అదును చూసి అమెరికాను దెబ్బ కొట్టిన ఇరాన్
x

అదును చూసి అమెరికాను దెబ్బ కొట్టిన ఇరాన్

రోజుకు 318 కోట్ల లీటర్ల చమురు రవాణా అయ్యే హర్మూజ్‌ జలసంధిపై ఎలా పట్టుబిగించిందంటే..


ఇరాన్ అదును చూసి దెబ్బకొట్టింది. దీంతో యావత్ ప్రపంచం చుక్కలు చూసినట్టయింది. ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించడంతో అమెరికా కూడా దిగిరాక తప్పేలా లేదు.

హర్మోజ్ జలసంధి రూట్ మ్యాప్

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఇరాన్‌ కీలకమైన హర్మూజ్‌ జలసంధి వద్ద రవాణాపై అడ్డంకులు సృష్టించింది. దీంతో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతే గ్లోబల్‌ ఇంధన సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమై చాలా దేశాలలో తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పుడీ భయమే అమెరికా వెనకడుగు వేసేలా చేసింది. ప్రపంచ మార్కెట్ దెబ్బతింటే డాలర్ సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.

రోజుకు రెండు కోట్ల బ్యారెళ్లు..

ప్రపంచ చమురు వాణిజ్యంలో హర్మూజ్‌ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇరాన్‌కు దిగువన, ఒమన్‌కు పైన ఉన్న ఈ సన్నని జలమార్గం ద్వారానే గల్ఫ్‌ దేశాల్లో ఉత్పత్తి అయ్యే చమురు, సహజవాయువు ప్రపంచ దేశాలకు చేరుతుంది.
ప్రపంచ సముద్ర మార్గ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. సగటున రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు (1 బ్యారెల్ అంటే సుమారు 159 లీటర్లు. రోజుకు సుమారు 318 కోట్లు లీటర్ల చమురు) హర్మూజ్‌ ద్వారా రవాణా అవుతుంది.
చమురు రవాణాలో మలేసియా–ఇండోనేసియా మధ్యనున్న మలక్కా జలసంధి తర్వాత అత్యంత రద్దీగా ఉండే మార్గం ఇదే. లిక్విడ్ సహజ వాయువు (LNG) సరఫరాలోనూ ఇది కీలక కేంద్రంగా ఉంది.
పైప్‌లైన్లు ఉన్నా ప్రత్యామ్నాయం లేదు...
హర్మూజ్‌ జలసంధి వెడల్పు కొన్ని ప్రాంతాల్లో కేవలం 21 మైళ్లే. అందుకే దీన్ని ప్రపంచ ఇంధన వాణిజ్యంలో ‘చోక్‌పాయింట్‌’గా పరిగణిస్తారు.

సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఈ మార్గాన్ని బైపాస్‌ చేసేందుకు పైప్‌లైన్లు నిర్మించినప్పటికీ వాటి సామర్థ్యం పరిమితమే. గల్ఫ్‌ ప్రాంతం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం చమురుతో పోలిస్తే పైప్‌లైన్ల ద్వారా తరలించగలిగేది చాలా తక్కువ. అందుకే హర్మూజ్‌ మార్గంలో రవాణా నిలిచిపోతే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ ఒక్కసారిగా కుదేలవుతుంది.
ఆయుధంగా మారిన భౌగోళిక ఆధిక్యం
ఈ జలసంధిపై భౌగోళిక ఆధిక్యం ఉన్న ఇరాన్‌ ప్రస్తుతం దానిని వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగిస్తోంది. ఆ మార్గంలో ప్రయాణించే ట్యాంకర్లపై దాడులు జరగవచ్చని హెచ్చరికలు రావడంతో వందలాది చమురు నౌకలు సముద్రంలోనే నిలిచిపోయాయి.
ఇదిలా ఉండగా పశ్చిమాసియాలోని కీలక చమురు, గ్యాస్‌ క్షేత్రాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఇరాన్‌, సౌదీ అరేబియా, ఖతార్‌ ప్రాంతాల్లోని కొన్ని ఇంధన కేంద్రాలు దెబ్బతిన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో చమురు ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలు కూడా అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చమురు ధరల దూకుడు
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 119 డాలర్లకు పైగా చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత మొదటిసారి మళ్లీ ఈ స్థాయికి పెరిగింది. హర్మూజ్‌ జలసంధి సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని గల్ఫ్‌ దేశాల ఇంధన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌పై ప్రభావం
పశ్చిమాసియా దేశాలపై భారత్‌ భారీగా ఆధారపడుతోంది. దేశానికి అవసరమైన ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో 46% ఖతార్‌ నుంచి, మరో 13% యూఏఈ నుంచి వస్తోంది.
హర్మూజ్‌ మార్గంలో అంతరాయం కొనసాగితే చమురు, గ్యాస్‌ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. దాని ప్రభావం ఇంధన ధరల పెరుగుదల రూపంలో భారతీయ వినియోగదారులపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

హర్మూజ్‌ జలసంధి ప్రపంచ ఇంధన వాణిజ్యంలో కీలకమైందిగా ఉండటంతో అక్కడ ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే చమురు ధరలు పెరుగుతుండగా… పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచ మార్కెట్లలో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read More
Next Story