
మరియా కొరినా మచాదోను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
నిరాశలో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్..
2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్(Noble) శాంతి బహుమతి వెనుజులాకు చెందిన కొరినా మచాదోకు లభించింది. శుక్రవారం ( అక్టోబర్ 10)న మచాదో పేరును ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం కృషి చేస్తోన్న మచాదో..డిసెంబర్ 10, 2025న నార్వేలోని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు.
మచాదో ఎవరు..?
వెనిజులా దేశంలో ప్రతిపక్ష నేతగా ఉన్న మరియా కొరినా మచాదో(Maria Corina Machado).. ప్రజాస్వామ్య హక్కుల కోసం చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. సైన్యం పాలనకు వ్యతిరేకంగా ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. 2024 నుంచి అజ్ణాతంలో ఉన్నారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా.. వెనిజుల ప్రజల కోసం దేశంలోనే ఉంటున్నారు. సైన్యానికి వ్యతిరేకంగా గళం విప్పకుండా.. ఆమె ఎంచుకున్న శాంతి మార్గమే మచాదోకు నోబుల్ బహుమతికి అర్హురాలిని చేసింది. వెనిజుల పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకంగా చేయటంలో.. ఒక్క తాటిపైకి తీసుకురావటంలో మరియా చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్లు కమిటీ స్పష్టం చేసింది.
నిరాశలో ట్రంప్..
అమెరికా(America) అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆశలు అడియాశలయ్యాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారంపై ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా ఆయన బహిరంగ ప్రచారం కూడా చేసుకున్నారు. తాను శాంతి దూతనని, కంబోడియా- థాయిలాండ్, కొసావో -సెర్బియా, కాంగో - రువాండా, పాకిస్తాన్ - భారతదేశం, ఇజ్రాయెల్ - ఇరాన్, ఈజిప్ట్ - ఇథియోపియా, అర్మేనియా - అజర్‌బైజాన్ దేశాల మధ్య యుద్ధాలను ఆపానని ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ చెప్పుకొచ్చారు. పాక్ కూడా ట్రంప్‌కు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది. కాగా భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడంలో ట్రంప్ పాత్ర ఏమి లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.