అమెరికాకు ఇటలీ మొండిచేయి, ఆ యుద్ధం మాది కాదు!
x
ఇటలీలో ఎగిసిపడుతున్న యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు

అమెరికాకు ఇటలీ మొండిచేయి, ఆ యుద్ధం మాది కాదు!

సిసిలీ స్థావరం చుట్టూ ముసురుతున్న దౌత్య యుద్ధం


పశ్చిమాసియాలో ఇరాన్ లక్ష్యంగా దాడులు పెంచాలని భావిస్తున్న అమెరికాకు దాని చిరకాల మిత్రదేశం ఇటలీ గట్టి షాక్ ఇచ్చింది. సిసిలీలోని కీలకమైన సిగోనెల్లా (Sigonella) వైమానిక స్థావరాన్ని యుద్ధ విమానాల కోసం ఉపయోగించుకోవాలన్న అమెరికా ప్రతిపాదనను ఇటలీ రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఇటలీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని దౌత్యవర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇటలీ ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ యుద్ధంలో పాల్గొనవద్దని డిమాండ్ చేస్తున్నారు.
ఒప్పందాల ఉల్లంఘన
1950ల చివరలో అమెరికా-ఇటలీ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం- సిగోనెల్లా స్థావరాన్ని కేవలం శిక్షణ, లాజిస్టిక్స్ అవసరాల కోసం మాత్రమే అమెరికా వాడుకోవాలి. యుద్ధానికి ఆయుధాలను తరలించే ట్రాన్సిట్ హబ్ గా దీనిని వాడకూడదు.

ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వాడాల్సి వస్తే, దానికి ఇటలీ పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అమెరికా విమానాలు నేరుగా సిసిలీకి వస్తున్న సమయంలోనే అనుమతి కోరడం వల్ల, పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకునే సమయం లేకపోవడంతో ఇటలీ సాంకేతికంగా నిరాకరించింది.
అంతర్గత రాజకీయ ఒత్తిడి...
ఇటలీలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ వింగ్ గ్రూపులు, ప్రస్తుత ప్రధాని మెలోని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. సిగోనెల్లాలో అమెరికా కార్యకలాపాలు పెరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇటలీని మరో యుద్ధంలోకి లాగొద్దని డిమాండ్ చేశారు. "No MUOS" వంటి శాంతి సంఘాలు, యూనియన్లు భారీ ఎత్తున నిరసనలు చేపట్టడం కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి కారణమైంది.
'సిసిలీ' వ్యూహాత్మక ముప్పు...
సిసిలీ మధ్యధరా సముద్రంలో ఉంది. ఇక్కడి నుండి యుద్ధ విమానాలు వెళ్తే, ఇరాన్ లేదా ఇతర అరబ్ దేశాల నుండి ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంటుందని, అది నేరుగా ఇటలీ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ఇటలీ భయపడుతోంది.
శరణార్థుల సమస్య...
యుద్ధం తీవ్రమైతే పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా నుండి వేల సంఖ్యలో శరణార్థులు ఇటలీ తీరాలకు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే వలసదారుల సమస్యతో సతమతమవుతున్న ఇటలీకి ఇది మోయలేని భారం. అలాగే, యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోతే (Strait of Hormuz మూతపడితే), ఇటలీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది.
ఐరోపా మిత్రదేశాల ధోరణి...
కేవలం ఇటలీ మాత్రమే కాదు, స్పెయిన్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. దీనిని బట్టి అర్థమయ్యే మూడు కీలక అంశాలు ఏమిటంటే.. NATO లో చీలికలు, స్వప్రయోజనాలకే ప్రాధాన్యత, శాంతివైపు మొగ్గుచూపుతున్నట్టు అర్థమవుతోంది.
అమెరికా తీసుకునే ప్రతి సైనిక నిర్ణయానికి ఐరోపా దేశాలు గుడ్డిగా మద్దతు ఇవ్వలేం అనేది ఇందులో కీలకాంశం. తమ దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం దెబ్బతినేలా ఉంటే 'మిత్రదేశం' అని కూడా చూడకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాయి.
అమెరికా బాంబర్ విమానాలకు సిసిలీలో అనుమతి నిరాకరించడం ద్వారా, ఇటలీ తన సార్వభౌమాధికారాన్ని చాటుకుంది. అమెరికా తన యుద్ధ తంత్రాన్ని ఇప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మిత్రదేశాల గగనతలం అందుబాటులో లేకపోతే యుద్ధ ఖర్చు, సమయం భారీగా పెరుగుతాయి.
Read More
Next Story