
ఇరాన్ యుద్ధ ప్రభావం: భారీగా పెరుగుతోన్న విమాన టిక్కెట్ల ధరలు..
జెట్ ఇంధన ధరల్లో పెరుగుదల, విమాన మార్గాల్లో మార్పు కారణంగా పెరిగిన టికెట్ ధరల భారాన్ని ప్రయాణికులపైనే మోపుతున్న విమానయాన సంస్థలు..
ఇజ్రాయిల్-అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధం కారణంగా విమాన టిక్కెట్ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో ఉన్న చార్జీలు..ఇప్పుడు లక్షల్లో ఉంటున్నాయి. జెట్ ఇంధన ధరల పెరుగుదల, విమాన మార్గాల్లో మార్పు, పన్నుల భారం కలిసి విమాన ప్రయాణ ఖర్చులను భారీగా పెంచేశాయి. ఈ ఖర్చులను విమానయాన సంస్థలు ప్రయాణికులపై మోపుతున్నాయి.
పెరిగిన టిక్కెట్ ధరలను పరిశీలిస్తే..
- భారత్ నుంచి అమెరికా వెళ్లే టిక్కెట్లు గతంలో రూ.45 వేల నుంచి రూ.1 లక్ష మధ్య ఉండేవి. ఇప్పుడు కొన్ని తేదీల్లో అదే టిక్కెట్లు రూ.1.3 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు చేరాయి.
- బెంగళూరు–లండన్ టిక్కెట్ ధర రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెరిగింది.
- బెంగళూరు–న్యూయార్క్ టిక్కెట్ ధర రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు చేరింది.
- బెంగళూరు–ఫ్రాంక్‌ఫర్ట్ టిక్కెట్ ధర రూ.80 వేల నుంచి రూ.1.9 లక్షలకు పెరిగింది.
- బెంగళూరు–దుబాయ్ టిక్కెట్ ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఉండేది. ఇప్పుడు రూ.22 వేల వరకు పెరిగింది.
- బెంగళూరు–సింగపూర్ టిక్కెట్ ధర రూ.20 వేల నుంచి రూ.40 వేలైంది.
- బెంగళూరు–మలేషియా టిక్కెట్ ధర రూ.20 వేల నుంచి రూ.30 వేలైంది.
- హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమాన టిక్కెట్ల ధరలు కూడా పెరిగాయి.
- హైదరాబాద్–దుబాయ్ టిక్కెట్ ధర రూ.8 వేల నుంచి రూ.15 వేల ఉండేది. ఇప్పుడు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెరిగింది.
- మస్కట్–హైదరాబాద్ టిక్కెట్ ధర రూ.7 వేల నుంచి రూ.15 వేల ఉండేది. ఇప్పుడు రూ.30 వేల నుంచి రూ.40 వేలైంది.
ఇంధన ధరల పెరుగుదల వల్లే..
భారతదేశంలో విమాన టర్బైన్ ఇంధనం (ATF) ధరలు ఇటీవల 5–6 శాతం పెరిగాయి. దీంతో ఢిల్లీలో ATF ధరలు కిలోలీటర్‌కు సుమారు రూ.90 వేల వరకు చేరాయి. ఇంధన ధరలపై కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల VAT పన్నులు కూడా ప్రభావం చూపుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో VAT రేటు 20 నుంచి 25 శాతం వరకు ఉంది. ఈ పరిస్థితిలో విమానయాన సంస్థలు కొత్త ఇంధన సర్‌ఛార్జీలను కూడా ప్రవేశపెట్టాయి. ఎయిర్ ఇండియా దేశీయ టిక్కెట్లపై రూ.399 వరకు అదనపు ఛార్జీ విధించింది. అంతర్జాతీయ విమానాల్లో ఈ సర్‌ఛార్జ్ మరింత ఎక్కువగా ఉంది. ఇండిగో కూడా ఇంధన సర్‌ఛార్జ్ ప్రకటించింది. దేశీయ విమానాలకు రూ.425 నుంచి యూరప్ మార్గాలకు రూ.2,300 వరకు అదనపు ఛార్జీలు ఉన్నాయి. ఆకాసా ఎయిర్ కూడా టిక్కెట్‌కు రూ.199 నుంచి రూ.1,300 వరకు సర్‌ఛార్జ్ విధిస్తోంది.
భద్రతా కారణాల వల్ల కొన్ని విమానాలు పశ్చిమాసియా గగనతలాన్ని తప్పించి ఇతర మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. దీని వల్ల విమాన ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇంధన వినియోగం కూడా ఎక్కువ అవుతోంది.
హైదరాబాద్‌లో గల్ఫ్ దేశాలకు వెళ్లే 29 విమానాలు రద్దయ్యాయి. ఇండిగో మాత్రమే 19 విమానాలను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ట్రావెల్ ఏజెంట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద సంఖ్యలో టిక్కెట్లు రద్దవుతున్నాయి. అనేక మార్గాల్లో టిక్కెట్ ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగాయి.
యుద్ధం ఇలాగే కొనసాగితే విమాన టిక్కెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

