
అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ట్రంప్ ఆరోగ్యం సరిగానే ఉందా?
రెయిలింగ్ పట్టుకుని ‘ఎయిర్ ఫోర్స్ వన్’ దిగిన అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ ఆరోగ్యం సరిగానే ఉందా? తన నిర్ణయాలు తనే స్వయంగా తీసుకుంటున్నాడా? తను బాగున్నాని, ఎటువంటి సమస్యలు లేవని ఇటూ ట్రంప్, అటూ వైట్ హౌజ్ స్పష్టత ఇస్తున్నప్పటికీ అనుమానాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఫుటేజ్, ట్రంప్ ఆరోగ్యం సరిగా లేదనే వాదనను మరోసారి చర్చకు తెచ్చింది.
అమెరికా అధ్యక్ష చరిత్రలోనే అత్యంత వయసు పైబడిన (జనవరి 2025లో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసే నాటికి 78 ఏళ్లకు పైబడిన) ట్రంప్, ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లపై నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్న ఓ వీడియో ఒకటి బయటపడింది. దీనిపైనే అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఈ జూన్‌లో 80 ఏళ్లు నిండనున్న ట్రంప్, శనివారం (మార్చి 21) ఫ్లోరిడాకు చేరుకున్నప్పుడు ఈ ఫుటేజ్ బయటకు వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నారు. కొందరు ఆయన అసౌకర్య సంకేతాలు చూపిస్తున్నారని అంటుండగా, మరికొందరు ఆయన కేవలం అతి జాగ్రత్తగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు.
పశ్చిమ ఆసియాలో ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ప్రస్తుతం తన దేశానికి నాయకత్వం వహిస్తున్న ట్రంప్, మెట్లు దిగే సందర్భంలో ప్రతి మెట్టు కిందకు దిగాలంటే కచ్చితంగా రెయిలింగ్ పట్టుకుని నడవడం అందులో స్పష్టంగా ఉంది.
ట్రంప్ కదలికలను కొంతమంది నెటిజన్లు ఎగతాళి చేశారు. “వృద్ధుడు, బలహీనుడు, అలసిపోయినవాడు, గందరగోళంలో ఉన్నవాడు, దారి తప్పినవాడు, ప్రేమించబడనివాడు, మతిమరుపు ఉన్నవాడు, నెమ్మదైనవాడు, ఆందోళనలో ఉన్నవాడు, భయపడినవాడు” అని కామెంట్ చేశారు.
“ఆయన అడుగులు చాలా ఉద్దేశపూర్వకంగా ఉంటాయి. నేను కూడా అలాగే చేస్తాను. నా మోకాలికి సమస్య ఉంది. మెట్లు ఎక్కడం సమస్య కాదు. కానీ మెట్లు దిగడం వేరు. కొన్నిసార్లు మోకాలు వంగిపోతుందేమో అనిపిస్తుంది.
నిజానికి అలా జరగదు, కానీ అలా అనిపిస్తుంది,” అని మరొక నెటిజన్ అన్నారు. ట్రంప్ కు స్పష్టంగా నడవడంలో సమస్య ఉన్నప్పటికీ, తరచుగా గోల్ఫ్ ఎలా ఆడగలుగుతున్నారని కూడా కొందరు ప్రశ్నించారు.
బైడెన్ ను ఎగతాళి చేసిన ట్రంప్..
మాజీ అధ్యక్షుడు బైడెన్ చాలాసార్లు ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి కిందకి దిగే సమయంలో పడిపోయినప్పుడూ ట్రంప్ ఎగతాళి చేసేవారు. బైడెన్ కూడా గత సంవత్సరం తన ఏకైక పదవీకాలం ముగిసే నాటికి 82 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక వృద్ధుడు. ఈ పడిపోవడాలు తరచుగా బైడెన్ "అసమర్థ" పదవీకాలాన్ని సూచిస్తాయని ప్రస్తుత అధ్యక్షుడు ఆరోపించారు.
ట్రంప్ శారీరక రూపంపై ప్రశ్నలు తలెత్తిన తరుణంలో ఈ తాజా వీడియో బయటపడింది. ఆయన చీలమండలు వాచాయని, చర్మం రంగులో మార్పులు వచ్చాయని, ఇంకా ఇతర స్పష్టమైన లక్షణాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన కుర్చీలో కూర్చునే ముందు నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించిన మరో వీడియో బయటపడటంతో ఈ చర్చ మరింత తీవ్రమైంది.
అయితే, తన ఆరోగ్యంతో సమస్య ఉందని అంగీకరించే మూడ్‌లో అధ్యక్షుడు లేరు. తాను ఇష్టపడి తినే జంక్ ఫుడ్ మానేస్తే 200 ఏళ్ల వరకు జీవించగలనని తనకు చెప్పారని ట్రంప్ కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నారని ఇండిపెండెంట్ నివేదిక తెలిపింది. యూఎస్ నావల్ అకాడమీ ఫుట్‌బాల్ జట్టును సత్కరించే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ కార్యక్రమంలోనే ఆయన ఆరోగ్యంపై ప్రశ్నలు తలెత్తాయి. అధ్యక్షుడు తన మాజీ వైట్ హౌస్ వైద్యుడు, ప్రస్తుతం టెక్సాస్ నుంచి రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న రోనీ జాక్సన్‌ను కూడా ప్రస్తావించారు. వైట్ హౌస్‌లోని గత ముగ్గురు అధ్యక్షులలో తానే "అత్యంత ఆరోగ్యవంతుడినని" జాక్సన్ తనకు చెప్పినట్లు అధ్యక్షుడు తెలిపారు.
Next Story

