ఉత్తర కొరియా కిమ్ ను వ్యతిరేకించిన ఆ .07% ఓట్లర్లు ఎవరు?
x
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

ఉత్తర కొరియా కిమ్ ను వ్యతిరేకించిన ఆ .07% ఓట్లర్లు ఎవరు?

ప్రభుత్వమే ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటీ? సోషల్ మీడియాలో సెటైర్లు ఏమిటీ?


మార్చి 15, 2026. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ అసాధారణ "ఎన్నికలు" జరిగాయి. కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని మిత్రపక్షాలు 99.93 శాతం ఓట్లు సాధించాయి. మొత్తం 687 సీట్లు గెలిచాయి. 99.99 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ ఈసారి ఒక చిన్న సంఖ్య ప్రపంచాన్ని ఆకర్షించింది. అదే 0.07 శాతం మంది వ్యతిరేకత. అంటే, బ్యాలెట్‌పై అభ్యర్థి పేరును క్రాస్ చేశారు.

1957 తర్వాత మొదటిసారి ఉత్తర కొరియా అధికార మీడియా KCNA ఈ వ్యతిరేక ఓట్లను బయటపెట్టింది. ఇది సాధారణ ఎన్నిక కాదు... ఇది విధేయత పరీక్ష. ఇది ఒక రహస్యం. ఇది ఒక భయం. ఇది ఉత్తర కొరియా "ప్రజాస్వామ్యం" అసలు స్వరూపం.
ఉత్తర కొరియాలో మనకు తెలిసిన ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. ప్రతి నియోజకవర్గంలో ఒకే ఒక అభ్యర్థి. అతడు లేదా ఆమె కూడా వర్కర్స్ పార్టీ ఆమోదించినవాడే. ఓటరు చేయాల్సింది ఏమీ లేదు... కేవలం "ఆమోదం" అని ఓటు వేయడం. గెలుపు-ఓటమి ఉండదు. కేవలం "ఎంత మంది ఆమోదించారు" అనేది మాత్రమే లెక్క.
ఇది జనాభా గణన లాంటిది కూడా. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం తప్పనిసరి. ఎవరైనా ఓటు వేయకపోతే -వాళ్లు దేశం వదిలి పారిపోయాడని లేదా ప్రభుత్వానికి వ్యతిరేకుడని భావిస్తారు. దీని ద్వారా కిమ్ ప్రభుత్వం దేశంలో ఎంత మంది ఉన్నారో, ఎవరెక్కడ ఉన్నారో సులభంగా ట్రాక్ చేస్తుంది.
"నో" ఓటు వేయడం ఎలా?
బ్యాలెట్‌పై "ఆమోదం" లేదా క్రాస్ చేయాలి. కానీ "నో" వేయాలంటే ప్రత్యేక బూత్‌కు వెళ్లాలి. ఆ బూత్ బయటి నుంచి కనిపిస్తుంది. పోలింగ్ అధికారులు, పొరుగువారు, భద్రతా సిబ్బంది కన్నెత్తి చూస్తారు. ఇది గోప్యం కాదు. రాష్ట్రం ఎవరు వ్యతిరేకించారో తెలుసుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థలో 0.07% మంది (లక్షలాది ఓటర్లలో వేలాది మంది) ధైర్యం చేశారంటే... అది అద్భుతం. లేదా రాష్ట్రం కల్పించిన సింబాలిక్ సంఖ్య కావచ్చు.
0.07% వెనుక రాజకీయం...
గతంలో ఎప్పుడూ 100% ఓట్లు వచ్చాయని చెప్పేవారు. ఈసారి 0.07% వ్యతిరేక ఓట్లు అంగీకరించడం వెనుక రెండు కారణాలు ఉండవచ్చు. "చూశారా? మా దేశంలో కూడా వ్యతిరేక ఓట్లు పడతాయి. మాకు ప్రజాస్వామ్యం ఉంది" అని ప్రపంచానికి చెప్పడం కావొచ్చు. లేదా నిజంగా ఎవరైనా వ్యతిరేకించినా, వారిని సులభంగా గుర్తించి "ఏరివేయడం" కోసం ఇది ఒక ఉపాయమై ఉండవచ్చు.
ఈ ఎన్నికల ద్వారా కిమ్ జాంగ్ ఉన్ తన అధికారాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. పాత తరం నాయకులను తొలగించి, తనపై 100% విధేయత చూపే కొత్త యువ నాయకుల్ని చట్టసభల్లోకి తీసుకొచ్చాడు. ఈసారి సుమారు 70% మంది కొత్త డెప్యూటీలు.
కిమ్ సోదరి కిమ్ యో జాంగ్‌తో సహా కొత్త ముఖాలు ఎక్కువ. మార్చి 22న కొత్త అసెంబ్లీ సమావేశమై కొత్త నాయకత్వం ఎంపిక చేసి, రాజ్యాంగ సవరణ చేయబోతోంది.
ఆ 0.07% మంది ఎవరు? వారి పరిస్థితి ఏమిటి?
నిజం చెప్పాలంటే - వారు ఎవరో తెలియదు. వారి పేర్లు, వయసు, నివాసం... ఏమీ బయటపడలేదు. KCNA కూడా వారి గురించి ఒక్క మాట చెప్పలేదు. దీనిపై ఇంటర్నెట్‌లో (X, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్) మీమ్స్ వైరల్ అయ్యాయి.
"0.07% కోసం మౌనం పాటించండి"
"వారి పాపులేషన్ ఈ సమ్మర్‌లో తగ్గిపోతుంది"
"ఆ 0.07% ఇప్పుడు సజీవంగా ఉన్నారా లేదా?"
వాస్తవం కఠినంగానే ఉంటుంది. ఉత్తర కొరియాలో వ్యతిరేకత అంటే కఠిన శిక్షలు తప్పవనే నానుడి ఉంది. కాన్సట్రేషన్ క్యాంప్స్ కావొచ్చు తరతరాల శిక్ష కావొచ్చు లేదా కొన్ని సందర్భాల్లో మరణ శిక్ష అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

