గెరిల్లా యుద్ధం వైపు ఇరాన్ మొగ్గు? అమెరికాకు కొత్త సంకటం
x

గెరిల్లా యుద్ధం వైపు ఇరాన్ మొగ్గు? అమెరికాకు కొత్త సంకటం

ఇరాన్ గెరిల్లా తరహా యుద్ధానికి దిగుతుందా? దిగితే అమెరికా తట్టుకోగలదా?


ఇరాన్ తో అమెరికా యుద్ధం మొదలై రెండు వారాలు ముగుస్తున్న నేపథ్యంలో ఒక కీలక ప్రశ్న ముందుకొచ్చింది. ఇరాన్ గెరిల్లా తరహా యుద్ధానికి దిగుతుందా? దిగితే అమెరికా తట్టుకోగలదా? ఇది మరో వియత్నాం (Vietnam War) లేదా ఆఫ్ఘనిస్థాన్ లాగా సుదీర్ఘ కాలం కొనసాగుతుందా?

రక్షణ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఇరాన్ ఇప్పటికే సంప్రదాయ యుద్ధం కాకుండా అసిమెట్రిక్ యుద్ధ వ్యూహాల వైపు కదులుతోంది.

అసలేమిటీ అసిమెట్రిక్ యుద్ధ వ్యూహాలు?

అసిమెట్రిక్ యుద్ధం (Asymmetric Warfare) అంటే రెండు దేశాలు లేదా సైన్యాల శక్తి, సాంకేతికత, వనరులు సమానంగా లేకపోయినప్పుడు బలహీన పక్షం ప్రత్యక్ష యుద్ధం కాకుండా ప్రత్యేక వ్యూహాలతో బలమైన శత్రువును ఎదుర్కోవడం. సాధారణంగా చిన్న దేశాలు లేదా గెరిల్లా దళాలు పెద్ద సైన్యాలను ఎదుర్కొనడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తాయి.
ఈ తరహా యుద్ధాలలో గెరిల్లా దాడులు, చౌక ఆయుధాలతో దాడులు, మౌలిక వసతులపై దాడులు, మానసిక యుద్ధాలు ఉంటుంటాయి. అకస్మాత్తుగా దాడులు చేసి వెంటనే వెనక్కి వెళ్లిపోవడం గెరిల్లా యుద్ధం. ఇది పెద్ద సైన్యాన్ని అలసిపోవేలా చేస్తుంది. అమెరికా లాంటి పెద్ద సైనిక సంపత్తి ఉన్న దేశాలతో ఇరాన్ లాంటి చిన్న దేశాలు తలపడలేవు. అప్పుడు చిన్న డ్రోన్లు, మైన్లు, IEDలు ఉపయోగించి పెద్ద సైన్యానికి భారీ నష్టం కలిగిస్తుంటాయి. ఇప్పుడు ఇరాన్ అదే పని చేస్తోంది. ఒకే ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న దాడులు చేసి మానసికంగా పెద్ద దేశాలను దెబ్బతీస్తుంటాయి.

