయింది.. హర్మోజ్ జలసంధిలో భగ్గుమన్న మంటలు, భారతీయుని మృతి


పశ్చిమాసియా యుద్ధం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి చుక్కలు చూపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ధీటుగా స్పందిస్తోంది. కీలెరిగి వాత పెట్టిన చందంగా చమురును కేంద్రంగా చేసుకుని ఇరాన్ తీవ్ర దాడులకు దిగింది. ఇది నిజంగా ట్రంప్ ఊహించని దెబ్బ అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇరాన్ ప్రతిస్పందన ట్రంప్ లెక్కలను పూర్తిగా తలకిందులు చేసేసింది.

“చమురు సంక్షోభం రాదు” అని ధీమాగా చెప్పిన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆ దేశ ఇంధనశాఖ మంత్రి క్రిస్ వైట్ చెప్పిన నిజాలు విని నిశ్చేష్టుడైనట్టు తెలుస్తోంది. హర్మోజ్ జలసంధిని పూర్తిగా మూసేసి, అమెరికా నౌకలపై ఇరాన్ భారీ దాడులకు దిగడంతో ప్రపంచ చమురు మార్కెట్ ఉలిక్కిపడింది. హర్మోజ్ జలసంధిని స్వాధీనం చేసుకున్నామని, మరి కొద్ది రోజుల్లో అన్ని దేశాలకు ఆయిల్ పంపిస్తామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే అమెరికా ఆయిల్ షిప్ ను ఇరాన్ ఆత్మాహుతి నౌక భస్మీపటలం చేసింది.
ఇరాక్ ప్రాదేశిక జలాల్లో (పర్షియన్ గల్ఫ్‌లో) అమెరికాకు చెందిన సేఫ్‌సీ విష్ణు (SafeSea Vishnu), గ్రీస్‌కు చెందిన జెఫిరోస్ (Zefyros) ట్యాంకర్లపై ఇరాన్ ‘సూసైడ్ బోటు’ దాడి చేసి పేల్చేసింది. పేలుడు పదార్థాలతో నిండిన బోటు ఢీకొనగానే నౌకల్లో భారీ పేలుడు సంభవించింది. మంటలు భగ్గుమన్నాయి. నౌకలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు ప్రపంచ మీడియాను కలకలం చేశాయి.

38 మంది సిబ్బందిని కాపాడారు గాని ఓ భారతీయుడు మృతి చెందాడు. ఇరాన్ ఈ దాడి తమ పనేనని అధికారికంగా ప్రకటించింది. ఇది హర్మోజ్ జలసంధిలో ఇరాన్ వ్యూహం ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోంది.
ఇరాన్ సీమైన్లు, డ్రోన్ బోట్లు, మైన్లు అమర్చి నౌకా రవాణాను పూర్తిగా అడ్డుకుంటోంది. గత వారం మూడు కమర్షియల్ నౌకలపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. ఒక నౌక థాయ్ జెండాతో భారత్‌కు వస్తుండగా యూఏఈ తీరంలో దాడికి గురైంది.
ట్రంప్ ప్రభుత్వం తర్జనభర్జన!
గత ఏడాది ఇరాన్‌పై దాడుల సమయంలో “సంక్షోభం రాదు” అని చెప్పిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లెక్కలు పూర్తిగా తప్పయ్యాయి. ఇప్పుడు చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్‌లను బయటకు తీస్తోంది. కనెక్టికట్ సెనేటర్ క్రిస్టోఫర్ ఎస్. మర్ఫీ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెడుతూ “హర్మోజ్‌ను తెరిపించడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఏ ప్రణాళికా లేదు!” అని ఎద్దేవా చేశారు.
హర్మోజ్‌ను “మందుపాతరలతో నింపుతున్నాం” అని ఇరాన్ హెచ్చరికలు చేస్తోంది. అమెరికా నౌకలను ఎస్కార్ట్ చేయాలని ఆలోచిస్తున్నా... ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ట్రంప్ “షిప్పులు గట్టిగా ఉండాలి, హర్మోజ్ సేఫ్” అని చెప్పినా... వాస్తవం భిన్నంగా ఉంది.
ప్రపంచం చమురు సంక్షోభంలో!
హర్మోజ్ ద్వారా ప్రపంచ దేశాలకు 20%కి పైగా రవాణా జరుగుతుంది. ఇప్పుడు రవాణా స్తంభించడంతో ధరలు పెరిగి అమెరికా సహా అన్ని దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చమురు సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది.
యుద్ధం త్వరగా ముగియకపోతే... ట్రంప్ కు చమురు మరింత చుక్కలు చూపిస్తుంది! హర్మోజ్ జలసంధిలో మంటలు ఆరకపోతే ఇంధనం కోసం ప్రపంచం కటకటలాడాల్సిందే.
Read More
Next Story