ట్రంప్ గావుకేక.. మిత్రదేశాలు రావుగాక! యుద్ధంలో అమెరికా ఏకాకి!
x
ఇరాన్-అమెరకా యుద్ధం 18వ రోజుకు చేరింది..

ట్రంప్ గావుకేక.. మిత్రదేశాలు రావుగాక! యుద్ధంలో అమెరికా ఏకాకి!

ఇరాన్ పై యుద్ధం మాది కాదు, మేమెందుకు చేయాలి అంటున్న మిత్రదేశాలు


ఇరాన్-అమెరికా యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. ఉద్రిక్తతలు తగ్గడం లేదు. రోజురోజుకూ సెగ పెరుగుతోంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మిత్రదేశాలు ఆశించిన స్థాయిలో సహకరించక పోవడంపై ఆయన మండిపడుతున్నారు.
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో యూరోపియన్ దేశాలు అమెరికా విజ్ఞప్తిని తిరస్కరించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్రిటన్ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

యుద్ధం విషయంలో బ్రిటన్ స్పందన చూసి ఆశ్చర్యపోయానని, వారి తీరు ఏమాత్రం సంతోషంగా లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. నౌకలను పంపమని కోరితే తిరస్కరించారని, ఇప్పుడు యుద్ధ విమాన వాహక నౌకలను పంపుతామనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మాత్రం హర్మూజ్ జలసంధి చిక్కుముడిని విప్పేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
కలిసిరాకపోతే మీకుందే...
"ఎన్నో ఏళ్లుగా మేము కాపాడుతున్న దేశాలే ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. ఇలా అయితే మీకే నష్టం, ముందుకు రండి" అంటూ తనతో కలిసిరాని దేశాలకు ట్రంప్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
రంగంలోకి మార్కో రూబియో
అమెరికాకు అండగా నిలిచే దేశాల జాబితాను విదేశాంగ మంత్రి మార్కో రూబియో త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు జర్మనీ మాత్రం ఈ యుద్ధంలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. నౌకాయాన భద్రత కోసం బలగాలను పంపే ఆలోచన యూరోపియన్ యూనియన్ దేశాలకు లేదని స్పష్టమవుతోంది.
ట్రంప్ అసహనానికి కారణాలు ఇవీ...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ఆగ్రహానికి, అసహనానికి ప్రధానంగా మూడు రకాల కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మిత్రదేశాల సహాయ నిరాకరణ, రెండు ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాత్మక అడ్డంకులు, మూడు యుద్ధ క్షేత్రంలో ఎదురవుతున్న ప్రతికూలతలు.
మిత్రదేశాల నుంచి కొరవడిన మద్దతు...
ట్రంప్ ఆగ్రహానికి ప్రధాన కారణం తన చిరకాల మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఈ యుద్ధంలో అమెరికాకు వెన్నుదన్నుగా నిలవకపోవడం. దశాబ్దాలుగా అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న బ్రిటన్, హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నౌకలను పంపాలన్న అమెరికా విజ్ఞప్తిని తోసిపుచ్చింది. యూరోపియన్ యూనియన్ (EU) ఆసక్తి చూపడం లేదు. జర్మనీ వంటి దేశాలు ఈ యుద్ధంలో భాగస్వాములు కావడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. "మాకు యుద్ధం చేసే ఉద్దేశం లేదు" అని జర్మనీ బహిరంగంగానే ప్రకటించడం ట్రంప్‌కు మింగుడుపడటం లేదు.

ఇరాన్ చేతుల్లోనే హర్మూజ్ జలసంధి..