ఇలాంటి వ్యూహాలను గతంలో వియత్నాం, ఆఫ్ఘన్ లో తాలిబాన్లు చేశారు. ఇరాన్ “మోసాయిక్ డిఫెన్స్” వ్యూహం ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది. ఈ విధానంలో సైన్యాన్ని చిన్న చిన్న యూనిట్లుగా విభజిస్తారు. కేంద్ర కమాండ్ ధ్వంసమైనా యుద్ధం కొనసాగుతుంది. ప్రతి యూనిట్ స్వతంత్రంగా పోరాడుతుంది. ఇది ముఖ్యంగా Islamic Revolutionary Guard Corps రూపొందించిన వ్యూహం. దీంతో శత్రువు త్వరగా విజయం సాధించడం చాలా కష్టం.
రక్షణ నిపుణుల అంచనా ప్రకారం.. ఒక డ్రోన్ కూల్చడానికి అయ్యే ఖర్చు దాని ధర కంటే 15–20 రెట్లు ఎక్కువ. ఇది యుద్ధంలో ఆర్థిక అసమతుల్యత సృష్టిస్తుంది.
అమెరికా యుద్ధాల ఖర్చు ..
అమెరికా గత రెండు దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో చేసిన యుద్ధాలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. బ్రాన్ యూనివర్శిటీ (Costs of War Project) నివేదికల ప్రకారం...
ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధాల (2001–2021) కోసం అమెరికా సుమారు $8 ట్రిలియన్లు (సుమారు ₹660 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. ఇందులో నేరుగా యుద్ధానికి చేసిన ఖర్చుతో పాటు, రిటైర్డ్ సైనికుల వైద్యం, వడ్డీలు కూడా కలిపి ఉన్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అమెరికా రోజుకు సగటున $300 మిలియన్లు (₹2,500 కోట్లు) ఖర్చు చేసింది.
ఇక ఇప్పటి ఇరాన్ తో యుద్ధంలో మొదటి 100 గంటల్లోనే అమెరికాకు సుమారు $3.7 బిలియన్ల నష్టం వాటిల్లుతుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో సుమారు ₹34,240 కోట్లు.
కీలక వ్యూహం హర్మోజ్ జలసంధిలోనే...
ఇరాన్ మరో కీలక వ్యూహం హర్మోజ్ జలసంధి.(Strait of Hormuz). ప్రపంచ చమురు రవాణాలో అత్యంత ఎక్కువగా ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసేసి షిప్పింగ్‌ను అడ్డుకోవడం మొదలు పెట్టింది. ఇలా చేయడం వల్ల ప్రపంచ చమురు మార్కెట్ కుదేలవుతుంది.

ఇది అమెరికాపై సైనికంగా కాకుండా ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహం. ఇరాన్ కు కలిసొచ్చే మరో అంశం సహజ రక్షణ. చుట్టూ పర్వతాలు, ఎడారులు ఉన్నాయి. విస్తారమైన భూభాగం ఇదే. ఇవి విదేశీ సైన్యాలకు కష్టాలు తెచ్చిపెడతాయి. అమెరికా ఇప్పటికే అప్ఘనిస్తాన్‌లో, ఇరాక్‌లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది.

అమెరికా భూతల యుద్ధానికి దిగుతుందా?

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా పూర్తి స్థాయి భూయుద్ధానికి దిగే అవకాశం తక్కువ. భారీ సైన్యం అవసరం. అమెరికాకి ఈ సైన్యం తక్కువ. పైగా ప్రాణనష్టం జరిగే కొద్ది అమెరికాలో ప్రభుత్వంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతాయి. ఎక్కువ కాలం యుద్ధం జరిగితే అమెరికాకి ముప్పు ఎక్కువ. గత యుద్ధాల అనుభవం ఇదే. అందువల్ల భూతల యుద్ధానికి అమెరికా దిగే ఛాన్స్ లేదు. పైగా అధ్యక్షుడు Donald Trump తన పదవీకాలంలో విదేశాల్లోని సైన్యాన్ని తగ్గిస్తామని ప్రకటించారు.
కొంతమంది నిపుణులు ఈ యుద్ధం- వియత్నాం తరహాగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే అమెరికాకు పెద్ద నష్టం కలిగిస్తుంది. ఇరాన్ కూడా వియత్నాం తరహా వ్యూహాన్ని అనుసరిస్తే యుద్ధం ఏళ్ల తరబడి సాగవచ్చు.
ఇప్పుడు గల్ఫ్ దేశాలలో కుర్దిష్ ఫ్యాక్టర్ తెరపైకి వచ్చింది. ఇరాక్ ప్రాంతంలో ఎక్కువగా ఉండే కుర్దులు కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కుర్దులు ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. అమెరికా వారికి మద్దతు ఇస్తే యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది. అయితే టర్కీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ యుద్ధం ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. చమురు ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. సప్లై చైన్స్ దెబ్బతింటున్నాయి. దీంతో యుద్ధాన్ని త్వరగా ముగించాలని ప్రపంచ దేశాలు అమెరికాపై వత్తిడి పెంచుతున్నాయి.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికాదే అయినా.. గెరిల్లా యుద్ధం ఒకసారి మొదలైతే అది సంవత్సరాల పాటు సాగవచ్చు. ఇరాన్ అదే వ్యూహాన్ని పూర్తిగా అమలు చేస్తే ఈ యుద్ధం త్వరగా ముగియకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఏర్పడితే అది కేవలం మధ్యప్రాచ్యానికే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More
Next Story