
జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ యుద్ధనౌక తిరిగి రంగంలోకి..
యుద్ధం వద్దన్న మరో అమెరికా అధికారి అవుట్..
ఇరాన్ ముంగిట అమెరికా యుద్ధనౌక హల్చల్
ఇరాన్-అమెరికా యుద్ధం 35వ రోజుకు చేరింది. హర్మూజ్ జల సంధి వ్యవహారం ముదిరింది. లెబనాన్ భూతల పోరాటం ఉధృతమైంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో విభేదించిన మరో ఆర్మీ అధికారి రాజీనామా చేశారు. యుద్ధం మరో రెండు మూడు వారాలు కొనసాగుతుందని ట్రంప్ చెప్పిన మాటపై అమెరికాలో చిటపటలు మొదలయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికా దాడులతో ఇరాన్‌ను 'రాతి యుగం' (Stone Age) లోకి పంపుతామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుండగా, అందుకు భిన్నమైన స్వరాలు వినిపిస్తున్న వారిపై వేటు పడుతోంది. తాజాగా, యుద్ధ వ్యూహాలపై విభేదించిన అమెరికా ఆర్మీ టాప్ జనరల్ రాందీ జార్జ్‌ను పదవి నుంచి తప్పించడం పెంటగాన్‌లో కలకలం రేపుతోంది.
వరుసగా తప్పుకుంటున్న అధికారులు...
డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్‌సెత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు డజనుకు పైగా జనరల్స్, అడ్మిరల్స్‌ను తొలగించారు. తాజాగా ఆర్మీ టాప్ యూనిఫామ్డ్ ఆఫీసర్ జనరల్ రాందీ జార్జ్ రాజీనామా చేయాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది.
యుద్ధాన్ని పొడిగించడం ఇష్టం లేని వారు, ట్రంప్ దూకుడును వ్యతిరేకిస్తున్న వారిని వరుసగా సాగనంపుతున్నట్లు తెలుస్తోంది.
రాతి యుగంలోకి ఇరాన్: ట్రంప్ వార్నింగ్
బుధవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, ఇరాన్‌పై దాడులు మరో రెండు మూడు వారాలు అత్యంత తీవ్రంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
"ఇరాన్‌లో ఇప్పటికే అంతా అయిపోయింది. రానున్న కొద్ది రోజుల్లో వారిని రాతి యుగంలోకి నెట్టేస్తాం. వాళ్లు ఆ యుగానికి చెందినవారే" అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే, యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడంతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి, చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి.
హర్మూజ్ జలసంధిపై ప్రపంచ దేశాల గురి
ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి మూతపడటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిని తెరిపించేందుకు బ్రిటన్ నాయకత్వంలో 40 దేశాలు సమావేశమయ్యాయి.
ఈ చర్చల్లో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి పాల్గొని, శాంతియుత పరిష్కారం కోసం భారత్ గళాన్ని వినిపిస్తున్నారు.
హర్మూజ్‌ను తెరిపించేందుకు సైనిక చర్య చేపట్టడం అవాస్తవికమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్పష్టం చేశారు.
ఇరాన్ ప్రతిఘటన
అమెరికా దాడులకు భయపడేది లేదని ఇరాన్ ప్రకటించింది. తమ వద్ద రహస్య ప్రాంతాల్లో భారీ క్షిపణి నిధులు ఉన్నాయని, అమెరికాకు తెలియని తయారీ కేంద్రాలు ఇంకా అనేకం ఉన్నాయని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. యుద్ధంలో పాల్గొనేందుకు 70 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. తాజా వైమానిక దాడిలో ఇరాన్ మాజీ మంత్రి కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య మరణించారు.
యుద్ధం ముగింపు ఎప్పుడు?
ఆస్ట్రేలియా వంటి మిత్రదేశాలు ట్రంప్ లక్ష్యాలకు మద్దతు తెలుపుతున్నప్పటికీ, "ఇరాన్‌లో ఇంకా సాధించాల్సింది ఏముంది? యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది?" అని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు, రానున్న 48 గంటల్లో బాగ్దాద్‌పై తీవ్ర దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.
మళ్ళీ రంగంలోకి అమెరికా అతిపెద్ద యుద్ధనౌక..
అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత ఆధునిక మరియు అతిపెద్ద విమాన వాహక నౌక 'యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్. ఫోర్డ్' (USS Gerald R. Ford) మరమ్మతుల అనంతరం తిరిగి సముద్రంలోకి ప్రవేశించిందని, ఇది పూర్తిస్థాయిలో తన మిషన్‌కు సిద్ధంగా ఉందని యూఎస్ 6వ ఫ్లీట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఈ నౌకలోని లాండ్రీ విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది.
క్రొయేషియాలోని స్ప్లిట్ రేవు నుండి బయలుదేరిన తర్వాత విడుదల చేసిన ప్రకటనలో, "జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఏ ప్రాంతంలోనైనా కార్యకలాపాలు నిర్వహించడానికి జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ సిద్ధంగా ఉంది" అని పేర్కొన్నారు.
ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా మార్చి 12న ఎర్ర సముద్రంలో విధుల్లో ఉన్నప్పుడు ఈ నౌకలో మంటలు చెలరేగాయి.
Next Story

