
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయేలు సంయుక్త దాడి..
టెహ్రాన్ అంతటా పేలుళ్లు భారీగా వ్యాపించిన పొగ..
ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయేల్ కలిసి ఇరాన్ ప్రభుత్వ సైనిక బలగాలపై దాడులకు దిగాయి. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణుకేంద్రాలను పునర్నిర్మించడానికి.. క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందువల్లే ఆ దేశానికి వ్యతిరేకంగా భారీ సైనిక చర్య చేపట్టామని వెల్లడించారు. ఇక ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నామన్నారు. ఆ దేశ నాయకులు ఇప్పటికైనా తమ మాట వినకపోతే మొత్తం దేశాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు.
ఇజ్రాయిల్ కూడా..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ కూడా క్షిపణి దాడులకు పాల్పడింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు వినిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిని తామే చేశామని టెల్‌అవీవ్ ప్రకటించింది. శత్రు దేశం నుంచి పొంచిఉన్న ముప్పును తప్పించేందుకు ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతిదాడులకు దిగిన ఇరాన్..
ఇరాన్ కూడా మిసైళ్లు, డ్రోన్లతో ఎదురుదాడికి దిగింది. సైనిక దళాలను అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమాన మార్గాలను మూసివేశారు. ఇప్పటికి ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు. ఉద్రిక్తతలు మాత్రం పెరిగాయి. ఇది “సైనిక ఘర్షణకు ముందు పరిస్థితి” అని అంతర్జాతీయ నిపుణులంటున్నారు.
ఇటు ఒమాన్, ఇతర దేశాలు ఇరాన్-అమెరికా మధ్య చర్చలకు మద్దతు ఇస్తున్నాయి. ఫలితంగా యుద్ధం మొదలవడాన్ని కొంత ఆలస్యం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

