సమయం లేదు మొజ్తాబా! దారి ఇస్తావా, ధ్వంసం చేయమంటావా?
x

సమయం లేదు మొజ్తాబా! దారి ఇస్తావా, ధ్వంసం చేయమంటావా?

అమెరికా హెచ్చరికను ఊడతఊపుల కింద కొట్టిపారేసిన ఇరాన్, మానవ హారాలకు పిలుపు


ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం 39వ రోజుకు చేరింది. పరిస్థితి తారాస్థాయికి చేరింది. శాంతి చర్చలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. హర్మోజ్ జలసంధి నుంచి తప్పుకోకపోతే ఇరాన్ ను ఒకే ఒక్క రోజులో ధ్వంసం చేస్తానని అమెరికా హెచ్చరికను ఇరాన్ తోసిపుచ్చింది. ఊడత ఊపులు వద్దని, యుద్ధాన్ని విరమించాల్సింది తామేనని ఇరాన్ అమెరికాపై ఎదురుదాడికి దిగింది. ఏ దేశం ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కొద్ది గంటల్లో తేలనుంది. అమెరికా చెప్పినట్టు ఇరాన్ పై దాడికి దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రంప్ ఏమన్నారంటే...

ప్రపంచం మరో మహా యుద్ధం అంచున నిలబడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో, మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారింది.

హర్మోజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, లేకుంటే ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. "మా మిలిటరీ శక్తి ముందు ఇరాన్ నిలవలేదు. రేపు రాత్రి 12 గంటల లోపు జలసంధిని తెరవకపోతే, ఇరాన్‌లోని ప్రతి వంతెనను, ప్రతి పవర్ ప్లాంట్‌ను బాంబులతో పేల్చివేస్తాం. ఆ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇరాన్‌కు 100 ఏళ్లు పడుతుంది" అని ట్రంప్ వైట్ హౌస్ నుంచి ప్రకటించారు.
మరోపక్క, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ పంపిన 10 అంశాల శాంతి ప్రతిపాదనను ట్రంప్ తోసిపుచ్చారు. "నాకు నచ్చే డీల్ ఉంటేనే అంగీకరిస్తా" అని ఆయన స్పష్టం చేశారు.

ఎదురుదాడికి ఇరాన్ సై...

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ మిలిటరీ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం 'భ్రమలు, పగటి కలలు' అని, అమెరికా ఓటమిని దాచుకోవడానికే ఇటువంటి బెదిరింపులకు దిగుతోందని ఎద్దేవా చేసింది.
పౌర నివాసాలపై దాడులు చేస్తే, అంతకంటే శక్తివంతమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరీ హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు గల్ఫ్ దేశాల్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

మానవహారానికి ఇరాన్ పిలుపు

హర్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ ఒక వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది.
ఇరాన్ యువజన, క్రీడల శాఖ డిప్యూటీ మంత్రి అలీరెజా రహీమీ, దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల చుట్టూ మానవహారాలుగా ఏర్పడాలని యువతకు పిలుపునిచ్చారు.

"ప్రకాశవంతమైన రేపటి కోసం ఇరాన్ యువత మానవహారం" (Iranian Youth’s Human Chain for a Bright Tomorrow) అనే జాతీయ ప్రచారంలో భాగంగా యువత, కళాకారులు, క్రీడాకారులు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మంగళవారం మధ్యాహ్నం 14:00 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) విద్యుత్ కేంద్రాల వద్ద చేతులు పట్టుకుని నిలబడాలని, "ప్రజా మౌలిక సదుపాయాలపై దాడి చేయడం యుద్ధ నేరం" అని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన 'X' (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు.
ఇరాన్ ప్రభుత్వం ఇలాంటి పిలుపులు ఇవ్వడం వెనుక ఉన్న కొన్ని వివాదాస్పద అంశాలను కూడా అంతర్జాతీయ సమాజం గుర్తు చేస్తోంది.
బాల సైనికుల చరిత్ర: 1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ఇరాన్ వేల సంఖ్యలో చిన్నారులను యుద్ధంలోకి దించింది. ఆ యుద్ధంలో పదివేల మందికి పైగా పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తూ పిల్లలను యుద్ధ రంగంలోకి పంపిన రికార్డు ఇరాన్‌కు ఉంది.
తాజా పరిణామాలు: గత నెల చివరలో కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, 12 ఏళ్ల వయస్సు గల పిల్లలను కూడా 'వాలంటీర్లు'గా చేర్చుకోవాలని పిలుపునిచ్చింది. వీరు పెట్రోలింగ్ వంటి యుద్ధ సంబంధిత పనుల్లో పాల్గొనాలని కోరినట్లు 'అమ్నెస్టీ ఇంటర్నేషనల్' నివేదించింది.
అమెరికా బాంబు దాడులు చేస్తానని హెచ్చరించిన ప్రాంతాల్లో (పవర్ ప్లాంట్లు) ఇలా పౌరులను, యువతను 'మానవహారం'గా నిలబెట్టడం ద్వారా వారిని 'హ్యూమన్ షీల్డ్స్' (మానవ కవచాలు) గా ఇరాన్ వాడుకుంటోందనే విమర్శలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది.

యుద్ధ క్షేత్రంలో తాజా పరిణామాలు

టెహ్రాన్ పై దాడులు: ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ప్రఖ్యాత 'షరీఫ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ'పై బాంబుల వర్షం కురిపించారు.
కీలక నేతల హతం: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖాదేమీని ఇజ్రాయెల్ హతమార్చింది.
ముంచెత్తిన క్షిపణులు: ఇరాన్ దాడుల కారణంగా ఇజ్రాయెల్ లోని హైఫాలో నలుగురు మృతి చెందగా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ దేశాలు క్షిపణి దాడులను తిప్పికొడుతున్నాయి.
అమెరికా గాలిసేన రక్షణ: ఇరాన్ గడ్డపై కూలిపోయిన అమెరికా F-15E యుద్ధ విమాన పైలట్లను 155 విమానాల సాయంతో సాహసోపేతంగా రక్షించినట్లు ట్రంప్ వెల్లడించారు.
అంతర్జాతీయ ప్రభావం:
చమురు సెగ: యుద్ధం కారణంగా గల్ఫ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొత్త ఇంధన వ్యవస్థపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
Read More
Next Story