
బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ రాడికల్ గ్రూపుల వీరంగం
పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కచేరీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న విద్యార్థులు, ఢాకా పరిస్థితులపై తస్లీమా నస్రీన్ ఆందోళన
బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ మూక సంస్కృతి పెరిగిపోతోంది. బెంగాలీ సంస్కృతికి ఆయువు పట్టు అయిన కళలు, సంగీతంపై జిహాదీ శక్తులు యథేచ్ఛగా దాడులు చేస్తున్నాయి. తాజాగా ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీద్ ఫూర్ లో ప్రముఖ బంగ్లాదేశ్ గాయకుడు జేమ్స్ కచేరీకి చేయడానికి ఏర్పాట్లు చేసుకోగా జిహాదీ మూకలు ఇటుకలు, రాళ్లతో దాడులు చేసి విధ్వంసం సృష్టించాయి.
ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.00 గంటలకు చోటు చేసుకుంది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా కచేరీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలియగానే ఇస్లామిస్టులు వందల సంఖ్యలో విచ్చేసినట్లు స్థానికులు తెలిపారు.
ఒక బృందం బలవంతంగా వేదికలోకి బలవంతంగా ప్రవేశించిందని వెల్లడించారు. వేదిక వద్ద ఉన్న విద్యార్థులు మొదట్లో దాడి చేసిన వారిని ప్రతిఘటించారని, కానీ స్థానిక అధికారుల ఆదేశాల మేరకు చివరకు కచేరీని రద్దు చేసినట్లు ప్రకటించారు.
ఈ సంఘటన పై రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. బంగ్లాదేశ్ లో కలవరపెట్టే విధంగా పరిస్థితులు మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో ‘‘సాంస్కృతిక కేంద్రం ఛాయానౌత్ కాలి బూడిదైంది. సంగీతం, థియోటర్ నృత్యం, పారాయణం, జానపద సంస్కృతి ద్వారా లౌకిక, ప్రగతిశీల చైతన్యాన్ని పెంపొందించడానికి నిర్మించిన ఉడిచి అనే సంస్థ కూడా బూడిదగా మారింది. నేడు జిహాదీలు ప్రఖ్యాత గాయకుడు జేమ్స్ ను ప్రదర్శన ఇవ్వడానికి అనుమతించలేదు’’ అని పోస్ట్ చేశారు.