గతంలో ఇలాంటి "నో" ఓట్లు వేసిన వారి కథలు భయానకం. కానీ ఈసారి ఎలాంటి అరెస్టు న్యూస్ రాలేదు. ప్రభుత్వం వారి కోసం వెతకడం లేదు. ఎందుకంటే అది "100% ఏకాభిప్రాయం" ఇమేజ్‌ను పాడు చేస్తుంది.
ఆ 0.07% మందిలో బహుశా ఆకలితో ఉన్న కార్మికులో, గతంలో ప్రభుత్వాన్ని ధిక్కరించిన వారో లేదా ప్రభుత్వ తీరును విమర్శించే యువతీయువకులు కావచ్చు. లేదా పూర్తిగా ప్రభుత్వమే కల్పించిన "కొద్దిపాటి వ్యతిరేకత" కావచ్చు. ఎవరో తెలియదు... కానీ వారు ఉన్నారని ఆ చిన్న సంఖ్య చెప్పింది.
భయంతో కూడిన విధేయత..
ఇది ఉత్తర కొరియా "ప్రజాస్వామ్యం" కథ. ఒకవైపు 99.93% ఏకాభిప్రాయం. మరోవైపు ఒక చిన్న, రహస్య వ్యతిరేకత. కిమ్ జాంగ్ ఉన్ తన అధికారంపై పట్టు ఎంత ఉందో పరీక్షించుకోవడానికి, ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చి విధేయతను ప్రదర్శింపజేయడమే ఈ ఎన్నికల నిజమైన ఉద్దేశం.
బయటి ప్రపంచం జోకులు చేస్తోంది. కానీ ఆ 0.07% మంది (ఒకవేళ నిజమైతే)... వారు ఇప్పుడు ఏమవుతున్నారో ఊహించడం కూడా కష్టమే.
Read More
Next Story