విదేశాల్లో చిక్కుకున్న లక్షల మంది ప్రవాసాంధ్రులు
x
ఆల్ ఇండియా రేడియో వారు ఎక్స్ లో షేర్ చేసిన ఫొటో

విదేశాల్లో చిక్కుకున్న లక్షల మంది ప్రవాసాంధ్రులు

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రవాస భారతీయుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కసరత్తు


అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టింది. యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాలు సహా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, తిరిగి స్వదేశానికి తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ఎంబసీలు, కాన్సులేట్ల సహాయంతో ఎయిర్‌ లిఫ్ట్ ఆపరేషన్లు, హెల్ప్‌లైన్లు, తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రం నుంచి సుమారు 15 లక్షల మంది ప్రవాసాంధ్రులు గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ సహా వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. యుద్ధ ప్రభావం కారణంగా విమానాశ్రయాలు రద్దు కావడం, ప్రయాణ ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

మార్చి 4, 2026 నాటికి ఈ ప్రాంతంలో క్షిపణులు, బాంబుల వర్షం కురుస్తుండటంతో భీతావహ వాతావరణం నెలకొంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, అబుధాబి, దుబాయ్, ఖతార్, కువైట్ వంటి దేశాల్లో ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియక ప్రవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికన్ సైనిక స్థావరాలతో పాటు నివాస సముదాయాలు కూడా లక్ష్యంగా మారుతున్నాయి.


గల్ఫ్ లో చిక్కుకున్న ప్రవాస భారతీయులు

యుద్ధ భయంతో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. బహ్రెయిన్‌లో విద్యాలయాలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. దుబాయ్‌లో బయట తిరగడంపై నిషేధం విధించారు. ఖతార్‌లో కంపెనీలు మూసివేశారు. కువైట్‌లో పోలీసులు నిరంతర గస్తీ నిర్వహిస్తూ ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) అప్రమత్తమయ్యాయి. ప్రవాసులకు తగిన సూచనలు జారీ చేస్తున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగుతుందేమోనన్న భయంతో చాలామంది స్వస్థలాలకు తిరిగి రావాలని భారత ఎంబసీలను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది. ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్ అఫైర్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ద్వారా సురక్షిత తిరిగి రావటానికి చర్యలు చేపట్టారు. హెల్ప్ డెస్క్‌లు, సంప్రదింపులు, రిపాట్రియేషన్ ప్లాన్‌లు సిద్ధం చేశారు. ఇండియన్ మిషన్స్ 24 గంటలు సంప్రదించదగిన స్థితిలో ఉన్నాయి. ‘పానిక్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి’ అని సలహా ఇస్తున్నారు.

ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసులకు ప్రత్యక్ష హాని జరగలేదు. అయితే సైరన్‌లు, పేలుళ్ల శబ్దాలతో టెన్షన్ పెరుగుతోంది. గల్ఫ్ దేశాల్లో ఏపీఎన్‌ఆర్‌టీఎస్ రిజిస్టర్డ్ వర్కర్ల సంఖ్య ఇలా ఉంది.

దేశం

రిజిస్టర్డ్ సంఖ్య

కువైట్

66,065

యూఏఈ

13,107

బహ్రెయిన్

7,750

ఒమన్

7,218

సౌదీ అరేబియా

6,846

ఖతార్

5,172

మొత్తం

1,06,158

ప్రవాసులకు సలహా

స్థానిక అధికారులు, ఇండియన్ ఎంబసీ అడ్వైజరీలను పాటించండి. కుటుంబ సభ్యులు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. పరిస్థితి మారుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తున్నాయి.

‘‘తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం’’ అని రాష్ట్ర ఎన్‌.ఆర్‌.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంబంధిత శాఖగా తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రవాసుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని మంత్రి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీ) ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు సహాయం అందించేందుకు చురుగ్గా వ్యవహరిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసి, స్థానిక తెలుగు కుటుంబాల సహకారంతో తాత్కాలిక వసతి, భద్రత, అవసరమైన సహాయం అందిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ‘‘ఏపీ ఎన్నార్టీ అధికారులు పరిస్థితిని నిరంతరం మానిటర్ చేస్తూ కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానిక ఇండియన్ ఎంబసీ సేవలను వినియోగించుకోవాలి’’ అని ఆయన సూచించారు.

గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాసులు తమ వివరాలను ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్లకు తెలియజేయవచ్చని మంత్రి సూచించారు. హెల్ప్‌లైన్ నంబర్: 0863-2340678, వాట్సాప్: +91 85000 27678, ఈమెయిల్: helpline@apnrts.com. ‘‘అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు వెంటనే సంప్రదించి సహాయం పొందాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘ఆపరేషన్ అజయ్’ వంటి ప్రత్యేక ఎవాక్యుయేషన్ మిషన్లను ప్రారంభించింది. ఇరాన్ సమీప దేశాల్లో ఉన్న భారతీయులను సముద్ర మార్గం, ప్రత్యామ్నాయ విమాన మార్గాల ద్వారా తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రవాసాంధ్రులకు ప్రత్యేక సహాయం అందిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ప్రవాసులు అప్రమత్తంగా ఉండి, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More
Next Story