ట్రంపూ, ఈ 20 రోజుల పసిగుడ్డును చంపేందుకు నీకు చేతులెలా వచ్చాయ్?
x
డానాల్డ్ ట్రంప్ చేతులకు రక్తం అంటినట్టున్న ఊహాత్మక చిత్రం

ట్రంపూ, ఈ 20 రోజుల పసిగుడ్డును 'చంపేందుకు' నీకు చేతులెలా వచ్చాయ్?

నిలదీస్తున్న అంతర్జాతీయ సమాజం, ఇరాన్ మూగ రోదన!


యుద్ధమే కాదు, ఏ విపత్తు వచ్చినా ముందు బలయ్యేది అభం శుభం తెలియని పిల్లలు, మహిళలే. ఇది చరిత్ర చెబుతున్న చేదు నిజం. అందుకు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రస్తుత యుద్ధమూ మినహాయింపు కాదు. నిన్నటి గాజా (పలస్తినా) విషాదంలో ఆకలితో అలమటించిన పసిపిల్లల హాహాకారాలు ఇంకా మారుమోగుతుండగానే, ఇప్పుడు ఇరాన్‌లో మరో ఘోరం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో కేవలం 20 రోజుల వయసున్న పసికందు మొహమ్మద్ అలీ కయాల్హా చనిపోయిన తీరు ప్రపంచ ప్రజల గుండెల్ని పిండేస్తోంది.

మీడియా ప్రసారమైన దృశ్యం

ఆ 20 రోజుల పసికందు మొహమ్మద్ అలీ కయాల్హా మరణం అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో జరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మాజిదియా (Majidieh) అనే నివాస ప్రాంతంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడి జరిపాయి. ఇది సైనిక స్థావరం కాకపోయినప్పటికీ, బాంబుల వర్షం కురవడంతో ఆ ప్రాంతంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి జరిగిన సమయంలో ఆ పసికందు తన తల్లి ఒడిలో ఉన్నాడు. ఈ దారుణమైన దాడిలో కేవలం ఆ పసికందు మాత్రమే కాకుండా, అతని తల్లి, అన్న కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పాల బువ్వకు బదులు బాంబులు బలిగొంటున్నాయి...

తల్లి ఒడిలో నిదురించాల్సిన బిడ్డను, తెల్లటి గుడ్డలో చుట్టి అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే ఆ తల్లి ఆత్మ ఎంతలా ఘోషించి ఉంటుందో? దురదృష్టవశాత్తూ అదే దాడిలో ఆ తల్లి కూడా మరణించడం మరో దారుణం.
ఆ చిన్నారి మృతదేహాన్ని కాజ్విన్ (Qazvin) నగరానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. తెల్లటి వస్త్రంలో చుట్టిన ఆ పసికందు మృతదేహాన్ని ఒక వ్యక్తి చేతులతో పైకి ఎత్తి పట్టుకున్న దృశ్యం, అక్కడి జనం కన్నీటి పర్యంతమవుతూ నినాదాలు చేస్తున్న వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
యుద్ధం వల్ల సైనిక లక్ష్యాల కంటే ఎక్కువగా సామాన్య ప్రజల నివాసాలు దెబ్బతినడం, అందులోనూ కేవలం 20 రోజుల వయసున్న పసిప్రాణాలు బలికావడం మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్‌లో ఇప్పటివరకు చనిపోయిన 204 మంది చిన్నారుల్లో ఈ పసికందు కూడా ఒకరు కావడం అత్యంత దారుణం.

వైరల్ అవుతున్న పసికందు చిత్రం

ప్రస్తుతం సోషల్ మీడియాలో (X) వైరల్ అవుతున్న ఒక వీడియో చిత్రం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. అందులో ఒక వ్యక్తి, తెల్లటి బట్టలో చుట్టబడిన ఆ పసికందు మృతదేహాన్ని చేతులెత్తి పట్టుకోగా, చుట్టూ ఉన్న పెద్ద జనసమూహం తీవ్ర ఆవేదనతో, రోదిస్తూ నివాళులర్పిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ అపరాధం ఎరుగని మొహం, ఆ చిట్టి చేతులు, కాళ్లు.. యుద్ధం ఎంతటి క్రూరమైనదో ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.

మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పాఠశాలలు, నివాస ప్రాంతాలపై జరిగిన దాడులు జరుగుతూనే ఉన్నాయి. పసి ప్రాణాలు పోతూనే ఉన్నాయి. గాజాలో ఆ మధ్య పసిపిల్లలు ఆకలితో అలమటించి చచ్చిపోవడం, ఇప్పుడు ఇరాన్‌లో పసికందుల చిదిగిపోవడం.. యుద్ధం ఏ రూపంలో వచ్చినా తెచ్చేది వినాశనమేనని రుజువు చేస్తోంది.
ప్రపంచ స్పందన
ఈ పసికందు చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ అమానుష దాడులను ఖండిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ విషయంపై స్పందించి, యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, అమాయక ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాయి.

యుద్ధం వల్ల రాజకీయ నాయకులు, సైన్యాధికారులు ఏమైనా సాధించొచ్చు, కానీ చివరకు నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలు, చిన్నారులే. ఆ 20 రోజుల పసికందు మొహమ్మద్ అలీ కయాల్హా చిలికిన రక్తం, ప్రపంచం మేల్కోవాలని కోరుకుంటోంది.
Read More
Next Story