
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హెచ్చరికలు
ఇరాన్ జోలికొస్తే ఇరుక్కుపోతారు, జాగ్రత్త!
'గల్ఫ్ దేశాలనూ వదలబోం, ట్రంప్ కూటమికి ఇరాన్ వార్నింగ్!'
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తమపై దాడులకు సహకరించే ఏ దేశాన్నైనా శత్రువుగానే పరిగణిస్తామని, వారి మౌలిక సదుపాయాలను భూస్థాపితం చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.
గగనతలాన్ని వాడనీయొద్దు: పెజెష్కియాన్
గల్ఫ్ దేశాల్లో శాంతి, అభివృద్ధి నెలకొనాలంటే తాము చెప్పినట్లు వినాలని ఇరాన్ అధ్యక్షుడు సూచించారు. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ వంటి దేశాలకు ఇరాన్ గట్టి సంకేతాలు పంపింది. అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు ఇరాన్‌పై దాడులు చేయడానికి ఆయా దేశాల గగనతలాన్ని (Airspace) వినియోగించుకోకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
శత్రువులకు సహకరించే వారిని కూడా వదిలిపెట్టబోమని, తమ అణు లేదా ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
మొజ్తాబా ఖమేనీ మృతిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అగ్రనాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ వారసుడిగా భావిస్తున్న మొజ్తాబా ఖమేనీ కూడా దాడుల్లో చనిపోయి ఉంటాడని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఆయన ఎక్కడా కనిపించకపోవడం, ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో నెలకొన్న శూన్యం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
భారత్‌కు 'హర్మూజ్' ఊరట..
యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, తన మిత్రదేశమైన భారతదేశం పట్ల ఇరాన్ సానుకూలత ప్రదర్శించింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా భారత నౌకల ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సుమారు 90,000 టన్నుల వంటగ్యాస్ (LPG)తో వస్తున్న బీడబ్ల్యూ ఈఎల్ఎం (BW ELM), బీడబ్ల్యూ టీవైఆర్ (BW TYR) అనే రెండు భారత నౌకలు శనివారం హర్మూజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి.
మరో ఐదు భారతీయ ట్యాంకర్లు యూఏఈ సమీపంలో ఇరాన్ అనుమతి కోసం వేచి ఉన్నాయి. భారత్ సహా మరో ఐదు దేశాలకు మాత్రమే ఇరాన్ ఈ వెసులుబాటు కల్పించడం గమనార్హం.
ఇరాన్ హెచ్చరికలతో గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డాయి. అటు అమెరికాతో సంబంధాలు, ఇటు ఇరాన్ ఆగ్రహం మధ్య ఆ దేశాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ గల్ఫ్ దేశాలకు పాకితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Next Story