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ఇరాన్ చేతుల్లోనే ఉండడం ట్రంప్ సహనాన్ని పరీక్షిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులో 20% ఈ మార్గం ద్వారానే వెళ్తుంది.
ఇరాన్ అక్కడ డ్రోన్లు, క్షిపణులు, భూగర్భ బాంబులు (Mines) మోహరించి రవాణాను స్తంభింపజేసింది. దీన్ని విడిపించడానికి ఇతర దేశాల నౌకాదళాల సహాయం కోరినా, తగిన స్పందన రాకపోవడం ట్రంప్‌ను ఒంటరిని చేసింది.
కలిసివస్తాయని ట్రంప్ భావించిన దేశాలు..
చమురు రవాణాపై ఎక్కువగా ఆధారపడే, అమెరికా రక్షణ పొందుతున్న ఈ కింది దేశాలు నేరుగా యుద్ధనౌకలను పంపాలని ట్రంప్ కోరారు.
యూరప్: బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.
ఆసియా: చైనా, జపాన్, దక్షిణ కొరియా.
ఇతర: ఆస్ట్రేలియా, నాటో (NATO) సభ్య దేశాలన్నీ.
ఏవి కలిసి వచ్చాయి? ఏవి రాలేదు?
ఫ్రాన్స్ పాక్షిక మద్దతు ఇచ్చింది. హర్మూజ్ జలసంధిలో నౌకలకు రక్షణ ఇచ్చేందుకు (Escort mission) సిద్ధమని చెప్పింది.
బ్రిటన్ సందిగ్ధంలో ఉంది. మొదట నిరాకరించినా, ట్రంప్ విమర్శల తర్వాత కొంత మెత్తబడింది. నౌకలు కాకుండా "డ్రోన్ మైన్ హంటర్స్" (గనులను వేటాడే డ్రోన్లు) పంపుతామని అంటోంది.
జర్మనీ మద్దతు ఇవ్వబోమని తెగేసి చెప్పింది. ఇది మా యుద్ధం కాదు, మేము బలగాలను పంపబోమని స్పష్టంగా చెప్పేసింది. దౌత్య పరంగా పరిష్కరించాలని సూచిస్తోంది.
జపాన్, కొరియా వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. చమురు కోసం ఈ జలసంధి వీరికి చాలా ముఖ్యం. అయినా, యుద్ధంలో నేరుగా దిగడానికి భయపడుతున్నాయి.
చైనా మౌనం వహించింది. సహాయ నిరాకరణ చేస్తోంది. చైనా అతిపెద్ద చమురు దిగుమతిదారు అయినప్పటికీ, ట్రంప్ పిలుపుపై అధికారికంగా స్పందించలేదు.
EU (యూరోపియన్ యూనియన్)చర్చల దశలో ఉంది. ఎర్ర సముద్రంలో ఉన్న తమ "ఆస్పైడ్స్" (Aspides) మిషన్‌ను హర్మూజ్ వరకు విస్తరించాలని చూస్తోంది. కానీ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు.
ప్రతికూల ప్రచారం, దాడులు..
యుద్ధం 18వ రోజుకు చేరినా విజయం దిశగా అడుగులు పడకపోగా, అమెరికా ప్రతిష్ట దెబ్బతినే పరిణామాలు ఎదురవుతున్నాయి.
మానవ హక్కుల సంఘాల విమర్శలు: ఇరాన్‌లోని ఒక పాఠశాల పై జరిగిన దాడిలో 170 మంది విద్యార్థినులు మరణించడానికి అమెరికాయే కారణమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ఇవ్వడం అంతర్జాతీయంగా ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టింది.
బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడులు జరగడం అమెరికా రక్షణ వ్యవస్థకు సవాలుగా మారింది.
మిత్రపక్షాల ఆస్తులపై దాడులు: యూఏఈలోని ఆయిల్ ఫీల్డ్స్‌పై దాడులు జరగడం వల్ల ఆసియా దేశాల్లో చమురు భయం పెరిగి, అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది.
ట్రంప్ మాటల్లో చెప్పాలంటే, ఆయనకు కావాల్సింది "Enthusiasm" (ఉత్సాహం). తన మిత్రదేశాలు అమెరికాతో భుజం భుజం కలిపి పోరాడకుండా, కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుండటమే ఆయన కంపరానికి, కోపానికి అసలు కారణం.
ట్రంప్ ప్రభుత్వం హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఒక అంతర్జాతీయ నావికాదళ కూటమిని (Hormuz Coalition) ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
Read More
Next Story