గ్యాస్ వస్తోంది, 4 రోజులు ఓపిక పట్టండి!
x
ఎల్పీజీ గ్యాస్ తో బయలుదేరిన భారతీయ నౌక

గ్యాస్ వస్తోంది, 4 రోజులు ఓపిక పట్టండి!

హర్మూజ్‌ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ నౌకలు


లిక్విడ్ గ్యాస్ తో బయల్దేరిన భారతీయ నౌకలు రెండు కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటాయి. అంత సవ్యంగా మరో నాలుగు రోజుల్లో అవి గుజరాత్ తీరానికి చేరుకుంటాయి


ఇరాన్- అమెరికా యుద్ధంతో హర్మూజ్‌ జలసంధి వద్ద ఏర్పడిన పరిస్థితుల వల్ల వందలాది నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఎల్పీజీ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్‌ ప్రకటించిన తర్వాత పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

భారత జెండాలు కలిగిన ‘శివాలిక్‌’, ‘నందాదేవి’ అనే రెండు ఎల్పీజీ నౌకలు శనివారం సురక్షితంగా హర్మూజ్‌ జలసంధిని దాటాయని షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఈ నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉండగా, అవి గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు ప్రయాణిస్తున్నాయి.

మార్చి 16 లేదా 17 నాటికి భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశంలో ఎల్పీజీ లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ పరిణామం కొంత ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా కొందరు ముందుగానే సిలిండర్లు బుక్‌ చేస్తున్నారని, బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టేందుకు రాష్ట్రాలకు సూచనలు ఇచ్చినట్లు తెలిపింది.


అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరాను ప్రాధాన్యత క్రమంలో నిర్వహిస్తున్నామని, గృహాలు, ఆసుపత్రులు, హాస్టళ్లకు ముందుగా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్‌ బుకింగ్‌కు కనీస గడువు 45 రోజులు, పట్టణాల్లో 25 రోజులు ఉంటుందని కూడా తెలిపారు.

ఇక గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నౌకలు, వాటిలో పనిచేస్తున్న భారత సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హర్మూజ్‌ జలసంధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, భారత నావికుల కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించింది.


Read More
Next Story